ప్రతిష్థాత్మకంగా మారిన ఉపఎన్నికలు
* తెలంగాణలో హోరాహోరీ పోరు
* సెంటిమెంటే టీఆర్‌ఎస్ ఆయుధం
* కారును కార్నర్ చేస్తున్న సైకిల్
* అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్
* అదృష్టం పరీక్షించుకునే పనిలో కమలం
* అధికారపక్షానికి అగ్ని పరీక్ష
* ప్రచారబరిలోకి సీఎం, డిప్యూటీ సీఎం
* అభివృద్ధి మంత్రంపై ఆశలు
* తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసేనన్న నినాదం
* కదనోత్సాహంలో టీఆరెస్
* గెలుపుపై కొండంత ధీమా
* భారీ మెజార్టీపైనే కన్ను
* ప్రచారంలోకి కేసీఆర్, రాములమ్మ
ఉపఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసిన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేయనున్నాయి. తెలంగాణ సెంటిమెంటునే నమ్ముకుని TRS బరిలోకి దిగుతుంటే.. గులాబీ ఆధిపత్యాన్ని నిలువరించేందుకు కాంగ్రెస్, టీడీపీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అటు బీజేపీ కూడా తమ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో ఉపఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపించనున్నాయి.
ఇప్పటికే అన్ని పార్టీలు ప్రత్యేక వ్యూహాలలో నిమగ్నమయ్యాయి. కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డాయి. తెలంగాణలో ఉద్యమ వేడి కాస్త కూల్ కావడంతో పార్టీలన్నీ ధీమాగా ప్రచారానికి రెడీ అయ్యాయి. రైతు పోరుబాట పేరుతో ఇప్పటికే తెలంగాణలో పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ కేడర్లో ఆత్మ విశ్వాసం నింపారు. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలని నేతలకు బాబు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు జరుగుతున్న ఆరుస్థానాల్లో మూడు టీడీపీ సిట్టింగ్‌లే కావడంతో శక్తివంచన లేకుండా కృషి చేయాలని బాబు బూస్టింగ్ ఇస్తున్నారు. అటు అధికారపక్షం కాంగ్రెస్ కూడా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటిదాకా సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స తెలంగాణలో అడపదడపా పర్యటించారు. ఈసారి మాత్రం మరింత కాన్ఫిడెంటుగా ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు.
అంతర్గపోరుతో సతమతమవుతున్న అధికారపార్టీ నేతలు బై ఎలక్షన్స్‌లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్న ఆసక్తి నెలకొంది. అభివృద్ధి మంత్రంతోపాటు పత్యేక రాష్ట్ర ఏర్పాటు తమవల్లే సాధ్యమన్న ప్రచారం చేయాలని భావిస్తోంది. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా సీఎంతో కలిసి ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించారు. అటు టీఆరెస్ కూడా కదనోత్సాహంతో ఎన్నికల బరిలో నిలుస్తోంది.
గెలుపు పెద్ద విషయం కాదంటున్న గులాబీ దళం.. భారీమెజార్టీపైనే కన్నేసింది. ఇందుకోసం విస్తృత ప్రచారానికి స్కెచ్ గీసింది. మార్చి 5నుంచి ఎంపీ విజయశాంతితో ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఆఖర్లో పార్టీ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగుతారు. 10 నుంచి 15 వరకు అన్ని నియోజక వర్గాలలో సుడిగాలి పర్యటనకు ప్లాన్ చేశారు. టీడీపీ, కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు గులాబీ బాస్ పిలుపిచ్చారు.
అటు బీజేపీ కూడా తమ సత్తా చాటాలని చూస్తోంది. ఎన్ని స్థానాలలో పోటీ చేయాలనే దానిపై ఇంకా క్లారిటీ రాకున్నా.. మహబూబ్ నగర్లో మాత్రం పోటీ నిలవడం ఖరారైంది. ఇప్పటికే రథయాత్రతో తెలంగాణను చుట్టేసిన ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి.. అవసరమైతే జాతీయనేతలను రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. కామ్రెడ్లు కూడా కదన రంగంలోకి దిగుతుండడంతో పోరు రసవత్తరంగా మారింది. ఉపఎన్నికల ప్రచారం రచ్చరచ్చగానే జరగనుంది.
There are no posts related to ప్రతిష్థాత్మకంగా మారిన ఉపఎన్నికలు.
Tags: ఉపఎన్నికలు, కాంగ్రెస్, టీఆరెస్, టీడీపీ, తెలంగాణ

Comments