Sunday, May 20, 2012
 

రోజా పువ్వు

రోజా పువ్వు పూసింది
కమ్మటి వాసన వచ్చింది
దాని పక్కన ముల్లుంది
అమ్మో బాబోయ్ గుచ్చుకుంది

 

అమ్మా అమ్మా చందమామ! పాట

అమ్మా అమ్మా! చందమామతో
ఆడుకుంటాను
రమ్మను రమ్మను – కిందికి
రమ్మను – రమ్మనవే అమ్మా!

రామా రామా! చందమామ
రాడు రామయ్యా
తోడిపిల్ల వాళ్లతోను
ఆడుకోరాదా!

అందగాడు – చందగాడు
చందమామ
అందుకేను మామతోను
ఆడుకుంటాను!

మింటి నుండి రాడు రాడు
మంటిలోనికి
మన ఇంటిలోనికి!

ఎందుకు రాడో
అడిగేస్తాను చందమామను!
ఎందుకు నీవు – కిందికి రావు?
చందమామా?

కిందికి వస్తే అందరూ నన్ను
గేలిచేస్తారు!

గేలి చెయ్యము – గోల చెయ్యము
చందమామా!

బాలలంటే నాకు చాలా
భయమౌతుందయ్యా!
భయమూ వద్దూ – గియమూ వద్దూ
రయమున రావయ్యా!

పిల్లలంతా చుట్టుముట్టి
అల్లరి చేస్తారు!

అల్లరి చెయ్యము – గిల్లరి చెయ్యము
చందమామ!

కిందికి వస్తే తిరిగి అమ్మ
పైకి రానీదు!

అమ్మనడిగి కిందికి వస్తే
ఆడుకుందాము!

మంటిలోన ఆడుకుంటే
మామ్మ తిడుతుంది
మామ్మ తిడుతుంది

ఎంత పిలిచినా చందమామ
చెంతకు రాడమ్మ
అంతదాక అన్నం వద్దు
ఆటలు నాకొద్దు!

ఏడవకయ్యా బంగరు కొండా
రామా శ్రీరామా!
చూడవయ్యా అద్దంలోను
వీడె చందురుడు!

అవునే అవునే అద్దంలోన
అడుగో చందురుడు
చిక్కినాడు చేతికి యింక
ఎక్కడికెళ్తాడు?
ఇంకెక్కడికెళ్తాడు!?

 

 

రెండు రాజ్యాలు- రెండు దారులు- నాటిక

ఒక రాజ్యం:
మంత్రి: పిల్లలు కూడా యుద్ధం ఆటలు ఆడుకుంటూ చదువుకోవడం లేదు ప్రభూ!
రాజు: అయితే తెలివైన వాళ్ళందరికీ చదువులు చెప్పించండి. ఎందుకంటే మనం విశ్వ విజేతలం. యుద్ధం చేయడానికి కొత్త ఆయుధాలు కనిపెట్టాలంటే‌ చదువుండాలి. ప్రపంచాన్ని పరిపాలించే భాషలు రావాలి. కాబట్టి రాజ్యంలోని పిల్లలందరినీ జైళ్ళల్లో పెట్టండి.
మంత్రి : మహారాజా! పిల్లలను జైళ్ళల్లో పెట్టడమేమిటి?
రాజు: బడులు జైళ్ళ మాదిరే ఉండాలి. ఎందుకంటే క్రమ శిక్షణ ముఖ్యం. క్రమ శిక్షణ నేర్పాలంటే‌ సైనికుల మాదిరి శిక్షణ ఇవ్వాలి. నేటి నుంచీ ఆటలు- పాటలు బంద్. మన దేశం ప్రపంచంలోనే మహాశక్తి కావాలి.

ఇంకొక రాజ్యం:
రాజు: పిల్లలు ఆడుతూ, పాడుతూ, హాయిగా చదువుకోవాలి.
మంత్రి : కానీ, కరువు-కాటకాలు. పైగా యుద్ధం! తల్లిదండ్రులు పిల్లలతో పని చేయిస్తున్నారు మహాప్రభూ!
రాజు: వాళ్ళని ఎలాగైనా బడికి చేర్చాలి -
మంత్రి : తమరు ఆజ్ఞాపించండి మహారాజా!
రాజు: ఆజ్ఞలతో పనులు జరుగుతాయా? గుర్రాన్ని నీళ్ళదాకా తీసుకెళ్తాం. కానీ నీళ్ళు తాగించలేం కదా?
మంత్రి : మరేం చెయ్యాలి?
రాజు: ఏం చేస్తే పనులు జరుగుతాయో, అదే చేస్తాం. ముందు ప్రతి ఊరులోనూ బడి పెట్టి, అందులో అయ్యవారిని నియమించండి.
మార్గాల మధ్య సంఘర్షణలో అంతిమ విజయం ఎవరిది?

పాట: కథ చెబుతాము! కథ చెబుతాము
చిన్నారి బాలల కథ చెబుతాము
బాలల చదువుల కథ చెబుతాము
బాధల చదువుల కథ చెబుతాము
తల్లి దండ్రుల కథ చెబుతాము
పల్లె వెలుగుల కథ చెబుతాము
ఆట పాటల కథ చెబుతాము
అయ్యవారుల కథ చెబుతాము
చెట్టు చేమల కథ చెబుతాము
ఎగిరే పిట్టల కథ చెబుతాము
పిల్లల ఆశల కథ చెబుతాము
రేపటి కళల కథ చెబుతాము

పోతులయ్య: వినండి వినండి నాయనలారా, వినండి వినండి తల్లుల్లారా, పిల్లల గన్నా పెద్దల్లారా, చదువులు చెప్పే అయ్యల్లారా, బుడి బుడి నడకల పిల్లల్లారా- అంతా వినండి.
కల్పన: ఏం వినమంటావు, చెబితే గదా?
పోతులయ్య: రాజ్యాల మధ్య పోరులో పిల్లల చదువులు నాశనమౌతై నాయనా.
అలాంటప్పుడు పిల్లల్ని చదివించేందుకు వాళ్లని ఎత్తుకెళ్ళి జైల్లో పెడతామా?
కల్పన: అదేం మాట? పిల్లల్ని ఎవరైనా జైల్లో ఎందుకు పెడతారు?
పోతులయ్య: అట్లాగనకు. ఈనాటి బళ్ళు జైళ్లకంటే ఎందులో తక్కువున్నాయో కొంచెం ఆలోచించు.
కల్పన: అదేం లేదయ్యో. మేమంతా పిల్లల బాగుకోరేకదా, ఇదంతా చేసేది?
పోతులయ్య: అందుకేనమ్మా, ఈ కథ వినమంటున్నది!
కల్పన: చెప్పు మరి, వింటాం అందరం.
పోతులయ్య: అనగా అనగా …………చాన్నాళ్ల క్రిందట ఒక రాజు ఉండేవాడు.
కల్పన: ఒక్క రాజేనా, ఉండేది?
పోతులయ్య:కాదు! ఇద్దరు రాజులు ఉండేవారు.
కల్పన: ఇద్దరు రాజులేనా ఉండేది?
పోతులయ్య: అబ్బబ్బ! చాలా మంది రాజులు ఉన్నారు. కాని నేను ఇద్దరు రాజుల గురించే చెబుతాను.
కల్పన: సరే! చెప్పు.
పోతులయ్య: వాళ్ళలో ఒక రాజు చాలా యుద్ధాలు చేసినాడు. చాలా మంది సైనికులు చనిపోయారు. ఆయన అనేక దేశాలు జయించాడు. అయినా యుద్ధాలు చేయడానికి కొత్త కొత్త విషయాలు కనుగొంటూనే ఉన్నాడు. మరిన్ని యుద్ధాలు చేయాలని అనుకుంటున్నాడు…

తరువాతి అంకం
అందరు: రాజాధి రాజ – రాజ మార్తాండ – విశ్వ విజేత- విక్రమార్క మహారాజా బహు పరాక్ – బహు పరాక్ – బహు పరాక్
రాజు : మంత్రీ !
మంత్రి: మహాప్రభూ!
రాజు: సేనాపతీ!
సేనాపతి: మహారాజా!
రాజు: మనం అనేక యుద్ధాలు చేశాం, జయించాం!
మంత్రి: అవును మహారాజా!
రాజు: మరి ఇప్పుడేం చేద్దాం?
మంత్రి: మన రాజ్యం గురించి చూడండి మహా రాజా!
రాజు: మన రాజ్యానికేమయింది?
మంత్రి: మన రాజ్యంలో పిల్లలు చదవడం లేదు ప్రభూ!
రాజు: మనం పిల్లలను యుద్ధాలకు తీసుకెళ్ళలేదు కదా ! పెద్ద వాళ్ళలో యుద్దం చేయగలిగిన వాళ్లంతా యుద్ధానికి వెళ్ళారు; మిగిలిన వారు యుద్ధ సామాగ్రిని తయారు చేస్తున్నారు.

మంత్రి: పిల్లలు కూడా యుద్ధం ఆటలు ఆడుకుంటూ చదువుకోవడం లేదు ప్రభూ!
రాజు: అయితే తెలివైన వాళ్ళందరికీ చదువులు చెప్పించండి. ఎందుకంటే మనం విశ్వ విజేతలం. యుద్ధం చేయడానికి కొత్త ఆయుధాలు కనిపెట్టాలంటే‌ చదువుండాలి. ప్రపంచాన్ని పరిపాలించే భాషలు రావాలి. కాబట్టి రాజ్యంలోని పిల్లలందరినీ జైళ్ళల్లో పెట్టండి.
మంత్రి : మహారాజా! పిల్లలను జైళ్ళల్లో పెట్టడమేమిటి?
రాజు: బడులు జైళ్ళ మాదిరే ఉండాలి. ఎందుకంటే క్రమ శిక్షణ ముఖ్యం. క్రమ శిక్షణ నేర్పాలంటే‌ సైనికుల మాదిరి శిక్షణ ఇవ్వాలి. నేటి నుంచీ ఆటలు-పాటలు బంద్. మన దేశం ప్రపంచంలోనే మహాశక్తి కావాలి-
మంత్రి: ప్రభూ ! తల్లి దండ్రుల నుంచి పిల్లలను వేరుచేయడం అంత మంచిది కాదేమో!
రాజు: మంత్రీ! ప్రశ్నించకండి, చెప్పింది చేయండి! సేనా పతీ, మా ఆజ్ఞలు అమలు చేయండి.
దండోరా: అందరూ వినండహో! రాజ్యంలో పిల్లలందరికీ చదువు చెప్పించాలని విక్రమార్క మహారాజు నిర్ణయించారు. కాబట్టి మీ పిల్లలందరినీ జైళ్ళకు- అంటే‌ కాన్వెంట్ బళ్ళకన్నమాట- పంపండి. పిల్లలందరూ ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకొని, పెద్ద చదువులు చదివి, ప్రపంచాన్ని జయించాలి. ఇది రాజుగారి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవరైనా పాటించక పోతే వాళ్ళ తల తీయించి కోట గుమ్మానికి వేలాడదీస్తామహో!

తరువాతి అంకం

కల్పన: అబ్బ! ఇదేమి, ఇంక చాల్లే గానీ, ఇంకో రాజు గురించి చెప్పు!
పోతులయ్య: రా, మరి పోదాం!
కల్పన : యాడికి, పొయ్యేది?
పోతులయ్య: ఆ రాజు రాజభవనంలో దొరకడు. యాడనో ఊర్లలో ఉండుంటాడు. వెతుక్కుంటూ‌ పోవాలి.
కల్పన: ఏమి, ఆ రాజుకి ? సుఖంగా రాజ భవనంలో ఉండక, ఊర్లంట పోయేందుకు, తిన్నది అరగకనా?
పోతులయ్య: ఇందాకటి రాజు ఉన్నాడు కదా! ఆ రాజు ఈ రాజు మీద కూడా యుద్ధం చేశాడు.
కల్పన : ఓహో! మరి ఈ రాజు పేరేమి?
పోతులయ్య : ఈ రాజు పేరు చంద్రహాస మహారాజు! నువ్వు మధ్యలో ఆపక, కథ సాంతం విను. కల్పన: అడిగేటోడు లేకపోతే కథ అడ్డగోలుగా పోతుంది.
పోతులయ్య: ఇంతకీ- యుద్ధం జరిగినాక ఏ రాజ్యంలోనైనా జనం నష్టపోతారు.
గాయపడిన సైనికులు, అనాధలయిన కుటుంబాలు, బీడు పడిన పొలాలు, వీటన్నిటినీ చూసుకొనేకి ఈ రాజు ఊర్ల వెంట పోయాడు.
కల్పన: అయితే ఆలస్యం ఎందుకు, మనం కూడా పోదాం పద!

తరువాతి అంకం

అందరు(పాట):
కలిగిరి కలిగిరి కలింగర చెట్టు
కల్లే తాగి మర్లు తప్పి
కొత్తపల్లి మళ్ళలో పాట పాడుదునా?
ఓ తమ్ముడా, నాటు వేయుదునా?
।కలిగిరి।
మంచినీళ్ల బానకాడ
మల్లెపూలు మరచినాను
తీసుకురార ఓ తమ్ముడా,
తీసుకురార
।కలిగిరి।
వుడుకు నీళ్ళ బానకాడ
ఉంగరము మరచినాను
తీసుకు రార ఓ తమ్ముడా
తీసుకురార
।కలిగిరి।

చంద్రహాస: మంత్రీ! చూశారుగా? యుద్ధం తరువాత మన ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మనదేశం బాగుపడాలంటే‌, పాడి పంటలు బాగుండాలంటే‌, మన పిల్లలు చదువుకోవాలి.
మంత్రి: అవును మహారాజా, ఆయుధాలకు పెట్టే‌ డబ్బులతో పుస్తకాలు ముద్రించాలి. ప్రతి ఊర్లో బడి కట్టాలి. చదువు బాగా చెప్పే అయ్యవార్లు ఉండాలి.
రాజు: పిల్లలు ఆడుతూ, పాడుతూ హాయిగా చదువుకోవాలి.
మంత్రి : కానీ, కరువు- కాటకాలు- పైగా యుద్ధం, తల్లిదండ్రులు పిల్లలతో పని చేయిస్తున్నారు మహాప్రభూ!
రాజు: వాళ్ళని ఎలాగైనా బడిలో చేర్చాలి -
మంత్రి : తమరు ఆజ్ఞాపించండి మహారాజా!
రాజు: ఆజ్ఞలతో పనులు జరుగుతాయా? గుర్రాన్ని నీళ్ళదాకా తీసుకెళ్తాం. కాని నీరు తాగించలేం కదా?
మంత్రి : మరేం చెయ్యాలంటారు?
రాజు: ఏం చేస్తే పనులు జరుగుతాయో అదే చేస్తాం. ముందు ప్రతి ఊరులోనూ బడి పెట్టి, అందులో అయ్యవారిని నియమించండి.
మంత్రి: దండోరా వేసి పిల్లలను బడికి పంపమని చెప్తాం.
దండోరా: అందరు వినండహో. ప్రతి ఊర్లోనూ బడి పెట్టినారు. అయ్యవారిని పెట్టినారు. కాబట్టి మీ పిల్లలను బడులకు పంపి చదివించుకోవాలహో. ఎవ్వరూ డబ్బు కట్టక్కర లేదహో.
తండ్రి: ఆ…ఆ…..ఆ…సేద్యం చేసుకునే మనకు చదువులెందుకు? చదువుకున్నాడంటే‌ పిల్లవాడు ఇంక పొలం పనులే చేయడు.
తల్లి: అవునవును. ఆడపిల్లలకైతే అసలు చదువులెందుకు? ఇంటి పనులు, వంట పనులు నేర్చుకుంటే చాలు.

దండోరా : ఎవ్వరూ పిల్లలను పంపించకపోతే ఎట్లాగమ్మా? చదువుకుంటే‌ తెలివితేటలు వస్తాయి. వ్యవసాయం బాగా చేయవచ్చు.
తండ్రి: అబ్బ! బాగా చెప్పినావులే, పని పాటలు బాగా నేర్చుకుంటారు!
తల్లి: చదువులు డబ్బులున్నోల్లకే ….. మాలాంటి పేదోళ్ళకి కాదు.
దండోరా: సర్లేమ్మా…మీ ఇష్టం. వినండహో! పిల్లలను బడికి పంపించమని అడగడానికి స్వయంగా రాజుగారే వస్తున్నారహో.
రాజు: మంత్రి మనమే ఇంటింటికీ వెళ్ళి, పిల్లలను బడులకు పంపించమని అడుగుదాం!

రాజు,మంత్రి: అరుగు మీద కూర్చున్నఓ పెద్దలారా…
ఓ పెద్దలారా
మీ ఊరి పిల్లలను బడికి పంపండి-
బడికి పంపండి .
పిల్లలు: మేమెరుగ- మేమెరుగ
అమ్మ-నాన్నల్నడగండీ
అమ్మ- నాన్నల్నడగండీ.
రాజు, మంత్రి:
దుక్కులు దున్నేటి ఓ అయ్యలారా-
ఓ అయ్యలారా !
మీ ఇంటి బిడ్డల్ని బడికి పంపండీ బడికి పంపండీ.
అయ్యలు:
మేమేల పంపాలి?
మేమేల పంపాలి?
బడి, చదువుల తోటి మాకేటి లాభాలు?
రాజు, మంత్రి:
వరుసగా దుక్కులు చక్కగా దున్నొచ్చు.
విత్తనాలు మొలకెత్తే రహస్యాలు తెలువచ్చు.
ఎరువులు వేసేటి వైనాలు ఎరుగొచ్చు.
వానలు కురిసేటి తీరులు తెలువచ్చు.
॥దుక్కులు॥
అయ్యలు:
సరే అయితే ….సరే అయితే ! ….॥2॥
రాజు, మంత్రి:
వంటలు చేసేటి ఓ అక్కలారా,
ఓ అక్కలారా !
మీ ఇంటి పాపలను బడికి పంపండీ
బడికి పంపండీ.
అమ్మలు:
మేమేల పంపాలి… మేమేల పంపాలి?
బడి, చదువుల తోటి… మాకేటి లాభాలు?
రాజు, మంత్రి:
లోకము నడిచేటి తీరులు తెలయాల
బ్రతుకును నడిపేటి దారులు తెలయాల
ఇళ్లల్లో కూర్చుంటే‌ లోకమే తెలిసేనా?
వంటింట్లో మగ్గితే తెలివేమి పెరిగేను?
॥వంటలు॥
అమ్మలు: సరే అయితే ….సరే అయితే ..(2)

తరువాతి అంకం

కల్పన: ఆ…ఆ… సరే, ఈ రాజుగారు ఊరూరు తిరిగి పిల్లలను పోగేసుకున్నారు. మరి విక్రమార్క మహారాజు రాజ్యంలో బడి చదువులు ఎలా ఉన్నాయో చూద్దామా?
పోతలయ్య: నీకు ఒక్క చోట కాలు నిలువదు కదా! సరే వెళ్దాం పద.
[మిలట్రీ మార్చే లెప్ట్ …రైట్......]

సైన్యాధి: ఏరా! మీకు నిద్రమత్తు వదలడం లేదు- ఇప్పుడు వదిలిందా?
పిల్లలు: వదిలింది సార్.
సైన్యాధి: మన బడిలో అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడాలి.
A For Apple B For Bat C For Cat Once upon a time, there was a king. శివ: అంటే‌ ఏమిటి సార్?
సైన్యాధి: అర్థం అడిగావంటే‌ చంపేస్తా. ఇంగ్లీష్ ని ఇట్లాగే చదవాలి-
అంతే…. Once upon a time, there was a king. He was the King of England.
పిల్లవాడు: సార్. మనకి రాజులు ఉన్నారుగా, వాళ్ళ గురించి చెప్పవచ్చుగా?
సైన్యాధి: మనవాళ్ళు ఉత్తి వెధవలోయ్. ఇంగ్లీష్ దొరలంటే‌ గొప్పవాళ్ళు. Great Mans.
పిల్లవాడు: మీరు కూడానా సార్?
సైన్యాధి:ఏంటి- నేను కూడా?..
పిల్లవాడు: అదే సార్-…మీరు కూడా వెధవేనా? అని!
సైన్యాధి: ఒరేయ్…నిన్ను-…నిన్ను ఏం చేసినా పాపం లేదు… అయినా నాలాంటి గొప్పవాళ్ల సంగతి మీకు అర్థం కాదు. నేను డ్రస్సులో, భాషలో… తిండిలో…..
పిల్లవాడు: దొడ్డికి వెళ్ళటంలో…..
సైన్యాధి: ఏమన్నావురా?…..
పిల్లవాడు: ఏం లేదు సార్.
సైన్యాధి: ఆ….తిండిలో, మర్యాదలో, ఒకటేంటి- అన్నింటిలో ఇంగ్లీష్ దొరల మాదిరిగానే అచ్చు గుద్దినట్లు చేస్తూ ఉంటాను.
పిల్లవాడు: మరి మీ రంగు మాటేంటి సార్….
సైన్యాధి: అదొక్కటే‌- ఏం చేసినా మారలేదమ్మా….
పిల్లవాడు: ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా,…నలుపు నలుపే గాని-
సైన్యాధి: నోర్ముయ్..ఆ..చదవండి….చదవండి!
పిల్లవాడు: అమ్మో….అమ్మో!
పిల్లవాడు: అయ్యో..అయ్యో! వీడు గిలగిలా తన్నుకుంటున్నాడు!
పిల్లవాడు: (కళ్ళు తేలేసినాడు..)
సైన్యాధి: ఏమయ్యిందిరా…ఏమయ్యింది? ఒరేయ్, హాస్పిటల్ కి ఫోను చెయ్యండి!
పిల్లవాడు: ఏం అక్కరలేదు సార్. వాడి పీకకు ఉన్న ‘టై ‘ని వదులు చేస్తే చాలు- గాలి పీల్చుకుంటాడు. అది బిగుతుగా అయి ఉంటుంది. అసలే ఎండ వేడి…ఆ కోటు కూడా తీసెయ్.
సైన్యాధి: హమ్మయ్య… ఎంత భయపెట్టావురా!
పిల్లవాడు: మనకు ఈ “టై” లు, “టక్కు”లు, కోట్లూ, బూట్లు, ఎందుకు సార్? మాకందరికీ ఒకటే చెమట- అస్సలు గాలి ఆడదు!
పిల్లవాడు: గోక్కోవడానికి కూడా కష్టం!
పిల్లవాడు: బాగా గాలాడేట్టు మామూలు బట్టలు వేసుకుంటాం సార్!
సైన్యాధి: ఒరేయ్.. ఆటవికుల్లారా! ఈ దొరల బట్టల గొప్ప మీకేం తెలుసు,
అవెంత ఖరీదో….?
పిల్లవాడు: వాళ్ళకంటే మంచు కురుస్తుంది- కాబట్టి, చలిగాలి లోనికి పోకుండా బందోబస్తుగా మెడకు గుడ్డ పీలిక కట్టుకుంటారు.
సైన్యాధి: ఒరేయ్, గాడిదా!…”నెక్ టై”ని పట్టుకొని ‘ గుడ్డపీలిక’ అంటావా?
పిల్లవాడు: మనకు ఎప్పుడూ ఎండేగా, మనకెందుకు సార్, ఆ పీక తాడు?
సైన్యాధి: మీకు నాగరికత నేర్పడంకంటే, ఆ దున్నపోతులకు నేర్పడం తేలికరా…
పిల్లవాడు: ఆ…ఆ…దున్నపోతుకి ఇన్ని బట్టలేస్తే అది
ఊరుకుంటుందా…వేడికి తట్టుకోలేక, మిమ్మల్ని కుమ్మి…కుమ్మి…
సైన్యాధి: నోర్ముయ్యండి.. చదవండి! మళ్ళా లంచ్ సమయం అవుతుంది- (బెల్)
లెఫ్ట్….రైట్ ….. (2 ) ఆ…ఆ…తిన్నగా కూర్చోండి…ముందు అందరికీ ‘సూపు’. పిల్లవాడు: అంటే గంజా?
పిల్లవాడు: కాదు పులుసు.
సైన్యాధి: సూపంటే సూపే..ఒరేయ్..అట్లా గిన్నె ఎత్తి తాగకూడదు. ఏబ్రాసి వెధవా! స్పూనుతో చక్కగా తాగాలి…తర్వాత వచ్చి రొట్టెని కత్తితో ఇట్లా కోసి..ఇదిగో- ముందే చెప్తున్నా- చేత్తో తుంచితే వేళ్ళు విరుగుతై!
పిల్లవాడు: చేత్తో తింటే తొందరగా అయిపోతుంది. తేలిగ్గా తినొచ్చు..
సైన్యాధి: కుదరదు. ఇవన్నీ వాడాలి. కత్తీ..స్పూన్..ఫోర్క్
పిల్లవాడు: ఫోర్క్ అంటే ?
పిల్లవాడు: ముక్కలు గుచ్చి తినే పార- త్రిశూలం.
పిల్లవాడు: చేత్తోనే తింటాం సార్. అట్లా తింటే తిన్నట్లు ఉండదు!
సైన్యాధి: చేతులు విరుగుతాయి, చెప్తున్నాను. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, సప్పర్ అన్నీ వీటితోనే తినాలి. అప్పుడు గాని మనం తెల్లదొరల్లాగా కనబడం.
పిల్లవాడు: తెల్లదొరల్లాగా ఎందుకుండాలి? మనం మనలాగే ఉండొచ్చు గదా!….
సైన్యాధి: అదే వద్దనేది…వాళ్ళు చాలా గ్రేట్.
పిల్లవాడు: అన్నంలో పప్పు కలిపి కూర నంజుకోవాలంటే ఎట్లా సార్?
పిల్లవాడు: మీరు కలిపి పెడతారా?..
సైన్యాధి: ఛీ, ఛీ…ఫూల్స్….అట్లా అయితే రేపట్నుంచి కలుపుకోనవసరం లేకుండా బ్రెడ్లు, కేక్ లు, పై లు, పిజ్జాలు, బర్గర్లు…
పిల్లవాడు: అవన్నీ ఏంటివి సార్, జంతువులా?
సైన్యాధి: జంతువులు కావురా, తినే పదార్థాలు!
పిల్లవాడు: మరి అన్నం, పప్పు, ముద్ద, పచ్చడి, కూర?
పిల్లవాడు: జొన్న రొట్టె, కుడాలు, ఓలిగలు?
పిల్లవాడు: అవికూడా తినేవేగా..అవి పెట్టరా?
పిల్లవాడు: వామ్మో..ఆకలితో చచ్చిపోతాం!
అందరూ: చచ్చిపోతాం…చచ్చిపోతాం…
సైన్యాధి: సైలెన్స్ …సైలెన్స్…చావండి, పీడపోతుంది. (బెల్లు)
తిన్నది చాల్లే, పదండి క్లాసుకి- లెప్ట్ రైట్ …లెప్ట్ రైట్
… ఆ…ఇప్పుడు లెక్కలు-
బోర్డు మీద లెక్క చూశారుగా? దాన్ని మీ పుస్తకాల్లోకి ఎక్కించుకోండి.
పిల్లవాడు: లెక్కని ఎలా చేయాలో చెప్పండి సార్!
సైన్యాధి: లెక్కని బట్టీ పట్టండి..సూత్రాలన్నీ నోటికి రావాలి!
పిల్లవాడు: పై నుంచి కిందికి, కింది నుంచి పైకి అప్పజెప్పాలా సార్?
సైన్యాధి: కరెక్టు. అంతేకాదు- పుస్తకంలో ఉన్న లెక్కలన్నిటినీ ఒక్కొక్కటీ వందసార్లు చేయండి.
పిల్లవాడు: వందసార్లా ?!(పడిపోతాడు)
సైన్యాధి: అవును, అప్పుడు అవి ఖచ్చితంగా గుర్తుంటాయి.
పిల్లవాడు: అర్థం అయినా గుర్తుంటాయ్ గదా, సార్?
సైన్యాధి: నాతో వాదించొద్దు. చెప్పింది చేయండి ..అంతే.
పిల్లవాడు: చెప్పింది చేయాలి అంతే …(2)
సైన్యాధి: ఆ…ఇప్పుడు G.K.-
పిల్లవాడు: అంటే ఏంటి సార్?
సైన్యాధి: అది కూడా తెలీదా, జనరల్ నాలెడ్జి- అంటే లోక జ్ఞానం- ఈ గైడులోనిది అందరికీ చెప్పమ్మా.
పిల్లవాడు: రాసుకోండి..ప్రపంచంలో ఒక్కటే నిజమైన భాష. అది ఇంగ్లీషూ.
ప్రపంచంలో ఆటంటే‌ఒక్కటే‌ ఆట. అది క్రికెట్టూ. ప్రపంచంలో ఒక్కటే‌గొప్పదేశం ఉంది. అది అమెరికా. ప్రపంచంలో ఒక్కటే‌ గొప్ప పరీక్ష ఉంది. అది యంసెట్టూ. ప్రపంచంలో ఒక్కటే‌ గొప్ప చదువుంది. అది కంప్యూటర్ ఇంజనీరూ.

సైన్యాధి: ఆ, ఇక సైన్సులో 30 వ పేజీ నుండి 45 వ పేజీదాకా చదువుకొని రండి……రేపు చూడకుండా రాయాలి.
Once upon a time there was a King. (2) నందినీ, నువ్వు చెప్పమ్మా.. నందిని: Once upon a time…….(2)
సైన్యాధి: బాగా తిండి తింటావు గాని, ఆ మాత్రం అప్పజెప్పలేవా?
నందిని: ఆకలేస్తున్నది సార్ …
సైన్యాధి: ఆకలేస్తున్నదా? నోర్ముయ్. ఈ అమ్మాయికి 3రోజులు తిండి పెట్టొద్దు. పాఠం వచ్చిన తరువాతనే తిండి!
కుల్సింబి: సార్…సార్…సార్..ర్..ర్!
సైన్యాధి: చెప్పమ్మా, సాగదీక,…చంపేస్తా!
కుల్సింబి: (1,2,3 వేళ్లు చూపిస్తుంది)
సైన్యాధి: ఒంటికి, రెంటికి, మూడుకు- అడుగుతూనే ఉంటావు. ఎన్నిసార్లు పోతావు? కూర్చో.
నర్మద: సార్..మాయమ్మ ఒచ్చినాదంట సార్ , నన్ను చూసేకి!
సైన్యాధి: మీ అమ్మ వచ్చిందా? మీ నాన్న వచ్చాడా? ఇదేమీ మామూలు బడి కాదమ్మా! ఎవరినీ చూడడం కుదరదు- పంపించెయ్..చంపేస్తా.!.
నర్మద: సార్, మాయమ్మను చూడాలి సార్…
సైన్యాధి: రేయ్..ఈ అమ్మాయిని తీసికెళ్ళి చీకటి గదిలో పెట్టి తాళం వేయండి. వాళ్లమ్మను చూడాలట..ఆ… మీరందరూ చదువుకోవాలి, చదువుకొని, కొత్త విషయాలు కనిపెట్టాలి. చదవండి…చంపేస్తా..
Once upon a time there was a King… పాట: రుబ్బు రుబ్బు -చదువుని రుబ్బు
రుద్దు రుద్దు- చదువుని రుద్దు అక్షరాలు రుబ్బు- పదాలు రుబ్బు- అర్థం పర్థం అక్కరలేదు. తెలివితేటలు అక్కరలేదు- ప్రశ్నలు ఏవీ అడగవద్దు అనుమానాలు అసలే వద్దు. ॥రుబ్బు॥ పగలు రాత్రీ బట్టీ పట్టు- బట్టీ పట్టి అప్పజెప్పు రుబ్బి రుబ్బి- పరీక్షలు రాయి- రాస్తే వొస్తే ర్యాంకులు వచ్చు ॥రుబ్బు॥

(రాజు గారు పంపిన కొత్త టైంటేబుల్ పట్టుకొని మంత్రిగారు తరగతిగదిలోకి వస్తారు..)

మంత్రి: ఒక్క నిమిషం- మన రాజుగారు పిల్లలకోసం కొత్త టైం-టేబుల్ యిచ్చారు-
వినండి. ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవాలి. ఆరు గంటల దాకా చదవాలి. ఆ తర్వాత పదహైదు నిముషాల్లో స్నానం, ఇతర పనులు అయిపోవాలి. ఆరు-పదహైదు నుండి క్లాసు ఎనిమిదీ- నలభై ఐదు వరకు. మళ్ళీ పదహైదు నిముషాల్లో టిఫిన్ చేయాలి. తర్వాత తొమ్మిది గంటల నుండీ ఒంటి గంట వరకూ క్లాసులు. పదహైదు నిముషాలు భోజన విరామం. తర్వాత ఐదు దాకా చదువు. పదహైదు నిముషాల్లో టిఫిను. మళ్ళీ ఐదు-పదహైదు నుండి రాత్రి పది గంటల దాకా చదువు. మధ్య మధ్యలో ఒంటికి (మూత్రానికి) మూడు నిముషాలు పోవచ్చు. ప్రతి క్లాసురూములోనూ వీడియో కెమెరా పెడతాం . ఈ టైం టేబుల్ ని ఎవరు తప్పినా కఠినంగా శిక్షలు ఉంటాయని రాజుగారు చెప్పారు!

(కొద్దిసేపు విరామం..తర్వాత రాజుగారు కూడా బడిని చూడటానికి వచ్చి ఉంటారు.)

మంత్రి: మహారాజా! మన బడుల్లో పిల్లలు రాత్రింబవళ్ళూ చదువుతున్నారు.
రాజు: మంచిది, మంత్రీ! మంచిది.
మంత్రి: అసలు ఆటలు-పాటలు లేవు, మహారాజా!
రాజు: ఆటలు, పాటలు చదువుకి చేటు మంత్రీ! అవి టైము వేస్టు -
మంత్రి: పోనీ, చదివే దానికి అర్థం కూడా తెలియడం లేదు మహారాజా!
రాజు: జ్ఞాపకం ఉంచుకొని తిరిగి రాస్తే చాలు. అర్థం ఎందుకు, మంత్రీ!
మంత్రి: ప్రశ్నలు అడగకపోతే, అసలు ఆలోచనే ఉండదు కదా, మహారాజా?
రాజు: మనకు ఆలోచనలతో పనేం ఉంది మంత్రీ, చెప్పింది చెయ్యాలి గాని? మన పౌరులకి క్రమశిక్షణ ముఖ్యం.
మంత్రి: మహారాజా! పక్క రాజ్యంలో చదువులు ఎట్లా సాగుతున్నాయో చూచిరానా రాజా!
రాజు: వాళ్ళవి గాలి చదువులు. అయినా మీ తృప్తి కోసం చూచి రండి.

తరువాతి అంకం

పోతులయ్య: రా..రా..ఈ మంత్రితో పాటు ఆ రాజ్యం పోదాం. ఇక్కడ చూసింది చాల్లే.
కల్పన: అవునవును- ఈ బళ్ళ కంటే జైళ్ళే మేలు. పోదాం పద- ఈ పిల్లలు పీనుగలయి పోతున్నారు.

అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- మనం ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!

అయ్యోరు: రండి రండి- మీ కోసమే ఎదురు చూస్తున్నాం. చాలా సంతోషం.
తండ్రి: ఏమయ్యోరూ! మా పిల్లల్ని రోజు బడికి పంపించేదే కాక, మేము కూడా పనులు విడిచి పెట్టి వాళ్లని చూడడానికి రావాలా?
అయ్యోరు: లేకపోతే మేమేం చెబుతున్నామో, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది?
తల్లి: ఆ..ఆ..ఆ..పాప ఇంట్లో చేతి కిందికి లేకుండాపాయే…వాడేమో అక్కడా ఇక్కడా పని చేసి అంతో-ఇంతో డబ్బులు సంపాదించేది; అది కూడా పాయే..
అయ్యోరు: పిల్లలు హాయిగా చదుకునే వయసులో చదువుకోవాలి. వాళ్ళు పనికి పోతే ఎదగరు.
తండ్రి: ఆ..ఆ…ఇటు చదువులు రావు..అటు పనికి చెడతారు.
అయ్యోరు: చెడతారో, లేదో మీరే చూస్తారుగానీ,- రండి. అందుకే మిమ్మల్ని పిలిపించింది. ఎవరండీ, అట్లా ముసుగువేసుకున్నారు?
కల్పన: ఆయనా? ప్రక్కరాజ్యం మంత్రిగారు.
మంత్రి: అయ్యా! నన్నేం చేయవద్దు. నన్నేం చేయవద్దు.
తండ్రి: ఏమి ఎందుకు చెయ్యొద్దు? మా మీద యుద్ధం చేసినందుకు నిన్ను కుళ్ళబొడిచేస్తాను.
తల్లి: దొంగ సచ్చినోడా! మీ మూలంగా ఎంత మంది సచ్చినారు?
అయ్యోరు: ఆగండి..ఆగండి..అసలు ఆయన ఎందుకు వచ్చినారో కనుక్కుందాం.
తండ్రి: మరెందుకు వస్తారు. మన రహస్యాలు తెలుసుకొని, వాళ్ళ రాజుకు చెప్పడానికి.
మంత్రి: అయ్యా!..నేను గూఢచారిని కాదు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారో చూడడానికి వచ్చాను.
తల్లి: పచ్చి అబద్ధం.
అయ్యోరు: అబద్ధమయినా, నిజమయినా- బడిలో రహస్యాలేముంటాయి? రండి- మీరే చూద్దురుగాని. పిల్లలూ- మీ అమ్మా-నాన్నలు మీరేం చదువుతున్నారో చూడడానికి వచ్చారు.
పిల్లలు: స్వాగతం, సుస్వాగతం. (2)
అయ్యోరు: మరి మీరు వాళ్ళకి ఏం చెబుతారు?
జానకి: మన దేశం చాలా గొప్ప దేశం అని చెబుదాం.
అయ్యోరు: ఎందుకని గొప్పది, మనదేశం?
శివ: ఎందుకంటే‌, మన దేశంలో అనేక నదులు ఉన్నాయి.
నిర్మల: సారవంతమైన భూములు ఉన్నాయి.
నాగ: ఆ భూమిలో కష్టించి పంటలు పండించే రైతులు ఉన్నారు.
తండ్రి: పోనీలే!…మేము- రైతులం కష్టపడి పనిచేస్తామని మీరన్నా అర్థం చేసుకున్నారు.
జానకి: అంతేకాదు- రైతులూ, మీరు చాలా తెలివైన వాళ్ళు కూడా.
తండ్రి: రైతులు అమాయకులు- అంతే.
నిర్మల: రైతుకి తెలివి లేకపోతే, ఇన్ని వందల, వేల రకాల విత్తనాలు ఎలా తయారు చేస్తాడు?
నాగ: చౌడు భూములు నుండి కూడా, బంగారం ఎట్లా పండించాడు?
అయ్యోరు: బాగా చెప్పారు…
తండ్రి: బాగానే చెప్పారు. కానీ, రైతు వెన్నెముక విరిగి పోతోందమ్మా!
అందుకని వీళ్లకి గొప్ప విషయాలు ఇంగ్లీష్ లో చెప్పండమ్మా..!
అరుణ: రైతు రైతే…రైతు కంటే‌ గొప్ప విషయం ఏంటి?
నాగ: మన తెలుగు భాషలో చెబితేనే మాకు బాగా అర్థం అవుతుంది.
జానకి: కావాలంటే ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఇంకా- ఇంకా..
శివ: మన భాషలు 22. అవి గాక ఫ్రెంచి, స్ఫానిష్, జర్మన్, రష్యన్, చైనీస్, జపనీస్….
అయ్యోరు: ఆ..ఆ..ఆ.. ప్రపంచంలో ఉన్న భాషల లిస్టు అంతా చెప్పకు!
నిర్మల: ఎవరికి ఏ భాష నేర్చుకోవలసిన పని పడితే అది నేర్చుకుంటారు!
తల్లి: వామ్మో! ఇన్ని భాషలే…!
అయ్యోరు: అవును. ప్రతి జాతికీ స్వంత భాష ఉంటుంది. ప్రపంచంలో 8 వేల భాషలు ఉన్నాయి.
మంత్రి: అంటే మనకు అవసరం అయితేనే ఇన్ని భాషలు నేర్చుకోవాలా?
అయ్యోరు: సొంత భాషలో చెబితేనే ఎవరికైనా బాగా అర్థం అవుతుంది. సొంత భాషలో- సొంత దేశం గురించి- సొంతంగా ఆలోచించితేనే దేశం బాగుపడుతుంది. అదే ఆత్మగౌరవం కూడా.
తండ్రి: ఇంగ్లీష్ నేర్చుకుంటే గానీ తెలివి రాదని నేననుకున్నానే?
నాగ: అరువు భాషలో ఎవరైనా తెలివిగా ఆలోచిస్తారా?
అరుణ: అయ్యా, మీరు కోటు..బూటు వేసుకొని పొలం పని చేస్తారా?
తండ్రి: అమ్మో..కోటు వేడి. ఉక్క పోసి చచ్చిపోతాం..బూట్లూ బురదలో పనికిరావు. పంచె, బనీను పనికి హాయి.
నాగ: చూశారా. మన వాతావరణానికి మన పంచే బాగుంటుంది.
అయ్య: మన పిల్లలకు మన భాషే హాయిగా ఉంటుంది. సొంత భాష రాకపోతే ఇతర భాషలు కూడా సరిగ్గా రావు.
జానకి (పాటలాగా): అమ్మ ఒడిలో విన్నాను కమ్మనైన తెలుగు
మన మదిలో వికసించే విజ్ఞానపు వెలుగు. తండ్రి: ఇక్కడి నుండి పదండి- లేకపోతే నాక్కూడా వీళ్ల మధ్యలో కూర్చోబుద్ధి అవుతుంది.
అయ్య: కూర్చోండి! చదువుకి వయస్సుతో సంబంధం లేదు కదా? అయినా- పదండి, చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి.
అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం-
మనం ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!
తల్లి: ఇదేమి అయ్యోరు? పిల్లలు బొమ్మలకు రంగులు వేస్తున్నారు? ఇంక వీళ్ళు చదువుకునేదెప్పుడు? అయ్యోరు: బొమ్మలు గీసి రంగులు వేయడం కూడా చదువేనమ్మా, చేతివేళ్ళు సాపుగా అవుతాయి.
అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- మనం
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!

అయ్యోరు: అటు చూడండి పిల్లలు తోట పని చేస్తారు. సేద్యం గురించి నేర్చుకుంటున్నారు.
తండ్రి: అదేదో మేమే నేర్పుతుంటిమి గదా, దానికి బడికి ఎందుకు?
అయ్యోరు: సేద్యం ఒక్కటే కాదుకదా! చదువుతో పాటు సేద్యం. దాంతో చదువు వల్ల, సేద్యం నీకంటే బాగా ఎలా చేయాలో నేర్చుకుంటారు.
తండ్రి: ఏదైనా పైసలు వచ్చే పని నేర్పించు సామీ! మాలాగా వాళ్ళుకూడా మట్టి పిసికేదెందుకు?
(వీళ్ళు మాట్లాడుతున్నదంతా వెనకనుండి వింటున్న రాజు మట్టి గురించి ఇలా అంటాడు:)
రాజు : మట్టి లేకుంటేమనిషే లేడు- (పద్యం:)
భూమిలోన పుట్టు భూసారమెల్ల
తనువులోన పుట్టు తత్వమెల్ల
శ్రమలోన పుట్టు సంపద తానౌను
విశ్వదాభిరామ వినుర వేమా

మంత్రి: గొప్ప విషయం చెప్పారు మహాప్రభూ!
అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- మనం
ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!
తల్లి: అదేమి, పిల్లలంతా ఆడుతూ ఉన్నారు?
రాజు: ఆటలు..ఆటల్లోనే కదా పిల్లల శరీరం, మనస్సు పెరుగుతాయి. ఒకరితో ఒకరు ఎలా జట్టు కట్టాలో..ఎట్లా సహకరించాలో ఎట్లా..కలిసి ఉండాలో. అందరు కలిసి పని పంచుకోవాలో ఆటల్లోనే కదా నేర్చుకుంటారు?
మంత్రి: అబ్బా! ఆటల్లో అంతుందా ప్రభూ?
రాజు: ఆటల్లోనే కదా స్నేహం పెరుగుతుంది? ఆటల్లోనే కదా ఓటమికి కుంగిపోకుండా ఉండడం నేర్చుకుంటారు?
మంత్రి: నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను. దేనినైనా పెంచి పోషించడమే విజయం దేన్నైనా నాశనం చేయడమే అపజయం. ఇంక సెలవు ప్రభూ..
రాజు: మంచిది. మీ దేశంలో పిల్లల్లాగ ప్రకృతిని ప్రేమించడం నేర్పండి.
కల్పన: మంత్రిగారూ, మంత్రిగారూ! ఏమి, అలా మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు?
పోతులయ్య: మేం కూడా మీకు తోడు రావాలా..
మంత్రి: వస్తే రండి. మా రాజ్యంలో పిల్లలను కాపాడి సహాయం చేద్దురుగాని.
కల్పన&పోతులయ్య: సరే- సరే- పదండి.
అందరు: విజ్ఞానంతోనే వికసించు జగత్తు
పసిపిల్లల చదువే దానికి విత్తు ..(2)
లేగదూడ గంతులు
పసిడిపూల కాంతులు
గాలి తరగ పిలుపులు
సెలయేటి అలల మెరుపులు
ప్రకృతిలో అణువణువు
పసిపిల్లల అమ్మఒడి
ఆ ప్రేమను పంచాలి
పిల్లలకు చదువులబడి
।విజ్ఞానం।
చిన్న చిన్న చేతులతో
మోయలేని బరువులతో
పసిపిల్లల మనసుల్లో గాయాలే రేగితే
ప్రమాదాల కోరల్లో బాల్యం బలి ఐపోతే
భావి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది?
।విజ్ఞానం।
దేశం ఏదైనా- కాలం ఏదైనా
చెప్పే చదువేదైనా బాల్యమొక్కటే
పువ్వులాంటి పసిప్రాయం
వసివాడిపోకుండా
కాపాడే బాధ్యత మన అందరిదీ అందరిదీ
।విజ్ఞానం।
పాఠమే పాటగా చదువే ఒక ఆటగా
గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా
మననుసు మురిపిస్తే బాధను మరిపిస్తే
తరగతి గదులే రేపటి తరగని నిధులు
।విజ్ఞానం।

తరువాతి అంకం

సైన్యాధి: అటెంక్షన్!! స్టాండెటీజ్!!
(రాజాధిరాజ- రాజ మార్తాండ- విశ్వవిజేత- విక్రమార్క మహారాజా- బహుపరాక్- బహుపరాక్) (అందరూ కూర్చుంటారు)
సైన్యాధి: మహారాజా! మన బడులలో పిల్లలందరికీ మొదటి ర్యాంకులు వచ్చాయి.
రాజు: అద్భుతం..అద్భుతం! అది ఎట్లా సాధించారు?
మంత్రి: ర్యాంకులు రావనుకున్న వాళ్లను అందరినీ ఇళ్ళకు పంపించారు!
రాజు, సైన్యాధి: మంత్రిగారు!..
రాజు: మంచి పని చేశారు!
సైన్యాధి: మిలట్రీలాగ వీళ్ళకి చదువులు నేర్పించాం!
మేమే స్వయంగా పరీక్షిస్తాం..ఏయ్..పిల్లవాడా!
సైన్యాధి: వాడి నంబర్ 2 .
రాజు: మనదేశంలో ఎంత సైన్యం ఉంది?
No.2: దేశమంతా సైన్యమే సార్..
రాజు: వెరీగుడ్..వెరీగుడ్. దేశంలో ఎన్ని బాంబుల ఫ్యాక్టరీలు ఉన్నాయి?
No.2: మనకున్న ఫ్యాక్టరీలన్ని అవే కదా సార్?
రాజు: వెరీగుడ్..వెరీగుడ్! నీకు ఇంకేమి తెలుసు?
No.2: మన దేశ ఆదాయంలో సగం పైగా బాంబులకు, మిలట్రీలకు ఖర్చు పెడతాం సార్.
మనమంటే ప్రపంచానికి హడల్.

మంత్రి: ప్రభూ! నేను ప్రశ్నలు అడుగుతాను.
రాజు: సరే..అడగండి.
మంత్రి: పాపా! నువ్వు చెప్పమ్మా?
సైన్యాధి: పాప కాదు నంబర్ 5.
మంత్రి: సరే- పాపా, నువ్వు చెప్పమ్మా! మన దేశంలో ఏఏ పంటలు పండుతాయి?
పాప: తుపాకులు, తూటాలు పండుతాయి సార్..
మంత్రి: అది కాదమ్మా..మనం తినే పంటలు-
సైన్యాధి: పంటలు పండించే ఖర్మ మనకేమిటి? పంటలు దిగుమతి చేసుకుంటాం.
No.2: అన్ని రకాల వస్తువుల్నీ పేద దేశాల నుండి చౌకగా దిగుమతి చేసుకుంటాం!
మనం తయారు చేస్తే ఖర్చు ఎక్కువ.
రాజు: కారు చౌకగా ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలను కూడా దిగుమతి చేసుకుంటాం!
సైన్యాధి: మనమిచ్చే డబ్బులకు వాళ్ళంతా కుక్కల్లా పని చేస్తారు.
మంత్రి: ఆ కుక్కలే తిరగబడి కాటేస్తే? ఇతర దేశాలు మనకు వస్తువులు ఆహార ధాన్యాలు ఇవ్వడం ఆపేస్తే?
రాజు: వాళ్ళకు ఎంత ధైర్యం ఉండాలి? మనల్ని ఎవరు ఎదిరిస్తే వాళ్లను నలిపి పడేస్తాం.
నందిని: ఎవరినైనా చంపడం నేరం కదా?
మంత్రి: ఒకరిని ఒకరు చంపితే హత్య.. ఒక దేశంపై దాడి చేసి లక్షల మందిని చంపితే యుద్ధం.
నందిని: చంపటం తప్పు. నేరం.
నర్మద: ఎవరు ఎవర్ని చంపినా తప్పే.. అందరూ బ్రతకాలి-
సైన్యాధి: నోర్ముయ్యండి.
రాజు: మనం చంపితే న్యాయం- అంతే!
No.2: ఎవరు ఎవర్ని చంపినా తప్పే!…అందరూ బ్రతకాలి!..ఎందుకు చంపినా నేరమే!
రాజు: సైన్యాధిపతీ. వీళ్ళకి ప్రశ్నించడం ఎవరు నేర్పారు, నన్నే ఎదిరిస్తున్నారు?
మంత్రి: చేపకు ఈదటం. పిట్టలకు ఎగరటం, పిల్లలకు అడగటం- ఎవరు నేర్పాలి?
రాజు: ప్రశ్న వేస్తే………..(4)
తలలు తీయిస్తా… No.2: పిల్లలందరి తలలూ తీయిస్తారా?
నందిని: ఎందుకంటే మేమంతా ప్రశ్నలు అడుగుతాం!
నర్మద: జవాబులు వచ్చే వరకూ అడుగుతూనే ఉంటాం!..(2)
రాజు: నేనిది భరించలేను! నేనిది భరించలేను!!
కల్పన: హమ్మయ్య!…యుద్ధంలో గెలిచిన రాజు, పిల్లల చేతిలో‌ ఓడిపోయాడు.
పోతులయ్య: వీచే గాలిని, పారే ఏరును, ఎదిగే పిల్లలను- ఆపటం ఎవరి వల్ల అవుతుంది? ఎప్పటికైనా ప్రపంచంలో పిల్లలే గెలుస్తారు! తప్పక గెలుస్తారు!
అందరు (పాట):
పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే
పిల్లలకే స్వరాజ్యం ఇస్తే
చిట్టి తల్లిని రాణిని చేస్తాం
చిట్టి తండ్రిని రాజును చేస్తాం
మా తాతే ఒక బొమ్మయితేను
మా అవ్వే ఒక బొమ్మయితేను
బొమ్మల పెళ్ళికి రమ్మని అంటాం
కమ్మని విందుకు గుమ్ముగ తింటాం
।పిల్లలకే।
చదువుకు గురువులు చాలకపోతే
బడులలో గురువులు కరువైపోతే
పిల్లలమంతా పంతుళ్ళమౌతాం
పెద్దలందరికి పాఠాలు చెబుతాం
।పిల్లలకే।
సూర్యుడు ఎర్రని కాగితమైతే
చంద్రుడు తెల్లని కాగితమైతే
వేడుకతోటి తాడుకు కట్టి
గాలిపటంలా ఎగరేస్తాం
।పిల్లలకే।
నక్షత్రాలే పుష్పాలైతే
మెరుపుతీగలే దారాలైతే
చుక్కల పువ్వులు చక్కని దండలు
మొక్కకు చదువుని మెడలో వేస్తాం
।పిల్లలకే।

 

పిల్లలకు జోకులు

జైలు యోగం!
టీచరు: “నేనొక వ్యక్తిని చంపాను” – భవిష్యత్ కాలంలోకి మార్చి చెప్పరా!
విద్యార్థి: “మీరు జైలుకు పోతారు” సర్!

ఉపాయం!
కొడుకు: నాన్నా! నా ప్రోగ్రెస్ కార్డు మీద నువ్వెప్పుడూ సంతకం చెయ్యవెందుకు? వేలిముద్రే ఎందుకు వేస్తావు?
తండ్రి: ఏం లేదురా! నీ అంత బాగా చదివే కొడుకును కన్నవాళ్లకు ‘చదువురాదు’ అని మీ టీచరు అనుకొని, అలాగైనా నిన్ను కొట్టకుండా వదిలేస్తుందని!

గొప్ప అర్థం!

టీచరు: “తమసో మా జ్యోతిర్గమయ” అంటే ఏంటో చెప్పరా, రణబీర్?
రణబీర్: నేను హిందీలో చెబుతాను టీచర్!
టీచరు: సరే, చెప్పు!
రణబీర్: तुम सॊऒ मा, मै ज्यॊती कॆ पास् जाता हू|

అయస్కాంతత్వం!

ప్రశ్న: ఒక అయస్కాంతం ఇంకో అయస్కాంతంతో ఏమంటుంది?
జవాబు: “నీలో చాలా ఆకర్షణ శక్తి ఉంది”

గజ చర్మం!

ప్రశ్న: ఏనుగు చర్మం ముడతలు పడి ఉంటుంది ఎందుకు?
జవాబు: ఎవ్వరూ దాన్ని ఇస్త్రీ చెయ్యరు కదా, అందుకని!

శకునం
ప్రశ్న: ఏ సమయంలో పిల్లిని చూడకూడదు?
జవాబు: నువ్వు ఎలుకవైనప్పుడు.

రెండు రోజుల తర్వాత!

ప్రశ్న: గొంగళి పురుగుకు రెండు రోజుల వయసు వచ్చాక ఏమౌతుంది?
జవాబు: మూడు రోజులది అవుతుంది.

 

పిల్లలకు జోకులు

చివరికి మిగిలేది!

తండ్రి: ఏరా, రాజేష్! నీకు ఎప్పుడూ సున్నా మార్కులే వస్తుంటాయి?
రాజేష్: మరి నేనేమి చెయ్యాలి నాన్నా! మా తరగతిలో 1 నుండి 100 వరకు అంకెల్ని అందరూ పంచుకుంటారు. చివరకు నాకు మిగిలేది సున్న ఒక్కటే!
(సేకరణ: యు. రేణుక, 8 వ తరగతి, ప్రకృతి బడి.)

ఏనుగు తొండం!

ప్రశ్న: ఏనుగు తొండాన్ని రోడ్డుకు అడ్డంగా ఎందుకు పరిచింది?
జవాబు:పరుగెత్తే చీమలు దాన్ని తొక్కి బొక్కబోర్లా పడాలని!

సగం పిల్లి!

ప్రశ్న:సరిగ్గా సగం పిల్లిలాగా ఉండేదేంటి?
జవాబు: మిగతా సగం పిల్లి.

చాలా దూరం!

టీచరు: భూమికి, చంద్రుడికి మధ్య దూరం కొలవాలంటే ఎన్ని దారపు ఉండలు కావాలి?
విద్యార్థి: పూర్తి పొడవు ఉండేది- ఒక్కటి చాలు.

 

జంతువుల బడి

అనగా అనగా ఒకసారి జంతువులన్నీ సమావేశమైనాయి. “మన సమాజంలో సంబంధాలన్నీ రాను రాను చాలా సంక్లిష్టం అయిపోతున్నాయి. దీన్ని తట్టుకునేందుకు-గాను మనం ఏమైనా చెయ్యాల్సిందే, తప్పదు” అనుకున్నాయి. అన్నీ కలిసి చర్చించుకొని, భావి తరాల బాగుకోసం ఒక బడి పెట్టాలని నిశ్చయించుకున్నాయి.

ఆ బళ్ళో పరుగెత్తటం, పైకి ఎగ బ్రాకటం, ఈదటం, ఎగరటం నేర్పించాలని నిర్ణయమైంది. ఈ నాలుగూ అన్ని ప్రాణులకూ అవసరమైన మౌలిక విషయాలే- కనుక, ‘విద్యార్థులందరూ ఈ నాలుగింటిలోనూ ప్రావీణ్యత సాధించాల్సిందే’ అని నిశ్చయమైంది.

బాతుకు ఈదటం అసలు సమస్యే కాలేదు. నిజానికి అది తమ టీచరుకంటే బాగా ఈదింది! అది చక్కగా ఎగిరింది కూడా. కానీ పాపం, దానికి పరుగెత్తటమే, బాగా రాలేదు. ఈ అంశంలో అది వెనకబడి ఉన్నది కనుక, ముందు కొన్నాళ్లపాటు దాన్ని బడి వదిలిన తరువాత కూడా ఉండమన్నారు. అలా దాన్ని ఎక్కువసేపు పరుగెత్తించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరికి అది తనకు చాలా ఇష్టమైన ఈతను ప్రక్కన పెట్టి, ఆ సమయాన్ని కూడా పరుగులు పెట్టేందుకే వెచ్చించాల్సి వచ్చింది. దాన్ని ఈ వెనకబడిన అంశంలో ఎంత కాలం నిలిపి ఉంచారంటే, చివరికి దాని పాదాలకు తీవ్రంగా గాయాలైనాయి. ఈదటంలో అది ఇప్పుడు ‘సాధారణ’ స్థాయికి పడిపోయింది. కానీ అలా సాధారణ స్థాయి ఉంటే బడి పరిధిలో పరవాలేదు, కనుక ఎవ్వరూ ఈ విషయమై బాధ పడలేదు- బాతు ఒక్కటీ తప్ప!

ఇక కుందేలు, పరుగుల్లో ఫస్టుగా ఉండేది. కానీ చివరికి అది నరాల బలహీనతకు లోనై తప్పుకోవాల్సి వచ్చింది. తనకు అస్సలు ఇష్టంలేని ఈత కోసం మరింత ఎక్కువ సమయాన్ని వెచ్చించీ, వెచ్చించీ దాని పరిస్థితి అట్లా తయారైంది.

పైకి ఎగబ్రాకటంలో మొదటి స్థానంలో ఉన్న ఉడుత, మొదట్లో బాగానే ఉండేది. కానీ ఎగిరే తరగతిలో టీచరు దాన్ని చెట్ల కొమ్మల పైనుండి కాక, నేలపైనుండి మొదలు పెట్టమని శాసించేసరికి, దానికి మెదడులో ఏవో అడ్డుగోడలు తయారయ్యాయి. దానితో అది ఇక ఎగరలేకపోయింది. అందుకని, దాన్ని ఎగిరే తరగతిలోనే నిలిపి మరింత సాధన చేయించారు. చివరికి, పాపం, దాని కండరాలు బిగుసుకు పోయాయి- అలా దానికి ఎగబ్రాకటంలో‌ c గ్రేడు, పరుగులెత్తటంలో‌D గ్రేడు వచ్చాయి. బడి మొత్తంలోనూ క్రమశిక్షణ సమస్య ఏదైనా ఉందంటే అది గ్రద్దనే. ఎగబ్రాకే తరగతుల్లో అది మిగిలిన వాళ్లందర్నీ మించిపోయేది. అన్నిటికంటే ముందుగానే అది గమ్యాన్ని చేరుకునేది. అయితే, అలా చేసేందుకు అది తన పద్ధతుల్ని తను ఉపయోగించేది తప్పిస్తే, ఎవ్వరిమాటా వినేది కాదు.

ఇక పందికొక్కుల్లాంటి బిలాశయ జీవులైతే బడిలో చేరనేలేదు! విద్యకోసం ప్రభుత్వం వారు విధించిన పన్నును వ్యతిరేకిస్తూ అవి పోరాటం ఆరంభించాయి- ఏమంటే, నేలలో బొరియలు చేయటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చలేదని వాటికి కోపం వచ్చింది. అవన్నీ తమ పిల్లల్ని ముందు ఎలుకకు, తర్వాత పందికొక్కుకు అనుచరులుగా ఉంచి శిష్యరికం చేయించాయి.

చివరికి అవన్నీ కలిసి ప్రత్యామ్నాయ విద్యనందించే ప్రైవేటు బడిని ఒకదాన్ని ప్రారంభించాయి!

 

పిసినారి పాట్లు!

పంజాబ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం బంగ. బంగలో నివసించే ప్రతి ఒక్కరికీ తెలుసు- మంగళ్దాస్ ఎంత పిసినిగొట్టో. ఒకసారి మంగళ్దాసు దుకాణంనుండి ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య పుచ్చకాయ (కలింగరి కాయ)ముక్కలు తరిగి పెట్టింది. అయితే ఇంట్లో చూస్తే, దాని పై చెక్కు కనబడలేదు మంగళ్దాసుకు. దాంతో అతను ఎంత రగడ చేశాడంటే, చివరికి అతని భార్య విసిగిపోయి, తను బయట చెత్తకుప్పలో పారేసిన పుచ్చకాయ చెక్కుల్ని ఏరుకొచ్చి, వాటిని కడిగి, కూర చేసి పెట్టింది!

ఒకసారి ఆ మంగళ్దాసు పనిమీద నగరానికి వెళ్లాల్సి వచ్చింది. బస్సు ఛార్జీలు మిగుల్చుకునేందుకుగాను అతను నగరం వరకూ నడిచి పోయాడు. మధ్యలో నదిని దాటేందుకు, మరబోటులో అయితే ఎక్కువ అడుగుతారని, తాతల కాలంనాటి పాత డింగీనొకదాన్ని ఎక్కాడు.

వెళ్లటం బాగానే వెళ్ళాడు గాని, వెనక్కి వచ్చేటప్పుడు, కాలం చెల్లిన ఆ పడవకు చిల్లి పడింది. ఆ సమయానికి పడవ నది మధ్యలో ఉన్నది. దగ్గర్లో నేల అన్నది లేదు. రంధ్రంగుండా నీళ్లు బలంగా లోపలికి వస్తున్నాయి- చూస్తూండగానే డింగీ నీళ్లలో మునిగిపోనారంభించింది. మంగళ్దాసు ప్రాణాలు పోయినంత పనైంది- ఎందుకంటే అతనికి ఈత రాదు మరి. ఇక చేసేదేమీ లేక, అతను తన కుల దైవాన్ని ప్రార్థించటం మొదలు పెట్టాడు- “స్వామీ, నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కిస్తే, నీ సంతృప్తి కోసం నేను సంతర్పణ చేసి, వెయ్యిమంది బ్రాహ్మణులకు భోజనం పెడతాను” అని గొణగసాగాడు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని.

పడవ మునిగిపోయింది. మంగళ్దాసు కూడా మునిగేవాడే- కానీ ఆ సమయంలో ఎక్కడినుండి వచ్చిందో మరి- ఒక పెద్ద కొయ్య దుంగ అతని పక్కకే వచ్చి ఆగింది. మంగళ్దాసు గబుక్కున ఆ దుంగను పట్టుకున్నాడు- మెల్లగా దాని పైకి ఎక్కి కూర్చున్నాడు- భద్రంగా సర్దుకొని, చతికిలబడి కూర్చున్నాడు. దాంతో భయం కొద్దిగా తగ్గింది. ఇప్పుడు అతనికి ఊపిరి పీల్చుకునేందుకు కొంచెం సమయంకూడా దొరికింది. దాంతోటే ఆలోచనా మొదలైంది- “అయ్యో, వెయ్యి మందికి భోజనం పెడతానని నేను ఎట్లా అనగల్గాను? వెయ్యి మంది అంటే మాటలు కాదే! అయినా ఆ దేవదేవుడికి ఈ లెక్క ఏమంత పెద్దది గనక? నేను ఐదు వందల మందికి భోజనం పెట్టినా ఆయనకు సంతోషమే అవుతుందిలే, పరవాలేదు” అనుకున్నాడు.

అలా పోయి, పోయి, దుంగ ఒక పల్లపు ప్రాంతాన్ని చేరుకొని ఆగింది. మంగళ్దాసు కాళ్లకు ఒక పెద్ద బండరాయి తగిలింది. అతను దాన్ని కొంత తడిమి, చివరికి దాని పైకెక్కి నిలబడ్డాడు. దగ్గర్లోనే ఒడ్డు కనిపిస్తున్నది- ఇక ప్రమాదం తప్పినట్లే. అతని ఆలోచనలు తను భోజనం పెట్టాల్సిన ఐదువందల మంది బ్రాహ్మణుల వైపుకు మళ్ళాయి. “ఐదు వందలమందికి భోజనం పెట్టనవసరంలేదు- ఐదు వందలలో ఏమున్నది? వందమందికి పెట్టినా మా ప్రభువుకు సంతోషమే. ఆయన నిత్య సంతోషి కదా, ఏమీ పరవాలేదు.” అనుకున్నాడు.

బండమీద కొంచెం సేద తీరిన తరువాత అతను మళ్ళీ దుంగపైకి ఎక్కి ప్రయాణం సాగించాడు ధైర్యంగా. అది త్వరలో ఒడ్డున ఉన్న ఇసుకను తాకింది. ప్రమాదం పూర్తిగా తప్పిపోయినట్లే. ఇక మంగళ్దాసు సంతృప్తిగా నిట్టూర్చి, ఇంకా బాగా అనిపించటంకోసం, తను భోజనం పెట్టాల్సిన బ్రాహ్మణుల సంఖ్యను ఒకటికి తగ్గించేసుకున్నాడు. ” ‘భగవానుడు ‘పత్రం, పుష్పం, ఫలం, నీళ్ళు’-ఇవి చాలు నాకు’ అనలేదా, దానిదేమున్నది?” అనుకున్నాడు ఇప్పుడు.

అయినా, భద్రంగా ఇల్లు చేరుకున్నాక ఆలోచిస్తే అతనికి అదీ భారంగానే అనిపించసాగింది- ఏమంటే “ఈ బ్రాహ్మణులు తిండి బాగా తింటారు- పెద్ద పెద్ద బొజ్జల నిండా” అని బాధ. అందుకని, అతను బాగా ఆలోచించి, ఒక బక్కపలచటి బ్రాహ్మణుడు ‘రిఖీరాం’ ను ఎంపిక చేసుకున్నాడు. రిఖీరాంకు కడుపు సౌఖ్యం లేదని ఊరందరికీ తెల్సు. అందుకని మంగళ్దాసు వాళ్ళింటికి పోయి, అతన్ని మరుసటి రోజు ఉదయం తన ఇంట్లో భోజనానికి రమ్మని చెప్పి చక్కా వచ్చాడు.

“అయితే, బ్రాహ్మణుడు తనని చూశాడంటే ఏదో‌ ఒక పేరు చెప్పి బాగా దక్షిణ వసూలు చేస్తాడు- అదే, తను గనక ఇంట్లో లేకపోతే ఊరికే నోరుమూసుకొని, భోజనం చేసి పోతాడు- అందుకని, మంగళ్దాసు మరునాడు తెల్లవారకనే భార్యకు జాగ్రత్తలు చెప్పి, ఆ బ్రాహ్మణుడికి దొరక్కుండా ‘ముఖ్యమైన పని’ ఏదో పెట్టుకొని, వేరే ఊరికి వెళ్ళిపోయాడు.

కానీ బ్రాహ్మణుడు రిఖీరాం చాలా తెలివైనవాడు. అతనికి మంగళ్దాసు నైజం బాగా తెలుసు. వీలైతే మంగళ్దాసు తనకు దక్షిణ కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టేయగలడు! అందుకని, తెల్లవారగానే బయలుదేరి మంగళ్దాసు ఇంటికి వెళ్ళాడు రిఖీరాం. అయినా ఆ సరికే మంగళ్దాసు వేరే ఊరికి వెళ్ళిపోయాడు! ‘ఇదీ మన మంచికే’ అనుకున్న రిఖీరాం మంగళ్దాసు భార్య ‘పారో’తో- “తల్లీ, నేను ఒక్కడినే భోజనానికి వస్తున్నానని వంట పరిమితంగా చేస్తావేమోనని, ముందుగా హెచ్చరించి పోదామని వచ్చాను- ఈ పూజ ‘సంతర్పణ’-కనుక కనీసం పది మందికి సరిపడా భోజనం తయారు చేయవలసి ఉంటుంది. లేకపోతే ప్రయోజనం సిద్ధించద్దూ?!” అన్నాడు. ఆమె ఇక ఏమీ అనలేక, సర్దుకొని, “అయ్యో! ఆ మాత్రం నాకు తెలీదా, అలాగే చేస్తానులెండి!” అని చెప్పింది.

రిఖీరాం పూజ మొదలుపెట్టి, భోజనం మొత్తాన్నీ‌దేవుడి ముందు పెట్టించి, పారోతో‌ “తల్లీ! ఒక వంద రూపాయలు దేవుని ముందు ఉంచండి” అన్నాడు. ఈ విషయాల్లో పెద్దగా అనుభవం లేని పారో, ఆయన ఎలాచెబితే అలా చేసింది. పూజ తరువాత రిఖీరాం తృప్తిగా భోజనం చేసి, దేవుని ముందున్న పూజా- ద్రవ్యాలతోబాటూ ఆ డబ్బును కూడా తీసుకొని, మిగిలిన భోజన పదార్థాలన్నిటినీ‌ మూట గట్టుకొని, ఇంటికి బయలుదేరాడు. పోయేముందు పారోకు గుర్తుచేసి తన దక్షిణ-200రూపాయలు- ఇప్పించుకున్నాడు కూడా -మరి, ‘వ్రతం చెడకూడదు’ కదా, అందుకని! ఆపైన అతను సంతోషంగా పాటలు పాడుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు.

ఇంటికైతే చేరుకున్నాడు గానీ, మంగళ్దాసు వెనక్కి రాగానే తన ఇంటిమీదికి దండెత్తి వస్తాడని తెలుసు రిఖీరాంకు. అందుకని, అతను తను తీసుకొచ్చిన సామాన్లనీ, డబ్బునూ భార్య చేతికిచ్చి, మంగళ్దాసు వస్తే ఏంచేయాలో చెప్పి, హాయిగా పడుకున్నాడు.

మధ్యాహ్నానికి ఇల్లు చేరుకున్నాడు మంగళ్దాసు. రాగానే భార్యను అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ ఖర్చును చూసేసరికి అతనికి గుండె ఆగినంత పనైంది. ‘తను లేని సమయం చూసుకొని ఇంత మోసం చేస్తాడా’ అని కోపంతో ఊగిపోయాడు. ఒక పెద్ద వెదురుకట్టెను చేత బట్టుకొని, ఆవేశంగా రిఖీరాం ఇంటికి బయలుదేరాడు.

అక్కడికి చేరుకునేసరికి, అతనికి ఏడుపులు, పెడబొబ్బలు వినబడ్డాయి. ఇంటి గడపలో కూర్చొని రిఖీరాం భార్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. “అయ్యో!‌దేవుడా! ఏం చేసేది? నా భర్త చచ్చిపోతున్నాడు నాయనో! వద్దంటున్నా వినకుండా ఆ మంగళ్దాసు ఇంటికి పోయి భోజనం చేశాడు. అందులో ఏం విషం కలిపారో, ఏమో? ఉలుకూ పలుకూ లేదు; స్పృహలో లేడు. నాయనోయ్, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాడు బాబోయ్!” అని గట్టిగా శోకాలు పెడుతున్నది ఆమె.

మంగళ్దాసుకు అంత చలికాలంలోనూ చెమటలు పోశాయి. కట్టె చేతిలోంచి జారి పడిపోయింది. ముఖం పాలిపోయింది. పెదిమలు ఎండిపోయాయి. “రిఖీరాం చచ్చిపోయాడంటే ఇక నన్ను జైల్లో పెడతారు- బహుశ: ఉరి తీస్తారేమో కూడా!” అని అతనికి చెప్పరానంత భయం వేసింది. కిటికీలోంచి లోపలికి చూస్తే మంచం మీద కదలకుండా పడి ఉన్న రిఖీరాం కనబడ్డాడు. ఆ పరిస్థితిలో రిఖీరాంని చూసే సరికి అతనికి ఇంకా బెదురు పుట్టింది. “రిఖిరాం స్పృహలో లేడు; కానీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు! అతను ఎట్టి పరిస్థితుల్లోనూ చచ్చిపోకూడదు. లేకపోతే ఇదంతా నా తలకు చుట్టుకోక మానదు” అని మంగళ్దాసు రిఖీరాం భార్య ముందుకెళ్ళి “అతనికేమీ అవ్వదు. వెంటనే ఓ టాక్సీని పిలిపించు, నగరంలో చాలా మంచి ఆసుపత్రులున్నై, మంచి ఆసుపత్రిలో చేరిస్తే ఇట్టే కుదురుకుంటాడు” అన్నాడు.

“ఆ ఆలోచన నాకు కూడా వచ్చింది. కానీ అలా చేయాలంటే కనీసం వెయ్యి రూపాయలైనా కావాల్సి ఉంటుంది. ఇంత సీరియస్ గా ఉన్న రోగిని ఏ ఆసుపత్రి వాళ్ళూ డబ్బు లేకుండా ఉచితంగా చేర్చుకోరు” అంటూనే, రిఖీరాం భార్య “అయ్యో, దేవుడో! మమ్మల్ని బికారుల్ని చేసి పోతున్నావా, స్వామీ! నేను ఇంకెన్నాళ్ళు బ్రతకాలి, ఇలా?” అని గొంతు హెచ్చించింది.

మంగళ్దాసుకు ఇక కాళ్లూ చేతులూ ఆడలేదు. మెదడు మొద్దుబారినట్లైంది. తన పిసినారితనం ప్రక్కన పెట్టి, అతను రిఖీరాం భార్యతో ” చూడమ్మా! డబ్బుకు వెనకంజ వేయాల్సిన సమయం కాదిది. త్వరగా ఏదైనా చేసి నీ భర్త ప్రాణాలు కాపాడుకోవాలి. నీ కొడుకును నాతో‌పంపించావంటే, నేను ఇస్తాను- ఆ వెయ్యి రూపాయలూ! కానీ- త్వరగా పంపాలి! -వెంటనే!” అన్నాడు.

అట్లా పిసినారి మంగళ్దాసుకు మరో వెయ్యి రూపాయలు వదిలాయి!

ఒకటి రెండు రోజులయ్యేసరికి, ఈ కథ ఊరంతటికీ తెలిసిపోయింది. అందరూ మంగళ్దాసును తలచుకొని కడుపుబ్బ నవ్వుకున్నారు. బంగ పట్టణానికి వెళ్లి ఎవరైనా ‘మంగళ్దాస్’ అన్నారంటే చాలు- అక్కడ ఈనాటికీ నవ్వుల పువ్వులు పూస్తాయి!

 

నాగమాత కథ

అనగా అనగా గుజరాత్ లో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు కొడుకులు, కోడళ్ళు. వాళ్ళల్లో అందరికంటే చిన్న కోడలుపేరు ఉమ. ఆమెకు, పాపం, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ రోజుల్లో అలాంటి కోడళ్లను అత్తింటివాళ్ళు చాలా కష్టపెట్టేవాళ్ళు. వాళ్ళు ‘దురదృష్ట జాతకులు’ అని అందరూ చిన్నచూపు చూసేవాళ్ళు. ముఖ్యంగా ఆమె అత్త కోకిలాబెన్- ఉమని చాలా ఈసడించుకునేది. ఇంట్లోవాళ్లంతా ఆమెని “ఎవరూ లేని పిల్ల” అని పిలిచి ఏడిపిస్తుండేవాళ్ళు. ఆమె భర్త మాత్రం ఆమెపట్ల ప్రేమగా ఉండేవాడు. అతనొక్కడే ఆయింట్లో ఆమెకు స్నేహితుడు. కానీ ఇంట్లో అతనిమాట నెగ్గేది కాదు- ఎవ్వరూ అతన్ని పట్టించుకునేవాళ్లు కాదు.

పెళ్ళైన కొన్ని నెలలకే ఉమ గర్భవతి అయ్యింది, కానీ‌ భర్త తప్ప, ఆ యింట్లో ఎవ్వరూ అందుకు సంతోషించలేదు. అంతలోనే పెద్దల పండుగ వచ్చింది. ఆరోజున గృహస్తులంతా వాళ్ళ పూర్వీకులకోసం‌ పిండివంటలు, స్వీట్లు చేసి అర్పించటం రివాజు. అందుకని ఇంట్లో పాయసం వండారు. ఉమకు పాయసం చాలా ఇష్టం. దానికి తోడు గర్భవతికూడా కావటంతో, ఆమె పాయసం తినాలని చాలా‌ ఆశపడింది. కానీ ఇంట్లోవాళ్ళు ఆమెకు ఒక్క చుక్క పాయసంకూడా ఇవ్వలేదు. అందరూ తిని, గిన్నెలు ఖాళీ చేశాక, వాళ్లు గిన్నెలు ఉమకు ఇచ్చేసి, శుభ్రంగా తోమిపెట్టే పనిని అప్పజెప్పారు!

అయినా పాపం, ఆమె ఏమీ అనలేదు; పాయసం వండిన గిన్నెను తీసుకెళ్లి, దాని లోపల అంటుకొని ఉన్న మాడు చెక్కల్ని అన్నిటినీ గీకి, కనీసం ఆ ముక్కల్నైనా తిందామనుకున్నది. అయితే ఆమె అప్పటికి ఇంకా స్నానం చేయలేదు- అందుకని, గీకిన పాయసం మాడుచెక్కల్ని ఆమె ఒక బట్టలో మూటగట్టి అక్కడ పెట్టుకొని, స్నానానికి పోయింది.

కానీ‌ ఆమె స్నానం చేసి తిరిగివచ్చి చూసేసరికి, ఆ మూట ఖాళీగా ఉంది! ఉమకు చాలా దు:ఖం వేసింది. అయినా ఆమె “పోనీలే, నా పాయసం పోయింది. ఎవరో ఎత్తుకుపోయినట్లున్నారు. నాకంటే వాళ్ళకే ఎక్కువ ఆకలి అయ్యిందేమోలే. నేనే వాళ్లకి కృతజ్ఞతలు చెప్పాలి- ఎందుకంటే ఆకలిగా ఉన్నవాళ్ళకు భోజనం పెడితే పుణ్యం వస్తుంది గద!” అనుకున్నది.

అంతలో, ఎక్కడినుండి ఊడిపడిందో, ఏమో ఒక పే..ద్ద పాము ఆమె ముందుకొచ్చి నిలబడింది. భయంతో ఉమ వణికిపోయింది. అంతలో ఆ పాము ఉమతో‌మనిషి భాషలో ఇలా అన్నది: “అమ్మాయీ! భయపడకు. నా పేరు నాగరాణి. నీ పాయసం తిన్నది నేనే! నేను నీ పాయసం మొత్తాన్నీ తినేసినా, నువ్వు నన్ను ఏమీ తిట్టుకోలేదు. అందుకని నువ్వంటే నాకు చాలా ఇష్టం అవుతున్నది. నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేద్దామనిపిస్తున్నది. చెప్పు, నువ్వెందుకు అంత బాధగా ఉన్నావు?” అని అడిగింది.

అప్పుడు ఉమ తన గోడు అంతా నాగరాణికి చెప్పుకున్నది. బంధువులు ఎవ్వరూ లేరని తనని అత్తింటివాళ్ళు ఎలా కష్టపెడుతున్నదీ వివరించింది. అంతావిని నాగరాణి “నీకు ఎవరూ లేరని అనుకోకు. నేను మీ అమ్మనే అనుకో. ఇక మా వాళ్లం అందరం నీకు బంధువులమే! నీ అవసరాలన్నీ‌ ఇకపైన మేమే తీరుస్తాం” అన్నది.

తర్వాత కొన్ని నెలలకు ఉమకు శ్రీమంతం చేయాల్సిన సమయం వచ్చింది. అత్తింటివాళ్ళు, అయిష్టంగానే శ్రీమంతానికి తేదీ నిర్ణయించారు. “నా దూరపు బంధువు ఒకావిడ ఈ మధ్యే నన్ను చూసింది- ఆమె ద్వారా నాకు ఇంకా కొద్దిమంది బంధువులు ఉన్నట్లు తెల్సింది- ఆహ్వానాలు పంపితే, వాళ్ళుకూడా వస్తారు” అన్నది ఉమ అత్తతో.

“అయ్యో, వస్తారంటే పిలువకేమి, తల్లీ? అయినా వాళ్ళంతా నీ ఊహల్లోనే తప్ప, వాస్తవంలో ఉండరని నా అనుమానం” అన్నది కోకిలాబెన్, ఈసడించుకుంటూ.

అయితే శ్రీమంతం రోజున, ఆశ్చర్యం! ఉమ తరపు బంధువులు చాలామంది- కార్లలోనూ, బస్సుల్లోను, ఆటోల్లోను వచ్చి వాలారు. ధగ ధగ మెరిసే ఉంగరాలు, నగలు, పట్టు వస్త్రాలతో వాళ్లంతా ఇంట్లో తిరుగుతూ ఆప్యాయంగా గలగలా మాట్లాడుతుంటే అత్తింటివాళ్ళు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. వాళ్లంతా ఉమకోసమూ, ఇంట్లో వాళ్ళందరికోసమూ అమూల్యమైన బహుమతుల్ని తెచ్చి ఇస్తుంటే అత్తగారికి “ఇదంతా కలా, నిజమా” అనిపించింది. ఆమె వాళ్లందరినీ ఎంతో గౌరవించి, గొప్ప విందు చేసి సత్కరించింది.

ఆ తరువాత నాగమాత ఉమను తనవెంట నాగలోకానికి తీసుకెళ్ళింది. ఉమను కాలు క్రింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నది. అక్కడ ఉమకు పండంటి కొడుకు పుట్టాడు.

బంగారంలాంటి కొడుకును ఎత్తుకొని, భాగ్యవంతులైన బంధువర్గాన్ని వెంటబెట్టుకొని అత్తవారింటికి తిరిగి వచ్చిన ఉమకు ఇప్పుడు అత్తింటివారు బ్రహ్మరధం పట్టారు! అందరూ ఉమను ఎంతో గౌరవించసాగారు- సంపద ఏమేం చేస్తుందో చూడండి!

 

ముగ్గురు మూర్ఖులు కథ

ఒక క్రిస్టియన్ ఫాదర్ గారు దేశదేశాలు పర్యటించి దేవుని వాక్యాన్ని అందరికీ చేరవేస్తుండేవారు. “బైబిల్ లో చెప్పిన ఈ ప్రార్థనను మీరూ నేర్చుకోండి. ఈ విధంగా దేవుడిని ప్రార్థించాలి. మీకు తప్పక విముక్తి లభిస్తుంది” అని ఆయన గంభీరంగా ప్రవచిస్తే, ప్రజలు మంత్రముగ్ధులై ఆయన చెప్పినట్లు చేసేవాళ్ళు.

ఆ రోజుల్లో ఖండాల్ని దాటేందుకు పడవ ప్రయాణం తప్ప వేరే మార్గం లేదు. పాస్టరుగారు తన అనుచరులతో కలిసి ఓడలమీద దేశదేశాలూ తిరుగుతూ ఉండేవారు.

ఒకసారి, ఆయన అలా సముద్రయానం చేస్తుంటే, దూరంగా ఒక దీవి కనబడ్డది. ఉత్సాహవంతుడైన మన పాస్టరుగారికి “అక్కడ మనుషులు ఎవరైనా ఉంటారేమో చూద్దాం” అనిపించింది. “ఎవరైనా ఉంటే వాళ్ళకూ దైవ ప్రార్థన నేర్పించవచ్చు కదా, అలా మరికొంతమందికి ముక్తిమార్గాన్ని చూపినట్లౌతుంది” అని, ఆయన ఓడను అటువైపుకు తిప్పమన్నాడు.

ఆ దీవి నిర్జనంగా ఉంది. పాస్టరుగారు తన అనుచరులతో కలిసి దీవిలో‌ కొంతసేపు తిరిగి చూశారు. మానవమాత్రులు ఉంటున్న జాడలే లేవు అక్కడ. పాస్టరుగారు ఇక వెనక్కి తిరుగుదామనుకున్నంతలో ముగ్గురు ముసలివాళ్ళు దూరంనుండి ఆయనవైపే వస్తూ కనబడ్డారు. వాళ్ళ జుట్టు పొడుగ్గా ఉండి, తెల్లగా మెరిసిపోతున్నది. తెల్లటి గడ్డాలు- బాగా పెరిగి ఉన్నై, వాళ్లకు. వాళ్ళు తమ శరీరాల్ని చెట్ల ఆకులతో కప్పుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకేలాంటి వస్తువులూ లేవు.

పాస్టరుగారు ఆగి, వాళ్ళకోసం చూశారు. వాళ్ళు దగ్గరికి రాగానే అయన వాళ్లను “ఈ దీవిమీద ఏదైనా గ్రామంగాని, పట్టణంగాని ఉన్నదా?” అని అడిగాడు.

ఒక ముసలాయన వినయంగా జవాబిచ్చాడు- “లేదండీ, ఈ దీవిమీద కేవలం మేం ముగ్గురమే నివసిస్తున్నాం. ఇంకెవ్వరూ లేరు ఇక్కడ. మేం పండ్లు తిని, నీళ్ళు తాగుతుంటాం. ఎవరైనా మీలాంటి యాత్రీకులు అనుకోకుండా ఇటువైపుకు వస్తే మేం‌వాళ్లకూ ఇవే ఇస్తుంటాం” అని.

“అయ్యో!” జాలి పడ్డారు పాస్టరుగారు. “ఇదా, మీరు చేస్తున్నది? ఎంత దురదృష్టవంతులు, మీరు? రోజంతా ఖాళీగా ఇలా మీ సమయాన్నంతా వృధా చేసుకుంటున్నారు, పాపం. మిమ్మల్ని సృష్టించిన భగవంతుడు ఒకడున్నాడని కూడా గుర్తించలేని మీ జన్మ వృధా కాదా?” అని.

“అలాంటిదేమీ లేదు. మేం ఆయన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అది తప్ప మాకు వేరే పనేదీ లేదు” అన్నాడు రెండవ ముసలాయన.

“అవునా, ఎలా గుర్తు చేసుకుంటుంటారు, చెప్పండి?” అడిగారు పాస్టరుగారు.

“రోజూ మేం ముగ్గురం కలిసి కూర్చుంటాం. ఆపైన ఆకాశం వైపుకు చూస్తూ, చేతులు పైకెత్తి- ‘మేం ముగ్గురం, మీరూ ముగ్గురే. మమ్మల్ని కాపాడండి’ అంటాం.” చెప్పాడు మూడవ ముసలాయన.

ఫాదరుగారు నవ్వారు. “ఎంత పిచ్చి ప్రార్థన, ఇది?! మీరు ముగ్గురూ ముసలివాళ్లయ్యారు. కాటికి కాళ్ళు చాపే వయసు మీది. ఇంత గొప్ప జీవితాన్ని ఇలా వ్యర్ధం‌చేసుకున్నారంటే, మీమీద నాకు జాలి కల్గుతున్నది. రండి- కూర్చోండి ఇక్కడ. అసలు ప్రార్థన ఎట్లా చేయాలో మీకు నేను నేర్పుతాను” అన్నారు.

ముగ్గురూ కూర్చున్నాక, ఆయన వాళ్ళకు సరైన పద్ధతిలో ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. చదువురాని ఆ మొద్దులకు ప్రార్థన నేర్పించటం కొంచెం కష్టమే అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఆ పదాల్ని మర్చిపోతూ వచ్చారు. అయినా పాస్టరుగారు విసుక్కోకుండా వాళ్లకు మళ్ళీ మళ్ళీ నేర్పారు. వాళ్ళ బాగుకోసం ఆ మాత్రం శ్రమపడితే పరవాలేదనుకున్నారు ఆయన. చివరికి, వాళ్ళకు ప్రార్థన చేసుకోవటం వచ్చేసిందనిపించాక, పాస్టరుగారు సంతృప్తిగా ఓడనెక్కి, తన ప్రయాణం‌కొనసాగించారు.

ఓడ ఆగకుండా పోతున్నది. మరునాటి మధ్యాహ్నంవేళ, పడవను నడిపేవాడొకడికి, వెనుక వైపున- దూరంగా సముద్రంమీద ఒక ఆకారం కనబడ్డది. “అదేమై ఉంటుంది?” అని వాడు అందరినీ అడిగాడు. దుర్భిణిలోంచి చూసిన పాస్టరుకు అక్కడ ఒకటికాదు- మూడు మానవాకారాలు కనబడ్డై.

“అవేమిటి?” అని అందరూ ఆశ్చర్యపోతూనే ప్రయాణం కొనసాగించారు.

అయితే కొద్ది సేపటికి వాటి రహస్యం తేటతెల్లమైంది. వాళ్ళు మనుషులే! పాస్టరుగారు క్రితంరోజున ప్రార్థన నేర్పిన ముగ్గురు మూర్ఖులే వాళ్ళు. నట్టనడి సముద్రంలో‌, నీళ్లమీద, ఓడకంటే వేగంగా పరుగెత్తుకొని వస్తున్నారు వాళ్ళు. పాస్టరుగారు ఓడని నిలబెట్టారు. “ఈ ముసలివాళ్ళు ముగ్గురూసముద్రంలో మునిగిపోలేదు- ఎందుకు?” అని ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. అంతలో వాళ్ళు ఓడను చేరుకొని అందరికీ నమస్కరించారు.

“ఫాదర్, మమ్మల్ని మీరే కాపాడాలి. మేం ముగ్గురం చదువురాని వాళ్ళం, పల్లె మనుషులం. నిన్న మీరు అంత శ్రమకోర్చి నేర్పిన ప్రార్థన, ఈ రోజు ఎంత గుర్తు చేసుకుందామన్నా గుర్తు రాలేదు మాకు. మీరు అన్యధా భావించకండి, నిన్నటి ప్రార్థననే మళ్ళీ ఓసారి నేర్పించాలి మాకు. ఈసారి తప్పకుండా గుర్తుంచుకుంటాం” అన్నారు వాళ్ళు.

ఇంకా ఆశ్చర్యంనుండి తేరుకోని పాస్టరు గారు “కానీ, ముందు ఈ సంగతి చెప్పండి నాకు- మీరు నీళ్ల’మీద’ ఎట్లా పరుగెత్త- గల్గుతున్నారు?” అని అడిగారు.

“అదేమంత కష్టం కాలేదు” చెప్పాడు వాళ్లలో‌ఒకడు- “మేం దేవుడితో చెప్పాం-’దేవుడా, మాకు పడవ లేదు. ప్రార్థన నేర్చుకోవటంకోసం మేం పరుగెత్తుతాం’ అని. ఆ తరువాత మేం‌ పరుగు మొదలుపెట్టాం” అన్నాడు.

అప్పటివరకూ ఆ ముగ్గురు అనాగరికుల్నీ‌ చిన్నచూపు చూసిన పాస్టరుగారి కళ్ళు తెరుచుకున్నాయి.

ఆయన గౌరవంగా చేతులు జోడించి, “పవిత్ర మూర్తులారా! మీరు వెంటనే వెనక్కి పోండి. మీ పాత ప్రార్థనను మీరు నిశ్చింతగా కొనసాగించుకోండి. దాన్ని అస్సలు మార్చనక్కర్లేదు. దేవుడికి మీ భావనలు అర్థం అవుతున్నాయి- ఆయనకు మాటలతో అసలు పనే లేదు” అన్నాడు.

భగవంతునికి మన మాటలతో‌ పనిలేదు- అంత:కరణం ఎలా ఉన్నదనేదే ముఖ్యం.

 

పిల్లనగ్రోవి కథ

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రంగాపురం. ఆ ఊరి బయట ఒక అందమైన అడవి ఉండేది. రంగాపురంలో రాజు అనే పిల్లవాడు నివసిస్తూ ఉండేవాడు. రాజు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. రాజు, అతని తల్లిదండ్రులు అందరూ సంగీతం అంటే చెవి కోసుకునేవాళ్ళు. రంగాపురానికి ఎలాంటి సంగీత కళాకారులు వచ్చినా, వాళ్లంతా తప్పనిసరిగా పోయి ఆ సంగీతం వినేవాళ్ళు.

ఒకరోజున రాజు బడినుండి వస్తుంటే రోడ్డుమీద జనాలంతా గుమిగూడి సంతోషంగా అరుస్తుండటం‌ కనబడింది. ‘ఏమిటా’ అని అతను కూడా పోయి చూశాడు. అక్కడ, రాజు అంతే ఉన్న పిల్లవాడొకడు, పిల్లనగ్రోవి ఊదుతూ సంతోషంగా నాట్యం చేస్తున్నాడు. ఊళ్ళో ఉండే కుర్రవాళ్ళు కొందరు వాడితో కలిసి పాడుతూ, గంతులు వేస్తున్నారు. రాజుకు వాడి సంగీతం చాలా నచ్చింది. వాడు అక్కడే నిలబడి ఆ కార్యక్రమం ముగిసేంతవరకూ చూశాడు. కార్యక్రమం అవ్వగానే జనాలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి వెనుతిరిగారు. కొందరు ఆ పిల్లవాడి మీదికి కొన్ని డబ్బులు విసిరారు. అందరూ వెళ్ళిపోయాక, ఆ పిల్లవాడు వంగి, నేల మీది డబ్బులు ఏరుకోసాగాడు.

అప్పుడు గానీ రాజుకు సమయం గుర్తుకు రాలేదు. ఆ సరికే చీకటి పడవస్తున్నది. రాజు గబుక్కున ఇంటికి పరుగు తీశాడు. ఇంట్లో హోంవర్కు చేస్తున్నాడు గానీ, వాడి మనస్సులో పిల్లన గ్రోవి మ్రోగుతూనే ఉన్నది. ఆరోజు తాను ఎంత గొప్ప సంగీతం విన్నాడో వాడు వాళ్ళ అమ్మా-నాన్నలకు చెప్పి, మురిసిపోయాడు.

మరునాడు ఆదివారం. రాజు వాళ్ళ అమ్మ వాడిని అడవికి పోయి కట్టెపుల్లలు ఏరుకు రమ్మన్నది. రాజుకు అడవి అంటే చాలా ఇష్టం. అడవిలో‌ఒక మూలన అందమైన వాగు ఒకటి ఉన్నది. వాడు కట్టెలు ఏరేందుకు వెళ్ళినప్పుడల్లా ఆ వంకలోకి దిగి, ఈతకొట్టనిదే వెనక్కి రాడు. ఆ రోజున వాడు అడవిలోకి వెళ్ళగానే వంక దగ్గరినుండి చక్కని పిల్లనగ్రోవి పాట వినబడ్డది. రాజు సంతోషంగా ఆ వైపుకు పరుగు తీశాడు.

పిల్లనగ్రోవి పాట బరువుగా ఉన్నది. ఆ దు:ఖపు పాటను వాయిస్తున్నది, రాజు అంతకు ముందు చూసిన పిల్లవాడే. రాజు వాడి దగ్గరికి వెళ్ళి పాటను సాంతం విన్నాక, ఆ పిల్లవాడిని మెచ్చుకొని, వాడి పేరు అడిగాడు. వాడు తన దగ్గరున్న తెల్లకాగితంపైన ‘గోవిందు’ అని రాసి చూపాడు. రాజు ఏ ప్రశ్నలు వేసినా వాడు జవాబుల్ని రాసి చూపించాడు- గోవిందు మూగవాడు, మరి!

గోవిందుకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరనీ, చక్కగా చదువుకునేవాడనీ, అయినా ఆరవ తరగతి మధ్యలో చదువు ఆపేయవలసి వచ్చిందనీ, బంధువులు పట్టించుకోలేదనీ, బ్రతుకు తెరువుకోసం ఇలా పిల్లన గ్రోవిని ఊదుకుంటూ కాలం గడుపుతున్నాడనీ తెలుసుకున్నాడు రాజు.

కొంచెం సేపు ఆలోచించి, రాజు వాడిని వెంటబెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. రాజు తల్లిదండ్రులు గోవిందు పిల్లనగ్రోవి పాటను విని పరవశించి పోయారు. వాడి కష్టాన్ని చూసి చలించిపోయారు. “రాజుతో బాటు గోవిందునీ పెంచుకుందాం. ఏమున్నది?” అనిపించింది వాళ్ళకు.

అదే సంగతిని వాళ్ళు రాజుతోటీ, గోవిందుతోటీ అంటే, గోవిందు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆనాటినుండి గోవిందు రాజుతోబాటు బడికి వెళ్ళటం మొదలు పెట్టాడు. రాజు గోవిందు దగ్గర పిల్లనగ్రోవి ఊదటం నేర్చుకున్నాడు. ఇద్దరూ చక్కగా చదివి, డాక్టర్లయ్యారు. తమను కలిపిన పిల్లనగ్రోవిని వాళ్ళిద్దరూ ప్రతిరోజూ సాధన చేస్తూనే ఉన్నారు, ఇంకా!

 
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com