Sunday, May 20, 2012
 

LET US MEET AND INTERACT!

“One man may hit the mark, another blunder;
but heed not these distinctions.
Only from the alliance of the one,
working with and through the other, are great things born.”

For more details:

Mahanty Venkata Rao @ Narayana naidu
98485-03509
Mr S.Ch. Rangaiah Editor,
Kapu chaitanyam ( 97053-47213)

 

 

కడపజిల్లా ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ పోరాటం

వైఎస్‌ఆర్‌ కడపజిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రెండు పర్యాయాలు పర్యటించి కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. జిల్లా మంత్రులు అహ్మదుల్లా, రామచంద్రయ్యలతోపాటు ఎమ్మెల్యేలు కమలమ్మ, వీరశివారెడ్డిలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీకూడా ఎన్నికలకోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాజకీయ పక్షాలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉండాని పార్టీ వర్గాలకు డీసీసీ అధ్యక్షులు అశోక్‌కుమార్‌ సూచించారు.

 

రాష్ట్రపతి నియామకంలో మాజీ లోక్‌సభ స్పీకర్ పేరు

* ఎనిమిదిసార్లు ఎంపీగా చేసిన అనుభవం
* గిరిజన నేత కావడం కలిసొచ్చే అంశం
* సంగ్మాను బలపరుస్తున్న బీజేడీ, అన్నాడీఎంకే

రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలకు గండిపడుతోందా…? రాష్ట్రపతి పదవిని చేపట్టి తన చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలనుకుంటున్న ప్రణబ్‌ దాదాకు పోటీ ఎదురవ్వబోతోందా..? పరిస్థితి చూస్తే అలాగే ఉంది. రైసినా హిల్స్ రేసులో కొత్త అభ్యర్థిగా పీ.ఎ సంగ్మా తెరమీదకు రావడంతో.. రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారం రసకందాయంలో పడింది.

రాష్ట్రపతి ఎన్నికలో ఏకాభిప్రాయం సాధించాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలకు యూపీయేతర పక్షాలు గండికొడుతున్నాయి. దేశ రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుగాంచిన మేఘాలయా యోధుడు పీ.ఏ సంగ్మాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలని బీజూ జనతాదళ్, అన్నాడీఎంకే నిర్ణయించాయి. ఎనిమిది సార్లు ఎంపీగా చేసిన అనుభవంతో పాటు, ఎన్డీయే హయాంలో లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన అనుభవం సంగ్మా సొంతం. దీనికి తోడు తొలిసారి గిరిజనుడికి రాష్ట్రపతి అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే కొన్ని పార్టీలు కులం కార్డును తెరమీదకు తేవడం కూడా సంగ్మాకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.

రాష్ట్రపతి పదవి చేపట్టేందుకు సంగ్మాకు అన్ని అర్హతలు ఉన్నాయని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా సంగ్మా అభ్యర్ధిత్వాన్ని బలపరిచారు. అటు… భావసారూప్యం ఉన్న ఎన్డీయే పక్షాలతో చర్చించి సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపర్చేందుకు జయలలిత ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. మొత్తంమీద మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే రానున్న కాలంలో రాష్ట్రపతి ఎన్నికలో పోటీ తప్పనిసరి అయ్యేలానే కనిపిస్తోంది.

 

లోక్‌పాల్ బిల్లుపై కేంద్ర కేబినెట్ నేడు సముదాయం

* సోమవారం రాజ్యసభలో బిల్లు పెట్టనున్న కేంద్రం

లోక్‌పాల్ బిల్లుకు మోక్షం కలిగించేందుకు కేంద్రం మళ్లీ కసరత్తు మొదలుపెట్టింది. బిల్లుకు సవరణలు చేసే అంశంపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ సాయంత్రం సమావేశం కానుంది. రాజ్యసభలో సోమవారం బిల్లు పెట్టాలని భావిస్తున్నందున ఈలోపు సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిశీలించి పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. లోకాయుక్తల ఏర్పాటు అంశాన్ని రాష్ట్రాల విచక్షణకే వదిలేయడం, 100 మందికిపైగా ఎంపీలు లోక్‌పాల్‌పై రాష్ట్రపతిని కలిసి అభ్యంతరం చెప్తే దాన్ని రద్దు చేయడం వంటి వాటిని పరిశీలించనున్నారు. లోక్‌పాల్‌ అధ్యక్షుడి నియామకం, సీబీఐ డైరెక్టర్‌ను నియమించే అధికారం వంటివి కేంద్రం చేతుల్లోనే ఉండాలన్న వాదన పైనా చర్చించనున్నారు. ఈ సెషన్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ లోక్‌పాల్‌ బిల్లు పెద్దల సభ ఆమోదం పొందేటట్లు చేసేందుకు యూపీఏ కృత నిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి నారాయణ స్వామి అన్నారు.

 

ఆసక్తిని రేపుతున్న కర్ణాటక రాజకీయాలు

కర్నాటక రాజకీయం రసకందాయంలో పడుతోంది. మాజీ సీఎం యడ్యూరప్ప అధికారికి నివాసం ఖాళీ చేయడం, బీజేపీ పాత కార్యాలయాన్ని అద్దెకు తీసుకోవడంతో సొంత పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఆయన పక్షాన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చేరడంతో పార్టీ ఏర్పాటు దాదాపు ఖాయమంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యడ్డీ కొత్త పార్టీ పెడ్తారంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో కర్నాటకలో రాజకీయాలు ఏ క్షణాన ఎలాంటి మలుపుతిరుగుతాయోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

 

జగన్‌ ఆస్తుల కేసులో కీలక మలుపులు

* జగన్‌ మీడియా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు జీవో జారీ
* CBI లేఖకు రాష్ట్ర సర్కారు అనుమతి
* జనని ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్‌, ఇందిరా టెలివిజన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు జీవోలు జారీ
* సునీల్ రెడ్డి, సాక్షి, కోనేరు ప్రసాద్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌లపై మూడు జీవోలు
* కాన్ఫిడెన్షియల్‌ జీవోలు 87,88, 89 జారీ చేసిన హోంశాఖ
* జీవో 87 సునీల్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌(ఎమ్మార్‌ కేసు)
* జీవో 88 కోనేరు ప్రసాద్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌(ఎమ్మార్‌ కేసు)
* జీవో 89 జగన్‌ మీడియా ఆస్తుల అటాచ్‌మెంట్‌

జగన్‌ ఆస్తుల కేసులో అటాచ్‌మెంట్‌ ఇస్తూ రాష్ట్ర హోంశాఖ కాన్ఫిడెన్షియల్‌ జీవోలు జారీచేసింది.

 

OMC, ఎమ్మార్‌, జగన్‌, కేసులు

* ఎమ్మార్‌, OMC, జగన్‌ కేసుల విచారణను ముమ్మరం చేసిన ఈడీ
* ఈ మూడు కేసుల్లో జైల్లో ఉన్న నిందితులను విచారించేందుకు పిటిషన్‌ దాఖలు చేసిన ఈడీ
* ఇప్పటికే CBI దాఖలు చేసిన ఛార్జిషీటు, వాంగ్ములాల అనుమతి పొందిన ఈడీ
* గుబులు రేపుతున్న ఈడీ పిటిషన్‌
* కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
* OMC కేసులో జైల్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్, శ్రీలక్ష్మి
* ఎమ్మార్‌ కేసులో జైల్లో ఉన్న కోనేరు, బీపీ ఆచార్య, సునీల్‌రెడ్డి, విజయరాఘవ
* జగన్‌ కేసులో జైల్లో ఉన్న నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి

OMC, ఎమ్మార్‌, జగన్‌, కేసుల విచారణను ఈడీ ముమ్మరం చేసింది. ఈ మూడు కేసుల్లో జైల్లో ఉన్న నిందితులను విచారించేందుకు అనుమతి కోరుతు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

 

ఉపఎన్నికల నోటిఫికేషన్‌

* ఉపఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష
* మతం, కులం, జాతి పేరుతో ప్రచారం చేస్తే కఠన చర్యలు: ఈసీ
* మద్యం, డబ్బు పంపిణీపై కమిషనర్ బ్రహ్మ ఆందోళన
* అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్నికల హింస
* టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిపై కాంగ్రెస్ వర్గీయుల దాడి
* రాయదుర్గంలో టీడీపీ ప్రచారరథం ధ్వంసం
* 15 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలు

ఉపఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టానికి తెరలేసింది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్ బ్రహ్మ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం మంచిరోజు కావడంతో పలువురు అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు ఫైల్ చేశారు. మరోవైపు.. అనంత ఎన్నికల ప్రచారంలో హింస చెలరేగింది.

రాష్ట్రంలోని ఒక పార్లమెంట్, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ల పర్వానికి తెరలేచింది.
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర ఎన్నికల కమీషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ ఉప ఎన్నికల ఏర్పాట్లపై డీజీపీ, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలు జరుగనున్న 12 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం, డబ్బు పంపిణీపై బ్రహ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన స్లిప్‌ గాని ఎన్నికల గుర్తింపు కార్డు గాని ఉంటేనే ఓటింగ్‌ కు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. కులం, మతం, జాతి పేరుతో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బ్రహ్మ హెచ్చరించారు.

మరోవైపు.. శుక్రవారం మంచిరోజు కావడంతో తొలిరోజే జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి భూమన కరుణాకర్‌ రెడ్డి తరఫున ఆయన తనయుడు అభినయ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం బీజేపీ అభ్యర్థి జల్లి మధుసూదన్‌ కూడా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు.. ఒంగోలు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ కూడా తొలిరోజే నామినేషన్‌ వేసారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం, మంత్రి మాణిక్యవరప్రసాద్‌, పలువురు ఎమ్మెల్యేలు.. పార్వతమ్మతో ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. అంతకుముందు నిర్వహించిన ర్యాలీలో ఎంపీ మాగుంట మైమరచి చిందులు వేయడం హైలెట్‌గా నిలిచింది. ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని పార్వతమ్మ ధీమా వ్యక్తం చేశారు.

ఇక అటు… ఉపఎన్నికల్లో హింసాకాండ కూడా మొదలైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌, టీడీపీ శ్రేణులు బాహాబాహికి దిగారు. టీడీపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్‌ వర్గీయులు… అభ్యర్థి దీపక్‌రెడ్డిపై కూడా దాడి చేశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న దాడిలో 15 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డవారిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

జగన్ కేసులో సంబంధం ఉన్న వారు జైళ్లకు వెళ్లక తప్పదు!

శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చిల్లర దొంగలను పోర్జరీ కేసుల్లో అరెస్టు చేస్తున్నారని, అలాంటప్పుడు కడప లోకసభ సభ్యుడు,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తప్పు చేసినట్లు రుజువైతే ఎందుకు అరెస్టు చేయకూడదని బొత్స ప్రశ్నించారు.

చంద్రబాబు కాంగ్రెసు పార్టీని విమర్శించే ముందు తన సంగతి చూసుకోవాలన్నారు. చంద్రబాబుతో వేలెత్తి చూపించుకునే స్థితిలో కాంగ్రెసు ప్రభుత్వం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. ఉప ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు జరుగుతుందని, ముఖ్యమంత్రిని మారుస్తారని వస్తున్న వార్తలను బొత్స సత్యనారాయణ ఖండించారు. 2014 వరకు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారని, తాను పిసిసి అధ్యక్షుడుగా ఉంటామని బొత్స స్పష్టం చేశారు. మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమైతే వారికి శిక్ష తప్పదన్నారు. జగన్ ఆక్రమాస్తుల కేసులో సంబంధం ఉన్న వారు జైళ్లకు వెళ్లక తప్పదన్నారు. జగన్‌కు చెందిన సాక్షి మీడియాకు ప్రకటనల నిలిపివేతపై హైకోర్టులో స్టే వచ్చినంత మాత్రాన తన మాట మారదన్నారు. ప్రకటనల నిలిపివేత నిర్ణయం సమర్థనీయమేనని బొత్స పేర్కొన్నారు.

నీతివంతమైన పాలన గురించి మాట్లాడుతున్న జగన్ తనపై వస్తున్న ఆరోపణల నుండి బయటపడి ఎంత నీతిపరుడో నిరూపించుకోవాలని బొత్స సవాల్ చేశారు. తన సంస్థలలోకి వచ్చిన పెట్టుబడులపై జగన్ జవాబు చెప్పాల్సిందేనని అన్నారు. జగన్ నీతి ఏమిటో సిబిఐ విచారణలో తెలుస్తుందన్నారు. అవకాశాన్ని ఆసరాగా తీసుకొని జగన్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటూ బొత్స ధ్వజమెత్తారు.

కడప లోకసభ సభ్యుడు,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని అక్రమ ఆస్తుల కేసులో  ఎందుకు అరెస్టు చేయకూడదు? ఆయనను అరెస్టు చేస్తే ప్రళయం వస్తుందా ?  ఇలాంటి బెదిరింపులకు ప్రభుత్వం చలించే ప్రసక్తే లేదని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని   పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దోపిడీ దారులను నాయకులుగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని ఆయన అన్నారు.

 నీతివంతమైన పాలన గురించి మాట్లాడుతున్న జగన్ తనపై వస్తున్న ఆరోపణల నుండి బయటపడి ఎంత నీతిపరుడో నిరూపించుకోవాలని బొత్స సవాల్ చేశారు. తన సంస్థలలోకి వచ్చిన పెట్టుబడులపై జగన్ జవాబు చెప్పాల్సిందేనని అన్నారు. జగన్ నీతి ఏమిటో సిబిఐ విచారణలో తెలుస్తుందన్నారు. అవకాశాన్ని ఆసరాగా తీసుకొని జగన్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటూ బొత్స ధ్వజమెత్తారు. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, మరొకరు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన బొత్స మండిపడ్డారు.

 

వాన్పిక్ భూ కేటాయింపులన్నీ ‘క్విడ్-ప్రొ-కో” న జరిగినవే! -సిబీఐ

కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు…! 

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సి బీ ఐ అరెస్టు చేసింది. వాన్పిక్ పేరుతొ వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసిందుకు ఆయన ఇప్పుడు చంచల్ గూడా జైలులో ఊచలు లెక్క బెడుతున్నారు. కానీ మా మిత్రుడు ఏడుకొండలు మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నాడు. ఏడుకొండలుకు నిమ్మగడ్డ తో వ్యాపార పరమైన వైరమేమీ లేదు, అసలు ఆయనతో పరిచయం కూడా లేదు. కాకపోతే ఆయన వాన్పిక్ విద్వంసానికి ప్రత్యక్ష సాక్షి. వాన్పిక్ వల్ల ఉపాదికోల్పోయిన పల్లెకారుల ప్రతినిధి. సింగోతు ఏడుకొండలుది ప్రకాశం జిల్లా చినగంజాం మండలం లో ఒక చిన్న పల్లె. ఆ పల్లెనిండా పల్లెకారులే! సముద్రాన్నే నమ్ముకుని చేపలుపట్టి ఉపాధి పోసుకోవడం పల్లెకారుల వృత్తి. వారిలో చదువుకునే వాళ్ళే అరుదు. అటువంటి కుటుంబంలో చీరాలలో డిగ్రీ దాకా చదివిన ఏడుకొండలు తండ్రి మరణంతో పైచదువులకు స్వస్తి పలికి సముద్రాన్ని ఈదే సాహసం చేయలేక పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆశ్రయమిచ్చి ఆదుకుంది. ఉస్మానియా లో ఎం ఏ సైకాలజీ, బీ ఈ డీ, ఎం ఫిల్ చేసిన ఏడుకొండలు ఒకవైపు చదువుకుంటూనే చిన్నా చితకా పనులు చేసి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసారు. బాధ్యతలన్నీ తీరిపోయాయనుకున్న సమయంలో వాన్పిక్ ఉప్పెన వాళ్ళ ఊర్లన్నీ ముంచేసింది. ఉన్న ఎకరం, అరెకరం కూడా మిగలకుండా పోయేసరికి చిన్నా చితకా కుటుంబాల పరిస్థితి ఆయనను కలవర పెట్టింది.

ఆ సమయంలో ఏడుకొండలు మా విశ్వవిద్యాలయం లో తాత్కాలికంగా పనిచేసేవాడు. తెలంగాణా ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న కాలంలో ఆయన ఉద్యమానికి తన పూర్తి మద్దతునిచ్చాడు. తాము కోస్తాలోనే ఉన్నా తమ పరిస్తితి తెలంగాణా లాగే ఉందని, అక్కడి సంపన్నులు తమని బతుకనిచ్చే పరిస్థితి లేదని వాపోయేవారు. వాన్పిక్ పేరుతో నిమ్మగడ్డ ప్రసాద్ సాగిస్తోన్న భూ సేకరణ బాగోతాన్ని వివరించి మమ్మల్ని వాళ్ళ ఊరికి ఆహ్వానించారు. నాతో పాటు పనిచేసే కొందరు అధ్యాపకులు, ఒకరిద్దరు జర్నలిస్టు మిత్రులం ఆయనతో పాటు వెళ్ళాం. రెండు రోజుల పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ కబంద హస్తాల్లో చిక్కుకున్న పల్లెల్ని వాన్పిక్ విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. బంగారం పండే భూములు, పుష్కలంగా నీల్లున్నా సాగుచేయలేని స్థితిలో ఉన్న రైతులు, సముద్రం ఒడ్డునే ఉన్నా అందులో చేపలుపట్టే హక్కులు లేని స్థితిలో పల్లెకారులు, ఊళ్ళో వ్యవసాయ పనుల్లేక ఉపాధి కోల్పోయిన కూలీలు, దళితులు ఇట్లా ఆ పల్లెలు కన్నేరుపెట్టడం కనిపించింది. తిరుగు ప్రయాణంలో సర్ మనం వీళ్ళకోసం ఏమైనా చేయగలమా? అని ఏడుకొండలు మళ్ళీ అడిగాడు. అప్పటికి రెండేళ్లుగా తెలంగాణా ప్రజలంతా ఏకభిగిన పోరాడుతున్నా స్పందించని ప్రభుత్వం తానే విధ్వంసానికి దిగుతుంటే ఏం చేయగలం. అప్పటికే ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం వాన్పిక్ కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. అదొక్కటే పరష్కారం అనుకున్నాం. ఇప్పుడు అనుకోకుండా వాన్పిక్ అధినేత జైలు పాలు కావడం ఒప్పందాలు రద్దవుతాయన్న వార్తలు వస్తోన్న నేపద్యంలో ఏడుకొండలు కు ఫోన్ చేసాను. ఆయన స్వరంలో ఒక కొత్త ఆశ ద్వనించింది. ఇదే ఆశ ఇప్పుడు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని లక్షలాది మందిలో ప్రతిధ్వనిస్తోంది. అక్కడి రైతులు తమ భూములు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాన్పిక్ ను రద్దుచేసి తీరాలని కోరుతున్నారు.

జగన్ అక్రమ ఆస్తుల కేసులో సి బీ ఐ విచారణ, నిమ్మగడ్డ అరెస్టు పుణ్యమా అని ఇవాళ ఆకడి ప్రజలకు ఆ ధైర్యం వచ్చింది. వాన్పిక్ అనే సంస్థకు జరిగిన భూ కేటాయింపులన్నీ ‘క్విడ్-ప్రొ-కో” ప్రాతిపదికన జరిగినవేనని సి బీ ఐ అంటోంది. న్యాయ శాస్త్ర పరిభాషలో “క్విడ్-ప్రొ-కో” ఆంటే బదులుకు బదులు అని. ఆంటే దాదాపు ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది. మీకు ఎవరైనా మేలుచేస్తే అందుకు ప్రతిగా మీరు అతనికి చేసే మేలు అన్నమాట. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంపదలో దాదాపు ఎనిమిది వందల కొట్లు జగన స్థాపించిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడని సి బీ ఐ గుర్తించింది. ఆయన ఒక వ్యాపారవేత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ అలా పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలను ఆయనకు రాసిచ్చాడని, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అలా భూములు కేటాయించే ముందు కనీస నిబంధనలు పాటించలేదని, మంత్రివర్గ ఆమోదం కూడా పొందకుండానే పనులు జరిగాయని, ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత లేదని ఇలా తవ్విన కొద్దీ అనేక పెంకులు అందులో దొరుకుతున్నాయి. సాక్షి, టీ వీ, చానెల్, పత్రికలో పెట్టుబడులు పెట్టినందుకు వంపిక్ అనే సంస్థకు భూ కేటాయింపు జరిగిందని చెపుతున్నారు. అందులో నిజమెంతో కోర్టులు తేల్చాల్సి ఉంది. అది పక్కన పెడితే వాన్పిక్ కోస్తాలో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అధికార బలాన్ని ఆసరా చేసుకుని ఆ ఆ సంస్థ అనేక అమానవీయ చర్యలకు పూనుకుంది.

వాన్పిక్ పూర్తి పేరు వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ & ఇండస్త్రియాల్ కారిడార్. ప్రకాశం జిల్లాలోని చీరాల దగ్గర ఉన్న వాడరేవు అనే ఊరినుంచి గుటూరు జిల్లా నిజాంపట్నం వరకున్న కోస్తా తీరాన్ని రాజశేకర్ రెడ్డి గారి హయాంలో నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ సంష్తకు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఓడరేవులు నిర్మిస్తానని, విద్యుత్ ఉత్పత్తికి పవర్ స్టేషన్ లు నెలకొల్పుతామని, పారిశ్రామిక వాడలు, ఆధునిక విమానాశ్రయం కడతామని నమ్మబలికి ఆయన ఇక్కడ భూసేకరణకు పూనుకున్నారు. ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా ఆయన కంపనీకి భూసేకరణకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆఘమేఘాలమీద దాదాపు 34 గ్రామాల్లో 15 వేల ఎకరాల భూమిని తీరప్రాంతంలో ఆయనకు కేటాయించింది. దీనిలో దళితులు గత ముప్పై సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములతో పాటు అటవీ  భూములు, సముద్రపు కోతను ఆపేందుకు   చెట్లనుపెంచే నేలలూ ఉన్నాయి.

ఇలాంటి భూములు కేటాయించడం పర్యావరణానికి ముప్పు అనీ, తీర ప్రాంతాల భూములు ప్రైవేటు కంపనీలకు ఇవ్వడం దేశ భద్రతకు ప్రమాదమని నిపుణులు చెప్పినా రెడ్డి గారు వినలేదు సరికదా మరింత భూమి ప్రయివేటు వ్యక్తులనుంచి, రైతులనుంచి సేకరించుకునే స్వేచ్చను ఆ కంపనీకి ఇస్తూ ఆదేశాలిచ్చారు. ఈ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకునా పూర్తిచేసేందుకు రైల్వే శాఖలో ఉన్న తన బంధువు బ్రమ్హానంద రెడ్డి ని ప్రత్యక అధికారిగా నియమించారు. ఇంకేముంది నిమ్మగడ్డ తన సామ్రాజ్యాన్ని ౩౦ వేల ఎకరాలకు విస్తరించాడు. అప్పటి కలెక్టర్లు మొదలు, రెవిన్యూ యంత్రాంగమంతా రెండేళ్ళ పాటు ఈ పనిలో తరించింది. వాన్పిక్ ఇచ్చిన పరిహారంతో పెద్ద భూస్వాములు, కమీషన్ లతో బ్రోకర్ లుగా పనిచేసిన చోటా మోటా రాజకీయ నాయకులు, ఎం ఎల్ ఏ లు, మంత్రులు కోట్లకు పడగలెత్తారు. లక్షలాది రైతులు, కూలీలు, సముద్ర తీరాన్ని రేవులను నమ్ముకుని బతికే మత్సకారులు వీధిన పడ్డాయి. దాదాపు నలభై గ్రామాలు స్మశానంగా మారే పరిస్తితి వచ్చింది. ఒక్క సి పీ ఐ మినహా అన్నిపార్టీల నాయకులను కంపనీ కొనేసి ప్రతిఘతిస్తోన్న ప్రజల గొంతులు వినిపించకుండా చేసేసాయి. ఆ ప్రాజెక్టును వ్యతిరేకించే వాళ్ళెవరూ అక్కడ అడుగుపెట్టకుండా పోలీసులతో దిగ్భందం చేసి భూసేకరణను జరిపారు. ఈ సందర్భంగానే సి పీ ఐ నాయకులు నారాయణ రహస్యంగా పడవలో ప్రయాణించి అక్కడికి చేరుకుంటే మీడియా అక్కడ ఆయన గాంధీ జయంతి రోజున చికెన్ తింటున్న దృశ్యాన్ని చిలువలు పలువలు చేసినంతగా అక్కడి పోరాటాన్ని ప్రచురించలేదు, ప్రసారం కూడా చేయలేదు. అలా అందరినీ కోనేయగల శక్తి కలిగిన నిమ్మగడ్డ ఇప్పుడొక చానెల్ కు అధిపతి మరొక చానెల్ కు పెట్టుబడి దారుడు! ఇప్పుడు నిమ్మగడ్డ అరెస్టు పత్రికా స్వేచ్చను హరించడమే అని కూడా ఎవరైనా అనవచ్చు!!
నిజానికి పత్రికా స్వేచ్చ ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మన రాజ్యాంగంలో మనిషికి మించిన హక్కు మరెవరికీ లేదు. రాజ్యాంగం ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్చ ఉందన్తూనే ఆ తరువాతి పేరాలోనే దానికుండే పరిమితులను కూడా చెప్పింది. ప్రజల భావ ప్రకటన స్వేచ్చకు వాహికగా ఉన్నదే మీడియా కాబట్టి రాజ్యాంగం చెప్పిన పరిమితులకు లోబడే మీడియా పనిచేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం మీడియా స్వేచ్చను ప్రస్తావించక పోయినా మీడియాకు స్వేచ్చ ఉండాలన్నది ఒక ప్రజా స్వామిక ఆకాంక్ష. ఆ ఆకాంక్షను అనేక కోర్టులు నిర్ధారించాయి కూడా. అలాగే మీడియా స్వేచ్చ ఆంటే పాత్రికేయుల స్వేచ్చ. పత్రిక రచయితలు, ప్రచురణ కర్తల స్వేచ్చ అని అనేక సందర్భాల్లో కోర్టు లు తేల్చాయి. అంతే తప్ప యజమానుల స్వేచ్చ కాదని గుర్తించాలి. సాక్షి తెలుగు జర్నలిజం లో ఒక క్రియాశీలమైన పాత్ర పోషించింది. సాక్షి లో వచ్చిన వార్తల వల్ల ముఖ్యంగా ఈ రెండేళ్లలో నాణేనికి రెండో వైపు ఏముందో తెలిసి వచ్చింది. ఆ పత్రిక రాతలను, ప్రచురణను ఎవరైనా అడ్డుకోవడం ముమ్మాటికి పత్రికా స్వేచ్చ కిందికే వస్తుంది. ఇప్పుడు సి బీ ఐ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సాక్షి సిబ్బందిలో పాతకుల్లో ఆందోళన కు కారణం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పత్రిక ప్రచురణకు ఆటంకం కలిగించే విధంగా ఉంటున్నాయి. దాన్ని తప్పుపట్టవచ్చు. కానీ ఇదంతా నేరవిచారణలో భాగం అయినప్పుడు విచారణ జరిపే అధికారాన్ని ప్రశ్నించలేము. పత్రిక ప్రచురణకు, సిబ్బంది భద్రతకు భంగం కలుగకుండా ఏ విచారణయినా జరగాలి. పత్రికా స్వేచ్చ పేరుతో విచారణను అడ్డుకున్నా, విచారణ పేరుతో పత్రికా స్వేచ్చను హరిన్చినా న్యాయం కాదు. దీన్ని ప్రజాస్వామ్య వాదులెవరూ హర్షించ కూడదు. పత్రిక , చానల్ ఏదైనా ఒక ప్రయివేటు యాజమాన్యంలో నడిచే వ్యాపార సంస్థ, ఆ సంస్థ మూతపడితే దానికి యాజమాన్యం బాధ్యత వహించాలి. ఒకవేళ ప్రభుత్వం అన్యాయంగా మూత వేస్తే ప్రభుత్వం మీద జర్నలిస్టు సంఘాలు పౌరసమాజం ఒత్తిడి తెచ్చి దాన్ని తెరిపించాలి. అంతే  తప్ప ఇది పత్రిక కాబట్టి ఆ పత్రిక యజమానిమీద విచారణ వద్దన్నా, ఆ యజమాని తెచ్చిన పెట్టుబడులను ముట్టుకోవద్దన్నా భావ్యం కాదేమో ఆలోచించాలి. అదే న్యాయమని ఎవరైనా వాదిస్తే ఇక ముందు మనం ఏ పెట్టుబదిదారున్నీ విచారించాలేము. కాబట్టి పత్రికా స్వేచ్చను యజమానుల స్వేచ్చతో ముడిపెట్టి చూడకూడదు.
విచిత్రంగా కొందరు నిమ్మగడ్డ అరెస్టు ను పారిశ్రామిక ప్రగతికి అవరోధమని అంటున్నారు. సమాజంలో గౌరవ ప్రదమైన హోదాల్లో ఉన్న సంపన్నులను, పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న పారిశ్రామిక వేత్తలను అరెస్టు చేస్తున్నారని వాపోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు విచారణలో ఉన్న ఈ పెద్దమనుషులు ఈ రాష్ట్రంలో వేలాది కుటుంబాల్లో విధ్వంసం స్తుష్టించారన్న సంగతి దాచిపెడుతున్నారు. వాళ్ళ భూదాహానికి పాలమూరు జిల్లా పోలేపల్లి పేద రైతులతో సహా లక్షలాది జీవితాలు చిందర వందరైన సంగతి మరిచిపోతున్నారు. ప్రజల పోట్టలుగొట్టి పెట్టుబడులు పెట్టే ఇటువంటి పారిశ్రామిక వేత్తలేనా మనకు కావాల్సింది ఆన్న విషయాన్ని ఏ ఒక్కరూ ప్రస్తావించక పోవడం మన సంకుచిత అభివృద్ధి ఆకాంక్షకు పరాకాష్ట. ఇప్పుడు వాన్పిక్ ఒప్పందాన్ని రద్దుచేసి ఆ భూములను తిరిగి అక్కడి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఏమార్, పోలేపల్లి మొదలు చంద్ర బాబు హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి రాజ్యందాకా సాగిన భూ పందేరాలన్నిటి మీదా విచారణ జరగాలి. ఇప్పుడు కోస్తాలో మొదలవుతున్నావాన్పిక్ భూస్వాధీన పోరాటం తెలంగాణా ఉద్యమానికి కూడా ఒక మోడల్ కావాలి. అక్కడైనా ఇక్కడయినా ఆక్రమణ దారుడు ఒకడే! లంకోహిల్ల్స్ , ఏమార్ , పోలేపల్లి అన్నీ అక్రమాలేనని విచారణలో తేలుతున్నది. వీటి మీద తెలంగాణా వాదులు దృష్టిపెట్టాలి. అక్రమంగా తీసుకున్న భూములన్నీ ప్రజలకు చెందాలి. ప్రజల ఆమోదంతోనే భూకేటాయింపులు జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్ఖ, లేకపోతే మన మాటలు, రాజకీయాలు, ఉద్యమాలు అన్నీ క్విడ్-ప్రొ-కో అనే భావించాల్సి ఉంటుంది.

-Ghanta Chakrapani.

“Ghantapatham”

 
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com