కడపజిల్లా పరిసరాల్లో వలసపక్షుల ఆవాసం
* చూపరులను ఆకట్టుకుంటున్న పక్షులు
* వలసపక్షులను దేవతా పక్షులుగా భావిస్తున్న ప్రజలు
* పక్షుల వాలకంతో కళకళలాడుతున్న పల్లెలు
సైబీరియా దేశంనుంచి వచ్చిన వలసపక్షులు కడపజిల్లా కొలువుదీరాయి. కొండ కోనల సమీపాల్లో వుండే నదులు, చెరువుల సమీపంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. అరుదైన ఈ పక్షులను ప్రజలు దేవతా పక్షులుగా భావిస్తున్నారు. ఇవి సైబీరియా దేశానికి చెందిన పక్షులు. కొన్ని వేల దూరం నుండి వలసొచ్చాయి. ఇవి కడప జిల్లాలోని కొన్ని గ్రామాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
ఏటా వేసవి ప్రారంభంలో ఈ పక్షులు సైబీరియా దేశం నుండి వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని గోపవరం మండలం పేదుళ్ళపల్లె, రేపల్లె, బెడుసుపల్లె తదితర ప్రాంతాల్లో విహరిస్తుంటాయి. ఎర్రకాళ్ళు, పొడవాటి ముక్కు, తెలుపు బూడిద రంగుల్లో కనిపించే ఈ పక్షులు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఈ పక్షులను కొందరు వేటగాల్లు వేటాడేవారు. కానీ ప్రస్తుతం ఈ పక్షులను రక్షించే బాధ్యత ఆయా గ్రామాల ప్రజలు చూస్తున్నారు.
ఈ పక్షులు తమ ప్రాంతాలకు రావడం అదృష్టంగా భావిస్తున్నారు. ఇవి ఎంత పెద్ద సంఖ్యలో వస్తే తమకు అంత సంతోషం తమ గ్రామాల అభివృద్ధి చెందుతాయన్న నమ్మకం ఇక్కడ గ్రామీణులది. గ్రామీణులైతే వీటి రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారే కానీ ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఈ అరుదైన సైబీరియా కొంగల జాతిని అభివృద్ధి చేయడానికి ఇక్కడి వాతావరణం అనుకూలంగా వుండటంతో ఏటా ఇక్కడి వచ్చే పక్షుల సంఖ్య పెరుగుతూనే వుంది.
కానీ కొంతమంది వేటగాల్లు అప్పడప్పడు వీటిని వేటాడుతుంటారు. ప్రకృతి సౌందర్యానికి మరింత అందాన్ని ఇనుమడింప జేసే ఈ పక్షులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన వుంది.
There are no posts related to కడపజిల్లా పరిసరాల్లో వలసపక్షుల ఆవాసం.
Tags: కడపజిల్లా, పక్షులు, పల్లెలు, ప్రజలు, వలసపక్షులు, వైఎస్‌ఆర్

Comments