పాప్ గాయని విట్నీరాలిపోయింది
సంగీతాకాశంలో మరో అపురూప తార రాలిపోయింది. ప్రేమే నా ప్రాణమని, ప్రేమే నా లోకమని మనసును తాకేలా ఆలపించి, కోట్లాది మంది హృదయాల్లో వలపుపాటల గూళ్లు కట్టిన సుస్వరాల గొంతుక మూగబోయింది. ప్రేమగీతమే శ్వాసగా బతికిన ప్రఖ్యాత అమెరికా పాప్ గాయని, విలక్షణ నటి విట్నీ హూస్టన్ ఇకలేరు. 1980, 1990 దశకాల్లో తన పాటలతో ఎనలేని కీర్తిసంపదలతో పాటు, వ్యథాభరిత ‘మత్తు’ జీవితాన్నీ రుచిచూసిన ‘గోల్డెన్ గర్ల్ ఆఫ్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ’ ఈ లోకంపై ప్రేమ పాటను తన చిరునామాగా అచ్చొత్తి సెలవు తీసుకున్నారు.
యాభై ఏళ్లు నిండకుండానే నిండు జీవితాన్ని మధ్యలోనే ముగించి ‘ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ..’ అంటూ ఎవరినో ప్రేమించడానికి వెళ్లిపోయారు. 48 ఏళ్ల హూస్టన్ శనివారం లాస్ ఏంజెలిస్‌లోని బెవర్లీ హిల్టన్ హోటల్ నాలుగో అంతస్తులో తను బస చేసిన గదిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతదేహం బాత్‌టబ్‌లో కనిపించింది. మత్తుపదార్థాల వాడకం మితిమీరడంతో ఆమె చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమెను హత్య చేశారని చెప్పే ఆధారాలేవీ దొరకలేదని పోలీసులు చెప్పారు. మరణానికి కారణమేమిటో తెలియడం లేదని ఆమె ప్రతినిధి క్రిస్టెన్ ఫాస్టర్ చెప్పారు.
హూస్టన్ శనివారం గ్రామీ అవార్డుల సందర్భంగా ఓ డిన్నర్‌లో పాటలు పాడాల్సి ఉంది. హూస్టన్ గురువారం జరిగిన ఓ పార్టీలో మితిమించి మద్యం పుచ్చుకున్నారు. ఆ మత్తులో, అలసటతో ఉన్నట్లు కనిపించారు. పార్టీలో ఆమె తన అంగరక్షకులతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆమెకు బాబీ క్రిస్టినా అనే 18 ఏళ్ల కూతురుంది. పాప్ సంగీత ధ్రువతారలు మైకేల్ జాక్సన్, అమీ వైన్‌హౌస్‌ల మృతిలో ఇప్పటికే విషాదంలో మునిగిపోయిన సంగీతప్రియులకు హూస్టన్ మృతి మరో దెబ్బ.
Tags: పాప్ గాయని


Comments