జగన్ వదలని ఓదార్పు యాత్ర
* యువనేతకు అభిమానుల అపూర్వ స్వాగతం
* కాంగ్రెస్, టిడిపిల తీరుపై జగన్ ధ్వజం
ప్రజా సమస్యలను గాలికొదిలేసి సోనియా మెప్పు పొందడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. విద్యార్థులు, మిర్చి రైతుల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. స్వల్ప విరామం అనంతరం గుంటూరు జిల్లా రొంపిచర్లలో జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్రకు అభిమానులు నీరాజనాలు పట్టారు.
గుంటూరు జిల్లాలో స్వల్ప విరామం అనంతరం ప్రారంభించిన ఓదార్పు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రొంపిచర్లలో జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్రకు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. యువనేతను చూసేందుకు దారివెంట అభిమానులు పోటీ పడ్డారు. రొంపిచర్ల, రామిరెడ్డిపాలెం, బుచ్చిపాపన్నపాలెం గ్రామాల్లో మహానేత వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్, టిడిపిలపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విద్యార్థులు, రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైఎస్‌కు ఒక న్యాయం, చంద్రబాబుకు, మంత్రులకు ఒక న్యాయం పాటిస్తున్నారని అన్నారు. వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్, టిడిపిలు కుట్ర పన్నాయని జగన్ ఆరోపించారు. ఇవాళ జగన్ కోనకంచివారిపాలెం, గోగులపాడు, అలవాల, చిట్టిపోతులవారి పాలెం, సుబ్బయ్యపాలెం, వడ్లమూడివారి పాలెం, విప్పర్లపల్లి గ్రామాల్లో ఓదార్పు యాత్ర కొనసాగిస్తారు.
There are no posts related to జగన్ వదలని ఓదార్పు యాత్ర.
Tags: ఓదార్పు యాత్ర, జగన్

Comments