దిగంబర విగ్రహమే ఆ ఊరి దైవం
* ప్రజలను నడిపిస్తున్న విశ్వాసం
* అనారోగ్యమైనా… కష్టమైనా విగ్రహానికే మొక్కులు
* మనిషి విగ్రహానికి దైవారాధన
విశ్వాసమే ఆ గ్రామస్తులను నడిపిస్తోంది. ఏ సమస్య వచ్చినా గ్రామనడిబొడ్డున వున్న ఓ దిగంబర విగ్రహమే పరిష్కరిస్తుందనేది వారి నమ్మకం. అంతేకాదు సంతానలేమి, పిల్లలకు అనారోగ్యం, పొలాలకు చీడపీడలు ఇలా ఏ సమస్య వచ్చినా భక్తితో ఆ విగ్రహం వద్ద ప్రదక్షిణలు చేస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని వారి విశ్వాసం. పిల్లలంతా ప్రతి రోజూ అక్కడి నవకోటి సిద్దయ్య విగ్రహానికి ప్రదక్షిణలు చేసిన తర్వాతే పాఠశాలలకు వెలుతుంటారు. ఇంతకీ ఆ విగ్రహంలో దాగిఉన్న మహిమ ఏంటి?
ఇది వైఎస్‌ఆర్ కడపజిల్లా జంషీరాబాయిపేట. ఈ గ్రామ నడిబొడ్డున ఓ చిన్న గుడి వుంది. ఆ గుడిముందు దిగంబరంగా కూర్చుని వున్నట్లు ఓ విగ్రహం కనిపిస్తోంది. ఆ విగ్రహ రూపంలో వున్న ఆయన పేరు నవకోటి సిద్దయ్య. దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం ఉత్తరభారతదేశం నుండి వచ్చిన ఈయన ఇక్కడే తపస్సు చేసుకుంటూ నిర్యాణం చెందాడట. ఇక్కడి ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమయ్యేవారు. మారుమూలనున్న ఈ ప్రాంతంలోని ప్రజలు ఆనారోగ్యాలు, కరువుకాటకాలతో అల్లాడిపోయేవారట.
నవకోటి సిద్దులలో ఒకరుగా ఇక్కడికి వచ్చి స్థిరపడిన సిద్దయ్యను పూజించడం మొదలు పెట్టారట. అప్పటి నుండి గ్రామం అన్ని విధాలుగా సుభిక్షంగా వుందని గ్రామస్థులు చెబుతున్నారు. పిల్లలు ఎవరికైన ఆనారోగ్యానికి గురైతే ఇలాగే ప్రదక్షిణలు చేస్తారు. దీంతో వారికి వ్యాధులు నయమవుతాయని విశ్వసిస్తున్నారు.
నిజంగా విగ్రహ మహిమా? ప్రజలు విశ్వాసంతో కాలం గడుపుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఆ గ్రామస్తులు మనిషినే దేవునిగా ప్రార్థిస్తున్నారు.
There are no posts related to దిగంబర విగ్రహమే ఆ ఊరి దైవం.

Comments