కడప జిల్లాపై సిఎం ప్రత్యేక దృష్టి
కడప: కడప జిల్లాలో వైఎస్ జగన్ అనుచర ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సంభవించబోయే మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గెలుపే ధ్యేయంగా నాయకులతో చర్చించి సర్వేల ద్వారా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే రాష్ట్ర ఆరోఘ్య మంత్రి డా.డి.ఎల్ రవీంద్రారెడ్డి ఏకంగా ముఖ్యమంత్రిపైనే తిరుగుబాటు చేయడంతో ఈ ఎన్నికలను సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినందున ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మాజీ ఎంపి గునిపాటి రామయ్య నిర్ణయంపైనే అభ్యర్ధి ఎంపిక ఉంటుంది. అక్కడ మాజీ ఎంపిపి కె.ఈశ్వరయ్య, మాజీ మంత్రి సర్వతమ్మ, మాజీ ఎమ్మెల్యే దివంగత నేత చెన్నయ్య కోడలు అన్నపూర్ణ, మాజీ ఎమ్మెల్యే డా.జి.ప్రసాద్ టిక్కెట్ ఆశిస్తున్నారు. రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికొస్తే మాజీ మంత్రి ఆర్.రాజగోపాలరెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, పిసిసి ప్రతినిధి రాం ప్రసాద్ రెడ్డి టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. మరోవైపు ముస్లిం మైనార్టీలు కూడా టిక్కెట్ ను ఆశిస్తూ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సి. రామచంద్రయ్య ఎస్ ఎమ్ డి అహ్మదుల్లాపై ఒత్తిడి తెస్తున్నారు. రాజంపేట నియోజకవర్గం టిక్కెట్ ను కాంట్రాక్టర్ మేడా మల్లిఖార్జునరెడ్డి, పారిశ్రామికవేత్త ఎ. వెంకటయ్య, ఎస్.చంద్రశేఖరరాజు, పిఆర్ పి జిల్లా అధ్యక్షుడుగా పని చేసిన బి. హరిప్రసాద్ తదితరులు ఆశిస్తున్నారు. అక్కడ ఓ సామజిక వర్గం బలంగా ఉండడంతో హరిప్రసాద్ ను ఎంపిక చేయాలని కొందరు నాయకులు పట్టుబడుతున్నారు. ఏది ఏమైనా జగన్ ఎమ్మెల్యేలపై వేటు ఇంకా పడకుండానే ఉప ఎన్నికలు వస్తాయనే ఆశతో పోటీపోటీగా నేతలంతా రాజధానికి క్యూ కడుతున్నారు.
There are no posts related to కడప జిల్లాపై సిఎం ప్రత్యేక దృష్టి.
Tags: కడప

Comments