Sunday, May 20, 2012
 

తెలంగాణా తీసుకురావటం టి.ఆర్.ఎస్. కు చేతకాదు.

బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  తెలంగాణా రాష్ట సమితిని ఇరుకున పెట్టారు. “తెలంగాణా కోసమే టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఇక పోటీ నుంచి తప్పుకోవాలి …. ఎందుకంటే తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం తీసుకురావటం టి.ఆర్.ఎస్. కు చేతకాదు. ప్రత్యేకరాష్ట్రం తేవాలంటే కేంద్రస్థాయి నుంచి కింది దాకా ఉండే ఒక్క బిజెపికే సాధ్యం. అందుకని తెలంగాణా కోసం మా వెనుకే ఉంటే చాలు అని పెర్కున్నారు.

ఒకవేళ కేసిఆర్ తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం జీవితలక్ష్యమైతే అది తీసుకురావటానికి అని అర్హతలు వున్న  బిజెపి  కి సహకరించాలి లేదా టి.ఆర్.ఎస్. కార్ ని షెడ్డులో పడేయాలి అని ఎధేవ చేసారు .

 

 

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ బాలినేని ఓడిపొనున్నర ?

ఒంగోలు శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, . వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ బాలినేని ని మానసికం గా  దేభ తీయనున్నారు . ఓటర్లజాబితా సవరణకు ఉన్న గడువును సక్రమంగా ఉపయోగించుకుని బాలినేని శ్రీనివాస్ కి గుణ పాఠం చెప్పానున్నారు .  దీనిలో భాగంగానే దొంగ ఓట్లు ఉన్నాయని ఓటింగ్ లో ఎక్కువగా పాల్గొనే బలహీనవర్గాల, దళితు వర్గాల ఓట్లు 4800 చెల్లవని అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని రద్దు చేయించింది. దీంతో షాక్ కు గురైన బాలినేనికి మరోషాక్ కు కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా ఇచ్చాయి. అదే ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని ఎనిమిదివేల ఇళ్ళపట్టాలు మంజూరు చేస్తే వాటిలో ఐదువేలు అనర్హులకి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ వాటిని క్యాన్సిల్ చేయించింది. దీని తరువాత కాంగ్రెస్ కూడా మిగిలిన మూడువేల ఇళ్ళపట్టాలలో మరో రెండు వేల పట్టాలు సరైనవి కాదని కొట్టించేసింది. ఈ రెండు షాకులకు బాలినేని తీవ్రంగా స్పందించారు. తనతో న్యాయంగా పోటీ చేయటానికి దమ్ముంటే రాష్ట్రముఖ్యమంత్రే రావాలని సవాల్ చేశారు.

 

ఉపఎన్నికల సత్తా – నువ్వా – నేనా ?

ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని రాజకీయ పార్టీలన్నీ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. మండు టెండలను లెక్క చేయకుండా పార్టీల అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. సమరానికి సిద్ధమని వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. మరీ ఇప్పుడు ఏ పార్టీకి ఓటరు ఓకే అంటాడు.? ఏ పార్టీకి వైపు మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.? ప్రజల నాడిని పసిగట్టడంలో ముందుండే ఐ డ్యాప్ తో కలిసి నిర్వహించిన ఓపినియన్ పోల్ ఏం చెబుతోంది.? ఆ డిటైల్స్ సవివరంగా మీ కోసం

శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట.. ఇక్కడ మంత్రి ధర్మాన సోదరుల మధ్యే కురుక్షేత్రం జరుగుతోంది.ఇక్కడ కాంగ్రెస్ వైపు 26.7 శాతం మంది ఓటర్లు
ఉన్నారు. అదే తెలుగుదేశానికి 28.2 శాతం ఓటర్లు మద్దతు పలికారు. ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35.2 శాతం ఓటర్లు జై కొట్టారు. ఇక ఏ అభిప్రాయం చెప్పని వారు 9.9శాతం మంది ఉన్నారు.. ఇక్కడ పరిస్థితులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి.

విశాఖ జిల్లా పాయకరావుపేట.. ఇక్కడ కాంగ్రెస్ కు 23.1 శాతం ఓటర్లు ఉన్నారు. తెలుగుదేశంపార్టీకి 36.1 శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు.
ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 35. 4 శాతం మంది ఓటర్లు ఉన్నారు. 5.4 శాతం మంది ఏ పార్టీ అనేది చెప్పలేక పోయారు. ఇక్కడ ఫలితం కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం.. ఇక్కడ కాంగ్రెస్ 35.5 శాతం మంది ఓటర్లు మద్దతు పొందగలుగుతుంటే, తెలుగుదేశం 20.4 శాతం మంది
ఓటర్లను మాత్రమే తమ వైపుకు తిప్పుకోగలుగుతోంది.. ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 39.3 శాతం ఓటర్లు జై కొడుతున్నారు.. ఇక ఎటు వైపు అనేది
4.8 శాతం మంది చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఫలితం వైఎస్ ఆర్ సీపీ కి అనుకూలం.పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఇక్కడ కాంగ్రెస్ కు 38.8 శాతం.. టీడీపీ కి 22.4 శాతం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 37 శాతం ఎటు చెప్పలేని వారు1.8 శాతం ఓటర్లు ఉన్నారు.. ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అదే జిల్లాలోని పోలవరం లో కాంగ్రెస్ కు 22.8 శాతం ఓటర్లు సపోర్ట్ గా ఉంటే,33.3 శాతం ఓటర్లు టీడీపీకి మద్దతు పలుకుతున్నారు.,39.4 శాతం మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కే మా ఓటు అంటున్నారు. ఇక 4.5 శాతం ఎవరికి ఓటేస్తారో చెప్పలేమన్నారు. పోలవరంలో జగన్ పార్టీ జయకేతనం ఎగురవేసే అవకాశముంది.గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కాంగ్రెస్ కు 21.8 శాతం మంది ఓటర్లు మద్దతు లభిస్తోంది.ఇక తెలుగుదేశానికి 37.8శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 35.6 మంది ఓటర్లు అండగా నిలుస్తున్నారు. ఇక ఏ పార్టీ వైపు అనేది చెప్పలేని వారు 4.8 శాతం మంది ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం విజయానికి చేరువకావచ్చు.

ఇక ఇదే జిల్లాలోని మాచరల్లో కాంగ్రెస్ కు 20.6 శాతం మంది ఓటర్లు అండగా ఉన్నారు. ఇక తెలుగుదేశంపార్టీకి 31.7 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. వైఎస్ ఆర్ సీపీ 38.9 శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు. ఇక ఎవరికి ఓటు వేయలేమంటున్న వారి శాతం 8.8 శాతం ఉంది.. ఇక్కడ ఫలితం జగన్ పార్టీకి అనుకూలంగా ఉండవచ్చు.ప్రకాశం జిల్లా ఒంగోలులో కాంగ్రెస్ కు 29.5 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీకి 26. 3 శాతం మంది ఓటర్లు అండగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 37 శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు. ఓటు ఎటు అనేది తేల్చుకోలేకపోతున్నవారు 7.2 శాతం మంది ఉన్నారు. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుపు బాటలో ఉండే ఛాన్స్ ఉంది.

ఇక నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ 25.9 శాతం మంది ఓటర్ల మద్దతు సాధిస్తోంది. ఇక తెలుగుదేశం 29.7 శాతం ఓటర్ల మద్దతు లభిస్తోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్కు 38.2 శాతం మంది ఓటర్లు అండగా నిలుస్తున్నారు. ఇక్కడ 6.2 శాతం మంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఇక్కడ జగన్ పార్టీ జెండా ఎగురవేయవచ్చు.కడప జిల్లా రాజంపేటలో కాంగ్రెస్ 19.5 శాతం ఓట్లు కాంగ్రెస్ సాధించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 29.7 శాతం ఓట్లు పొందవచ్చు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42.1 శాతం ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఇక్కడ 8.7 శాతం మంది తాము ఎటు వైపు అనేది చెప్పలేకపోయారు.. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..

కడప జిల్లా రైల్వే కోడూరులో కాంగ్రెస్ 24.7 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంది. తెలుగుదేశం 29.6 శాతం, వైఎస్ఆర్ కాంగ్రెస్ 41 శాతం ఓట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడ 4.7 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కే ఛాన్స్ ఉంది.కడప జిల్లా రాయచోటి కాంగ్రెస్ కు 22.1 , టీడీపీకి 26.4, వైఎస్ ఆర్ సీపీకి 42.6 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. తాము ఎటు అనేది చెప్పలేని వారు 8.9 శాతం మంది ఉన్నారు. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుపుకు ఢోకా ఉండకపోవచ్చు..

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో కాంగ్రెస్ 26.8 శాతం ఓటర్లు మద్దతు లభించవచ్చు. తెలుగుదేశానికి 24.9 శాతం ఓట్లు పడే అవకాశముంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 38.6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎటు చెప్పలేమన్నవారు 9.7 శాతం మంది ఉన్నారు. ఇక్కడ జగన్ పార్టీనే జయకేతనం ఎగురవేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కాంగ్రెస్ కు 19.30శాతం, టీడీపీకి 31.8శాతం , వైఎస్ఆర్ సీపీకి 39.2 శాతం ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఏ పార్టీకనేది చెప్పని వారి శాతం 9.3 శాతం మంది ఉన్నారు.. ఇక్కడ వైఎస్ ఆర్ సీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాంగ్రెస్ 21.3 శాతం ఓటర్లు సపోర్ట్ చేస్తుంటే.. తెలుగుదేశానికి 32.3 శాతం ఓటర్లు అండగా ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 38.1 శాతం మంది జై కొడుతున్నారు. ఎటు తేల్చుకోలేకపోతున్నవారు 8.3 శాతం మంది ఉన్నారు. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ కే ఛాన్స్ ఉంది.
అనంతపురం అర్బన్ లో కాంగ్రెస్ 28.6 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశానికి 26.2 శాతం మంది ఓటర్లు సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ ఆర్ సీపీ 38.2 శాతం మంది ఓటర్లు జై కొడుతున్నారు. ఎటు చెప్పలేని వారు 7 శాతం మంది ఉన్నారు. ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గాలి వీయవచ్చు.

తిరుపతిలో కాంగ్రెస్ కు 29.1, తెలుగుదేశానికి 26.7, వైఎస్ ఆర్ సీపీకి 36.2 శాతం మంది మద్దతు పలికే అవకాశం ఉంది. 8 శాతం మంది ఎవరికి ఓటు అనేది చెప్పలేకపోయారు. ఇక్కడ జగన్ పార్టీ హవా కొనసాగవచ్చు.వరంగల్ జిల్లా పరకాల కాంగ్రెస్ కు 14.3 శాతం, తెలుగుదేశం పార్టీకి 9.7శాతం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కి 17.3 శాతం, టీఆర్ ఎస్ కి33.8 శాతం, బీజేపీకి 19.1 శాతం మంది ఓటర్ల మద్దతు ఉంది. 5.8 శాతం మంది ఓటర్లు ఎటు చెప్పలేమన్నారు. ఇక్కడ టీఆర్ ఎస్ కే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

 

నేను వస్తున్నా అంటున్న ఉపఎన్నికలు

* ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ
* ఈనెల 25 వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం
* నామినేషన్ల పరీశీలన 26 న
* 27, 28 రెండురోజుల్లో నామినేషన్ల ఉపసంహరణ
* 28న 3 గంటలకు అభ్యర్దుల తుది జాబితా
* 23 మంది అబ్జర్వర్ల నియామకం
* పెద్దఎత్తున పట్టుపడుతున్న మద్యం,డబ్బు

ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. ఇవాళ్టి నుంచి 25 వరకు వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని ఈసీ సూచించింది. నోటిఫికేషన్ కు ముందే పదిహేను కోట్ల నగదు.. లక్ష లీటర్లపైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఈసీ .. కొత్తగా నమోదైన ఓటర్ల పరీశీలన బాద్యత రాజకీయ పార్టీలదేనని తేల్చి చెప్పింది. 25న ఓటర్ల లిస్ట్ ప్రకటిస్తామని.. ఆలోగా అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది..

ఉపఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల కానుండడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశముంది. 26 న నామినేషన్ల పరీశీలన.. 27, 28 రెండురోజులు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 28న 3 గంటలకు పోటి చేసే అభ్యర్దుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా 23 మంది అబ్జర్వర్లను నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు. వీరు మే 25 నుంచి జూన్‌ 14 వరకు ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే ఉంటారని ఆయన తెలిపారు. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఐటీ అధికారుల నిఘా ఉంటుందన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలను మూసివేయిస్తామని ఆయన తెలిపారు.

ఈ నెల15తో కొత్త ఓటర్ల నమోదుకు గడువు ముగిసిందని… వేలసంఖ్యలో ఓటర్లు పేర్లు నమోదు చేయించుకున్నారని భన్వర్ లాల్ తెలిపారు. అన్ని పొలిటికల్‌ పార్టీలతో సమావేశమైన ఈసీ… ఈనెల 25 న ఓటర్ లిస్టు ప్రకటిస్తామని… ఆలోగా అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. మరోవైపు.. ఎన్నికల అక్రమాలపై ఈసీ డేగకన్ను వేసింది. ఇప్పటికే మద్యం, డబ్బు అరికట్టడానికి చెక్ పోస్టుల వద్ద నిఘాను పెంచింది. దీంతో నోటిఫికేషన్‌కు ముందే 15 కోట్ల నగదు.. లక్ష రూపాయల మద్యం పట్టుబడడం ఎన్నికల అధికారులను విస్మయానికి గురి చేసింది.

 

ఆనాడు వైయెస్ అన్నారిలా…! అధ్యక్షా…!

 

ఏ పూలు తేవాలి నీ పూజకు?

వోటర్లకు చేతులు కాలాయి. ఏం పట్టుకోవాలి? తమిళ వోటర్లయితే ‘ఆకులు’ పట్టుకున్నారు.( జయలలిత పార్టీ అన్నా డిఎంకె గుర్తు రెండు ‘విడాకులు’ లెండి.) తెలుగు వోటర్లయితే .. అందునా తెలంగాణ వోటర్లయితే ‘పూలు’ పట్టుకోవచ్చు. అయితే ఏ పూలు పట్టుకోవాలన్నది సమస్య. మొన్నటి దాకా తెలంగాణ మొత్తానికి ఒకే ఒక పువ్వు వుండేది. అదే (టీఆర్‌ఎస్‌) ‘గులాబీ’ ఇప్పుడు ఇంకొక పువ్వొచ్చి పడింది. అదే (బీజేపీ) ‘కమలం’. అయితే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన ‘జేయేసీ’ కోదండ రామునికి కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ తల్లి దగ్గర నిలబడి దగ్గర వారం రోజులుగా ఒకే కీర్తన ఆలపిస్తున్నారు. ‘ ఏ పూలు తేవాలి నీ పూజకు?’ అని. అప్పుడెప్పుడో తెలంగాణ హిందూత్వ తటాకాల్లో ‘కమలాలు’ వున్నమాట నిజమే. కానీ, కుల,మతాలకు అతీతంగా పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమ ఉధ్ధృతికి అవి ఎండిపోయాయి. కానీ, గత ఉప ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌లో కాంగ్రెస్‌ ‘చేయి’జారి చెంబుడు నీళ్ళు కింద పడటం వల్ల, అందులోంచి ‘కమలం’ వికసించింది. సరిగ్గా అంతకు ముందే బీజేపీ రాష్ట్ర నేత కిషన్‌ రెడ్డి తెలంగాణ అక్కడక్కడా ‘హిందూత్వ’ జలాలను చిమ్ముకుంటూ తిరిగారు. దీంతో ‘మతకొలను’లన్నీ మునకలేసాయని ఆయన నమ్మకం. ఇప్పటి ‘పరకాల’ ఉప ఎన్నికలో, ఇంకొక ‘కమలాన్ని’ పూయించవచ్చునన్నది ఆయన గట్టి ఊహ. పాపం. వరసగా గత రెండు అసెంబ్లీలలోనూ ‘జంట కమలాలే’ ప్రాతినిథ్యం వహించేవి. ‘మూడోది’ గెలిచేసరికి రాష్ట్రం మూడే మారిపోయిందని ‘కమలనాధులు’ జాతీయ స్థాయిలో ఉత్సాహం గావున్నారు.

నిజంగానే ‘పరకాల’లో వోటర్లకు ‘చేతులు’ కాలాయి. ‘చేతి’ గుర్తు మీద గెలిచిన కొండా సురేఖ వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయి, ఉప ఎన్నిక తెచ్చిపెట్టారు. ఆమెకూడా తెలంగాణ కోసమే అంకితమయ్యానంటున్నారు. కానీ, తెలంగాణ కు ‘పేటెంటు హక్కు’న్నట్టు భావించే ‘గులాబీ’ ‘తెలంగాణ నినాదం’ పుట్టకుమందే తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించామన్న ‘కమలమూ’ బరిలోకి వచ్చాసాయి. కాలిన ‘చేతులు’ ఏ పువ్వును పట్టుకుంటాయన్న ఉత్కంఠతో దేశమంతా ఎదురు చూస్తుంటే, ఇంతలో మరో ఆశ్యర్యం సంభవించింది.

ఏకంగా ‘సామెత’నే మార్చుకునే పరిణామం ఇది. ‘పువ్వులు కాలాక చేతులు పట్టుకోవాలి’ అన్న సందేశాన్ని ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రం(కర్ణాటక)లో మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప. ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి కావటానికి, ‘కమలాన్ని’(బిజెపిని’ వదిలేసి ‘చేతుల్ని’(కాంగ్రెస్‌) పట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతే కాదు తనకు అనుయాయులుగా వున్న డెభ్భయి మంది శాసన సభ్యుల చేతా ‘చేతులు’ పట్టిస్తున్నారని కూడా వినవస్తోంది. ఇదే జరిగితే, దక్షిణాది రాష్ట్రాల నీళ్ళల్లో ‘కమలం’ వికసించదన్న విశ్వాసం బలపడుతుంది.

రాజకీయాల్లోకి వచ్చాయి అన్నీ కాలతాయి.. కడకు పువ్వులు కూడా.

న్యూస్‌ బ్రేకులు:
‘సీమాంధ్ర’ బాబు!

తెలుగుదేశం పార్టీ 2014 లో అధికారంలోకి వస్తే తొలి తీర్మానం తెలంగాణ పైనే!

-ఎర్రబెల్లి దయాకర రావు, కన్వీనర్‌, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం.

ఓహో! అప్పుడు చంద్రబాబు తన పేరును ‘సీమాంధ్ర’ బాబుగా పేరు మార్చుకుంటారా? ఆయన మిగిలిన భాగానే ముఖ్యమంత్రి కాగలరు కదా!

వైయస్‌ 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. నా తండ్రి 1962 నుంచి రాజకీయాల్లో వున్నారు. వైయస్‌ నాయకత్వంలో కలిసి పనిచేశాను అంతే. ఆయన నాకు రాజకీయ జీవితం ఇచ్చారంటే నవ్వుతారు. గతం తెలుసుకుని మాట్లాడండి.

-కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

బాగా గుర్తుతెచ్చుకోండి. మీరు వైయస్‌తో కలిసి పనిచేశారా? లేక ఆయన తండ్రి రాజిరెడ్డి తో కలిసి పని చేశారు. చూడబోతే, తమరు భూమికి ముందు పుట్టినట్టున్నారు!!

ట్విట్టోరియల్‌

మూడు ముక్కలాట

కులం! మతం! ప్రాంతం! ఈ మూడు మాటలూ నచ్చితే ఒట్లు.( వోట్లు కూడా) నచ్చక పోతే తిట్లు. అధికారాన్ని సుష్టుగా భోంచేసే ఏ రెండు మూడు కులాలకో ఈ మాటలు తిట్లలాగే అని పిస్తాయి. కానీ, ‘పవరే’ ఎరుగుని బడుగులకూ, మైనారిటీలకూ, వెనుకబడిన ప్రాంతీయులకూ ఇవి వొట్లు. ఈ వొట్లే చైతన్యం వల్ల దేశ వ్యాపితంగా వోట్లుగా మారాయి. దాంతో ‘దేశాధినేత’(రాష్ట్రపతి) ఎన్నిక కు ఈ మూడు మాటలూ అవసరమయ్యాయి. (మైనారిటీ) మతమయితే అన్సారీ, (అణగారిన) కులమయితే మీరా కుమారి, ప్రాంతమయితే ప్రణబ్‌ ముఖర్జీల పేర్లను కాంగ్రెస్‌ ముందు పెట్టుకు తిరుగుతోంది. ఎందుకంటే ఎస్సీ,బీసీ, మైనారిటీల ఆలంబన గావున్న పార్టీల, ప్రాంతీయ పార్టీల మద్దతు కావాలంటే ఈ మూడు ముక్కల్నీ ఉఛ్చరించక తప్పదు. ఇష్టంలేని మంత్రోఛ్ఛారణ చెయ్యటం పైనున్న వారికి కష్టంగానే వుంటుంది. కానీ తప్పదు మరి!

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

పెద్ద బాల ‘శిక్ష’!

సుబ్రహ్మణ్యస్వామి(జాతీయాధ్యక్షుడు, జనతా పార్టీ) : అంబేద్కర్‌కు వ్యతిరేకంగా వేసినట్టుగా ఆరోపించబడుత్ను కార్టూన్‌లో, నెహ్రూ కొరడాతో కొడుతున్నది నత్తనే కానీ (దాని మీద కూర్చున్న) బాబాసాహేబ్‌ను కాదని అనుకుంటున్నాను. కార్టూనిస్టు శంకర్‌ దళిత వ్యతిరేకా? అసంభవం.

కౌంటర్‌ ట్వీట్‌: కానీ ఆ కార్టూన్‌ని పాఠ్యపుస్తకంలో పెట్టిన వాళ్ళు కేవలం దళిత వ్యతిరేకులు మాత్రమే కాదు, రాజ్యాంగ వ్యతిరేకులు కూడా. శిక్ష ఏమిటో సెలవిస్తారా?


ఈ- తవిక

ద్విపాత్రాభినయం

హిట్టయితే ‘మెగా’

ఫ్లాపయితే ‘చిరు’

ఇది సినిమా.

గెలిస్తే ‘నాజీ’

ఓడితే ‘మాజీ’

ఇది రాజకీయం

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

మనీ-మీడియా-మాఫియా, ఈ మూడూ రాజకీయానికి మూడు ముఖాలు. కానీ, ఈ మూడింటిని కలిపేశాడు ఒకాయన. ఏమయ్యింది? ముఖం ‘మాడియా’ అయ్యింది.

కొట్టేశాన్‌( కొటేషన్‌):

పదండి ‘మందు’కు, పదండి ‘డోసు’కు పోదాం పోదాం (పోలింగ్‌) క్యూలోకి!
-సతీష్ చందర్

 

- Satish Chandar, Journalist. Poet. Writer.

 

మీకు నచ్చింది పొందలేరు. ఇచ్చింది తీసుకోవాలి.

ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షర ఫ్యాక్షనిజం!

చదవం. చదవబడతాం.

వినం. వినబడతాం.

చూడం. చూడబడతాం.

కారణం? మీడియా.

మీకు నచ్చింది పొందలేరు. ఇచ్చింది తీసుకోవాలి.

అది వార్త కావచ్చు. వ్యాఖ్య కావచ్చు.

అందుకే పత్రిక చదివాక, మనకొచ్చే అభిప్రాయాలు మనవి కావు. రెడీమేడ్‌ వస్త్రాలు తయారు చేసినట్టు ముందుగానే అవి తయారు చేయబడతాయి.

పార్టీకో మీడియా సంస్థ. లేదా మీడియా సంస్థకో పార్టీ. ఇంకాస్త లోతుకు వెళ్ళితే- సామాజిక వర్గానికో పార్టీ, పార్టీకో సామాజిక వర్గం.(కులం అని నేరుగా అనవచ్చు. కానీ సభ్యత పేరుమీద ముసుగులో గుద్దులాట) అందుకనే ‘వర్ణం’అంటని మీడియా వుండదు.

నిజం – అన్నది ఒక పత్రికలో కాకుండా, రెండు పత్రికల మధ్య ఇరుక్కుంటోంది. రెండు చానెళ్ళ మధ్య నలిగిపోతోంది.

తెలుగునాట, మీడియా అంతా ఒకలాగా లేదు. ఒక పత్రిక పీక నొక్కితే, అన్ని పత్రికలకూ నొప్పిగాలేదు. ఆ ఒక్క పత్రిక మాత్రమే గిలగిల లాడుతోంది. ఆ పత్రిక మాత్రమే ‘బ్లాక్‌డే’ అని పెద్ద అక్షరాలతో వేసుకుంటుంది. ‘యమర్జన్సీ’ని తలపిస్తోందని ప్రకటనలు చేస్తుంది. ఈ ఆందోళనను గమనించినప్పుడు- పత్రికా స్వేఛ్చ- అంటే పలు పత్రికల స్వేఛ్చ కాదేమో, ఆ ‘ఒక్క పత్రిక స్వేఛ్చ’ మాత్రమే నేమో అన్న అనుమానం కూడా వేస్తుంది.

ఇప్పుడు ఈ కష్టంలో వున్నది ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ చానెల్‌. ఆ ప్రసార సాధనాలను నడిపే కంపెనీల ఖాతాలను సిబిఐ స్తంభింప చేసింది. రెండు వేలకు పైగా పాత్రికేయులూ, వేల సంఖ్యలో ఇతర ఉద్యోగులూ, ఏజెంట్లూ ఆధార పడి వున్నారు. కారణాలు ఏమైనా, యాజమాన్యం తో పాటు వీరందిరికీ కష్ట కాలమే. ఈ ప్రసార సాధనాలు పెట్టటానికి వై.యస్‌ జగన్మోహన రెడ్డికి- అంత డబ్బెక్కడిదీ – అన్న ఆరాలు తీసి, తీసి, కేసును సిబిఐ ఇక్కడ వరకూ తెచ్చింది. పొందిన లబ్ధికీ- పెట్టిన పెట్టుబడికీ ‘అక్రమ సంబంధం’ (క్విడ్‌-ప్రో-కో) వుందనే నిర్ధారణకు వచ్చి, ఈ చర్యకు పాల్పడింది. అంటే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వై.యస్‌ వివిధ వాణిజ్య సంస్థలు చేసిన సేవలకు, ప్రతిగా(సిబిఐ దృష్టిలో లంచంగా) ఈ పెట్టుబడులు పెట్టారన్నది ఆరోపణ.

సరే, ఈ పెట్టుబడుల వల్ల ‘సాక్షి ‘లబ్ధి పొందింది. మరి ‘సాక్షి’ వల్ల ఎవరు ‘లబ్ధి’ పొందారు. కేవలం వై.యస్‌ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడూ నా..!? కాదు. రాష్ట్రంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ. ఈ పత్రిక స్థాపించక ముందు కాస్త పెద్ద గొంతు వున్న పత్రికలు దాదాపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే వున్నాయి. అందుకనే కదా- మొదటి సారిగా వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ‘ఆ రెండు పత్రిలూ’ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాస్తున్నాయని, అంటూనే వుండేవారు ( అవే ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’.). ఈ రెండు పత్రికలూ ఒకే సామాజిక వర్గం (కమ్మ ) అండతో ఒకే పార్టీని(తెలుగుదేశం) పార్టీ స్వరాన్ని వినిపించేవి. అంటే కాంగ్రెస్‌ కంటూ ఒక పత్రికలేదన్నది వైయస్‌ చెప్పకనే చెబుతుండేవారు. ఫలితంగానే ‘సాక్షి’ పుట్టిందని వేరే చెప్పనవసరం లేదు.

ఆయన అకాల మృతి తర్వాత, వై.యస్‌.జగన్‌ కాంగ్రెస్‌లో కొనసాగకుండా, (పోనీ, కొనసాగ లేక) వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టారు. అప్పుడు అనివార్యంగా ‘సాక్షి’ తెలుగుదేశం పార్టీకే కాకుండా, కాంగ్రెస్‌ కు కూడా వ్యతిరేకమయ్యింది. అంతే కాదు. అంతవరకూ కాంగ్రెస్‌ తో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ( ఎస్సీలతో పాటు రెడ్లు) కాంగ్రెస్‌ను ఖాళీ చేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొచ్చారు. అంటే ‘కమ్మ’ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రత్యర్థి వర్గమైన రెడ్లు ఇప్పుడు జగన్‌తో వున్నారు.

ఇప్పుడు ఏ వర్గం మీడియా వారికి వుంది.

దాంతో ఎవరి నొప్పి వారే భరించాల్సిన స్థితి కూడా ఏర్పడింది.

వైయస్‌ వెటకారమాడే ‘ ఆ రెండు పత్రికలకు’ కూడా కష్ట కాలం వచ్చింది.

‘ఈనాడు’ వారి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ నిర్మాణానికి ‘మర్గదర్శి’ పొదుపు నిల్వలను నిబంధనలకు విరుధ్దంగా మళ్ళించారంటూ, విచారణ మొదలు పెట్టినప్పుడు, ఆ నొప్పి, ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’లకే అర్థమయింది.

అలాగే ‘బడుగు నేతలా? బాడుగ నేతలా’ అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి రాశాక, బడుగువర్గాల కు చెందిన నేతలకీ, ఆ సంస్థకీ మధ్య స్పర్థ ఏర్పడి, ఆ పత్రికకు చెందిన వారిని కొందరిని అరెస్టు చేసినప్పుడు కూడా, ఆ బాధ ‘ఆంధ్రజ్యోతి’, ‘ఈనాడు’ లకే అర్థమయింది.

అప్పుడూ వారూ ‘బ్లాక్‌ డే’లు పాటించారు. ‘యమర్జన్సీ రోజుల్ని’ తలపోసుకున్నారు. ‘పత్రికా స్వేఛ్చ’ను దెబ్బతీస్తున్నారన్నారు.

ఒకప్పుడు ఒక పత్రిక మీద దాడి జరిగితే, అన్ని పత్రికలూ (యాజమాన్యాలు) ఒక్కుమ్మడిగా అరిచేవి. కానీ, ఇప్పుడు అలాలేవు. కొద్దో, గొప్పో పాత్రికేయులే తమ తమ యాజమాన్యాలు గీసిన ‘లక్ష్మణ రేఖల్ని’ సైతం దాటి, ఈ దాడులన్నిటికీ స్పందించారు. స్పందిస్తున్నారు కూడా. నిజానికి పత్రికా స్వేఛ్చ అన్నది- పత్రికా రచయితలదే కానీ, యజమానులది కాదు. తెలుగు నాట డెభ్భయ్వవ దశకం నుంచే, ఈ స్వేఛ్చ యజమానులకు వెళ్ళిపోయింది. వారు తమ తమ స్వతంత్ర అభిప్రాయాలతో రచనలు చేసే అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. అయినప్పటికి తమది కాని, తమ దగ్గర లేని ‘పత్రికా స్వేఛ్చ’ పోయినప్పుడెల్లా ఈ పాత్రికేయులే పోరాడుతున్నారు.

మీడియాలో ఈ రెండు శిబిరాలూ, రెండు ఫ్యాక్షనిస్టు శిబిరాలుగా మారిపోవటం- ఎవరికయినా బాధగానే వుంటుంది. అయితే ఈ శత్రుత్వం ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా సాగుతూనే వుంది.

తొంభయ్యవ దశకం తొలి పాదంలో కాంగ్రెస్‌ నేత మాగుంట సుబ్బ రామి రెడ్డి నేతృత్వంలో ‘ ఉదయం’ దినపత్రిక నడుస్తోంది. అప్పుడు (1989-94) కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంది. రాష్ట్రంలో పేద వర్గాల మహిళలు ‘సారా వ్యతిరేక పోరాటం’ చేస్తున్నారు. ఈ పోరాటం పుట్టింది ప్రధానంగా ఆరోగ్య కారణాల వల్ల కాదు- ఆర్థిక కారణాల వల్ల. దీనికి కూడా నేపథ్యం లేక పోలేదు. ఈ ‘సారా వ్యతిరేక ఉద్యమా’నికి ముందు, అక్షరాస్యతా ఉద్యమం నడిచింది. కూలి మహిళలు చదువు నేర్చుకున్నారు. దాంతో తమ కొచ్చే ఆదాయ, వ్యయాల్ని లెక్క చూసుకున్నారు. భర్తలు తాము సంపాదించిందంతా తాగుడికే తగలేస్తుంటే, బిడ్డల కడుపుల్లో గంజి పోయటమే కష్టమవుతుందన్న స్పృహ వచ్చింది. వారు ప్రభుత్వ సారాయి దుకాణాల మీద దాడులు చేశారు. ‘నాటు సారా’ను బంద్‌ చేయమన్నారు. అయితే ‘ఈనాడు’ ఈ ఉద్యమానికి మద్దతునిస్తూనే, ఈ ఉద్యమ విస్తృతిని పెంచింది. దీని ఐఎంఎప్‌ఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌) కు కూడా వర్తింప చేసింది. అంటే ‘నాటు సారా’ యే కాదు, ‘బ్రాందీ, విస్కీ’లను కూడా బంద్‌ చేయించటానికి మధ్యతరగతి మహిళల్ని పురికొల్పింది. అందుకు ‘ఆరోగ్య’ కారణాలను ప్రధానంగా ఎత్తి చూపించింది. అందుకోసం ఆ పత్రిక కంకణం కట్టేసుకుంది. ఇటు సారా, అటు మద్యం – వెరసి ‘సంపూర్ణ మద్య పాన నిషేధం’ అమలు లోకి తెచ్చే వరకూ ఆ ప్రతిక నిద్రపోలేదు, ఆ పత్రిక కోరినట్లుగానే , ‘తెలుగుదేశం’ తిరిగి అధికారంలోకి వచ్చాక ‘సంపూర్ణ మద్య పాన నిషేధం’ మీద ముఖ్యమంత్రి గా ఎన్టీరామారావు తొలి సంతకం చేశారు.

సీన్‌ కట్‌ చేస్తే,

కాంగ్రెస్‌కు వత్తాసు పలికే ‘ఉదయం’ దినపత్రిక కష్టకాలంలో పడింది. కారణం? దాని ఆర్థిక మూలాల మీద వేటు పడింది. మాగుంట సుబ్బి రామి రెడ్డి ఒక ప్రముఖ లిక్కర్‌ కంపెనీకి దక్షిణ బారత దేశానికి డీలర్‌ గా వున్నాడు. దాంతో ఆయన వ్యాపారం కుంటుపడింది. ఆ తర్వాత అనుకోకుండా, ఆయన నక్సలైట్ల చేతుల్లో మృత చెందటం, వ్యాపార నష్టాల వలన ఆ పత్రికను కొనసాగించలేకపోవటమూ, ఆ పత్రిక శాశ్వతంగా మూతపడటమూ, ఆ పత్రికలోని సిబ్బంది నిరుద్యోగంలోకి నెట్టబడటమూ తెలిసినవే.

‘సారా వ్యతిరేకోద్యమాన్ని’ , ‘మద్యవ్యతిరేకోద్యమంగా’ మార్చటంలో నాడు ‘ఈనాడు’ చూపిన చొరవ మీద అనేక అనుమానాలు వచ్చాయి. ‘ఈనాడు’ కు పోటీగా నిలిచిన ‘ఉదయం’ దినపత్రికను దెబ్బతీయటానికే ఈ పని చేశారని వారు తమ తమ ప్రయివేటు సంభాషణల్లో చర్చించుకునే వారు.

నాడు ‘ఉదయం’. నేడు ‘సాక్షి’.

కారణాలు వేరయినా ఫలితం ఒక్కటే. వేటు ఆర్థిక మూలాల మీద పడింది.

రెండు మీడియా శిబిరాలు

రెండు కులాలు

రెండు పార్టీలు.

రెండేసి ప్రచారాలు.

ఒకరి జీవిత చరిత్రను మరొకరి మీడియాలో చదువుకోవచ్చు.

‘డెయిలీ జర్నలిజం’ కాస్తా ‘డెయిరీ’ జర్నలిజంగా మారిపోయింది.

లక్షలమంది పాఠకులు అన్నీ చదువుతున్నారు. ఇష్టపడి చదువుతున్నారో, విధిలేకే చదువుతున్నారో, మరో మార్గాంతరం లేకే చదువుతున్నారో ఎవరికి ఎరుక.

ఈ రెండు శిబిరాల పత్రికల్లో అన్ని హంగులూ, అన్ని రంగులూ వుంటాయి. లేని దెల్లా ఒక్క ‘విశ్వసనీయత’ మాత్రమే.

అందుకనే కొద్దో, గొప్పో చదువుతో పాటు, ఇంటర్నెట్‌ సౌకర్యం వున్నవారు తమ తమ బ్లాగులు తెరచుకుని, తమ తమ అభిప్రాయాలను స్వేఛ్చగా చెప్పుకుంటున్నారు. ఫేస్‌ బుక్‌ , ట్విట్టర్‌ వంటి ‘సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌లలో’ తమకు తెలిసిన వ్యక్తీకరణతో నిజాలను ఆవిష్కరిస్తున్నారు. ఇదే ప్రత్యామ్నాయ పత్రికా రచన. మరో భాషలో చెప్పాలంటే పౌర పత్రికారచన (సిటిజన్‌ జర్నలిజం). ఈ పత్రికా రచనకే గల్ఫ్‌ దేశాల్లో రాజ్యాలకు రాజ్యాలే కుప్ప కూలిపోయాయి.

తెలుగు నాట ఈ రెండు శిబిరాలూ ‘అక్షర ఫ్యాక్షనిజాని’కి స్వస్తి చెప్పాలి.

పత్రికా స్వేఛ్చను ప్రజల హక్కుగా, పాత్రికేయుల స్వేఛ్చగా గుర్తించాలి.

అలా చెయ్యని పక్షంలో – చైతన్యవంతులైన విద్యావంతులు మిన్నకుండరు. ఫలితంగా ఖరీదయిన పాఠాలు నేర్చుకోవాల్సి వుంటుంది.

పేజీలకు రంగులు వేసుకోండి కానీ, అక్షరాలకు ‘వర్ణాల’(కులాలను, పార్టీలనూ) అద్దకండి.

పత్రికా స్వేఛ్చ వర్థిల్లాలి!

-సతీష్‌ చందర్‌,

journalist,poet,writer.

 

 

పాలిటిక్స్‌ ను నేరానికి వాడుకునే పాలి ‘టెక్నిక్‌’

‘డాను’ కిరణ్‌

కేరికేచర్: బలరాం

పేరు :భాను కిరణ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం : ‘డాను’ కిరణ్‌( అవును. డాన్‌ను కావాలనుకున్నాను.)

ముద్దు పేర్లు : ‘గన్ను’ పోటు దారు.(నమ్మిన వ్యక్తిని వెనకనుంచి పొడిచినప్పుడు, రాజకీయాల్లో అయితే వెన్నుపోటు అంటారు.
మా మాఫియా భాషలో ‘గన్ను’ పోటు అంటారు. కానీ రాజకీయంగా ‘మామ’ను పొడిచిన అల్లుళ్ళు కూడా నన్ను ఆడిపోసుకుంటున్నారు.
అదే నాకు బాధగా వుంది.)

విద్యార్హతలు : పాలి ‘టెక్నిక్‌’ ( చదువు తున్నప్పుడు దాని అసలు అర్థం తెలీలేదు. బయిటకొచ్చాక తెలిసింది- పాలిటిక్స్‌ ను నేరానికి
వాడుకునే టెక్నిక్కే, పాలి ‘టెక్నిక్‌’ అని.)

హోదాలు : కేరాఫ్‌ సూరి- ఇంతకు మించి హోదా ఏమిటి?

గుర్తింపు చిహ్నాలు : ఎందుకు చెప్పండి శ్రమ. గుర్తింపు చిహ్నాలు కాదు. నన్ను పట్టుకోవటానికి నా పోలికలతో రకరకాల బొమ్మలు వేయించి
పోలీసులు ప్రకటనలు ఇచ్చారు. ఎవరన్నా గుర్తు పట్టగలిగారా? ఏడాది వరకూ ఎవరూ పోల్చుకోలేదు. ఇంకా ఎందుకు చెప్పండి-
గుర్తింపు చిహ్నాలు?

సిధ్ధాంతం : గన్నును గన్నుతోనే తీయాలి.

వృత్తి : విరాళాలు సేకరించటం. మీరు చేస్తే ‘చందాల’ంటారు. మేము చేస్తే ‘దందాల’ంటారు.

హబీలు :1. కోర్టులు సకాలంలో చేయలేని పనులను చేపట్టడం.( మీ స్థలం ఎవడో కబ్జా చేస్తాడు. అది మీకు కావాలి.
మీరు కోర్టుల చుట్టూ పాతికేళ్ళు తిరగాలి. అందుకు స్థలం విలువలో సగం ఖర్చయిపోతుంది. అదేదో ముందే మాకిచ్చేస్తే, క్షణాల్లో తేల్చేస్తాం.)

2. రకరకాల తుపాకులు సేకరించటం.( తుపాకి వుంటే చాలు. పేల్చటంలో పెద్ద శిక్షణ అవసరంలేదు.
ఎలాగూ మనం కాల్చేది బాగా దగ్గర వాళ్ళను. అది కూడా బాగా దగ్గర నుంచి. అందుకు గురి పెట్టటం, తప్పటం- అంటూ వుండదు.)

అనుభవం : తమంతట తాము దొరికిపోయేవాళ్ళనే, పోలీసులు పట్టుకోగలరు.

మిత్రులు : రాజకీయాల్లో అయితే శాశ్వత మిత్రులూ, శాశ్వత మిత్రులూ వుండరు. కానీ ఫ్యాక్షనిజంలోనూ, మాఫియాలోనూ చిన్న తేడా
వుంది. మిత్రులు కానీ, శత్రువులు కానీ శాశ్వతంగా ప్రాణాలతో వుండరు.

శత్రువులు : ‘నీ కోసం ప్రాణమిస్తాను’ అని నాచుట్టూ తిరిగే వాడే నాకు శత్రువు. ఎందుకంటే అంతిమంగా అతడే నా ప్రాణం తీస్తాడు.
(నేను అదే దారిలో వెళ్ళాను లెండి)

మిత్రశత్రువులు : ఇంకెవరూ..? పోలీసులే.

జీవిత ధ్యేయం : ‘గన్ను పోటు’ ఎలాగూ నేర్చుకున్నాను. ‘వెన్ను పోటు’ కూడా నేర్చుకుని రాజకీయాల్లో డాన్‌ కావాలన్నది
నా కోరిక.
-సతీష్ చందర్

Journalist. Poet. Writer.

 

సాక్షికి ఒక న్యాయం! సూర్యకు ఇంకొక న్యాయమా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, ఛానెల్‌ బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింపజేయగానే కొన్ని జర్న లిస్టు సంఘాలు ఆఘామేఘాలపై రోడ్డేక్కాయి. పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. గతంలో సూర్య దినపత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశరావు అరెస్టు అయిన సమయం లో ఎందుకని ఇవే జర్నలిస్టు సంఘాలు, నేతలు ఇంతే తీవ్రస్థాయిలో స్పందించలేదన్నది సామాన్యుని మదిని తొలుస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు బడుగుల వాణిని బలంగా విని పించిన, రాజ్యాధికార సాధన కోసం తన వంతు పోరాటం చేసిన ‘సూర్య’ దినపత్రిక అధినేత నూకారపు సూర్య ప్రకాశరావును అరె స్టు చేసినప్పుడు జర్నలిస్టు సంఘాల నేతలు వ్యవహరించిన తీరు వారి నైజాన్ని తేటతెల్లం చేస్తుందంటున్నారు. సాక్షి కోసం ఉద్యమించిన వీరే… గతంలో సూర్య విషయంలో ఎందుకు వెనుకంజ వేశార న్నది జగమెరిగిన సత్యమేనంటున్నారు. కొన్ని జర్నలిస్టు సంఘాల నేతల పరస్పర ఈ భిన్న వైఖరే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది.

జర్నలిస్టుల హక్కులే ధ్యేయంగా ఉద్యమించాల్సిన సంఘాలు, నేతలు కేవలం కొంతమందికి కొమ్ము కాస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. నూకారపు అరెస్టుపై స్పందించడాని కి నోరురాని జర్నలిస్టు నేతలు ఇప్పుడు సాక్షి విషయంలో ఎందుకని గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని పలువురు బడుగు నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టు సంఘాల నేతల దృష్టిలో బీసీలకైతే ఒక న్యాయం… అగ్ర వర్ణాలకైతే మరొక న్యాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనతో జర్నలిస్టు సంఘా లకు నేతృత్వం వహిస్తున్న కొంతమంది నేతల అగ్రవర్ణ బు ద్ధి బయట పడిందని మండిపడుతున్నారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు ఇదే అం శంపై స్పందిస్తూ జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణలో భాగంగానే సీబీఐ సాక్షి పత్రిక, ఛానెల్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిందన్నారు. దాన్ని పత్రికాస్వేచ్ఛపై దాడిగా ఎలా పరిగణిస్తారంటూ జర్నలిస్టు నేతలను ప్రశ్నించారు. సూర్య పత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాశరావు అరెస్టును ఎందుకని పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా గుర్తించలేదో చెప్పాలన్నారు. అవినీతిపరుడైన జగన్‌ను వెనుకేసుకొచ్చే ప్రయత్నాన్ని కొంతమంది జర్నలిస్టు మిత్రులు మానుకో వాలని సూచించారు.

టీడీపీ సీనియర్‌నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ అవినీతి సొమ్ముతో ప్రారం భించిన సాక్షి పత్రిక, ఛానెల్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడాన్ని పత్రికా స్చేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించ డం తగదన్నారు. గతంలో సూర్య పత్రిక అధినేత నూకా రపు సూర్యప్రకాశరావు అరెస్టు సమయంలో జర్నలిస్టు మిత్రులు ఇదేరీతిలో స్పందించి ఉంటే బాగుండేదన్నారు. ఒకరి ఒక న్యాయం… మరొకరి ఇంకొక న్యాయమంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చెల్లబోదన్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన కరీంనగర్‌ శాసనసభ్యుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ సాక్షి పత్రికలో లక్ష కోట్ల రూపా యల అవినీతి సొమ్ము పెట్టుబడిగా పెట్టారన్నారు. పెట్టు బడులు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి సాక్షి పత్రిక, ఛానెల్‌ బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింపజేయడాన్ని విజ్ఞులైన జర్నలిస్టులు తప్పుపట్టడం సహేతుకం కాదన్నా రు. గతంలో సూర్య అధినేత నూకారపు అరెస్టు జరిగిన ప్పుడు ఇవే జర్నలిస్టు సంఘాల నేతల ఇదే రీతిలో స్పందిం చి ఉంటే అప్పుడు అంత హర్షించి ఉండేవారన్నారు.

Source: Surya Daily.

 

మొన్న అవినీతి! నిన్న మతం! నేడు నేరం!

‘ఉప’ సమరంలో చంద్ర బాంబులు!

మొన్న అవినీతి!

నిన్న మతం!

నేడు నేరం!

అన్నీ బాంబులే! ‘చంద్ర బాంబులే’! జగన్‌ మీద విసిరిన ‘దీపావళి’ బాంబులే!

ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సుమన్నాయి.

ఇంకేం చేస్తారు?

పాత పాటే. ‘ఆల్‌ ఫ్రీ’! బియ్యం ఉచితం! నిరుద్యోగులకు నెలకు వెయ్యి. ఇలాంటి హామీలు ఇచ్చేస్తానంటున్నారు. ఇదేదో ఉపకార వేతనం అనుకునేరు! ‘ఉప’ ఎన్నికల వేతనం.

అందుకే ధీమాగా ఇచ్చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా వోడినా, అసెంబ్లీలో ఆయన స్థానం మారదు. 2014 లో జరిగే అసలు ఎన్నికలలో గెలిచి, సర్కారును స్థాపించినప్పుడు కదా- హామీల అమలు గురించి ఆలోచించేది?

‘ఆల్‌ ఫ్రీ’ నినాదం ఆయనకు కొత్త కాదు. 2009 ఎన్నికలలో కూడా వాడారు. అన్నీ ఉచితంగా ఇస్తానన్న బాబుకు వోటర్లు కూడా ఎదో ఒకటి ఫ్రీగా ఇవ్వాలి కదా- అని అనుకున్నారేమో! ఇచ్చేసారు. ఓటమిని ఉచితంగా ఇచ్చేశారు.

ఈ 18 అసెంబ్లీ స్థానాలనూ, ఒక్క పార్లమెంటు ఖాళీ చేసింది- అనధికారికంగా జగన్‌ పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస్‌ లో వున్న) కి చెందిన వారు. కాబట్టి, వీటిలోంచి ‘సింహ’ భాగాన్ని తీసుకోవటం, ఇటు బాబుకీ( తెలుగుదేశం పార్టీకీ), అటు కాంగ్రెస్‌ పార్టీకీ వీలు కాని పని. మూడొచ్చినా, నాలుగొచ్చినా – రెండు పార్టీలూ మహాభాగ్యం తలవాలి.

ఆ మూడు నాలుగు సీట్ల కోసం చంద్రబాబు, వరుసగా ఇన్ని ఆస్త్రాలు వాడాలా?

బాంబు వన్‌!

‘అవినీతి. భూముల్లో, గనుల్లో, పనుల్లో అవినీతి. వై.యస్‌ పాలనే అవినీతి. ఈ అవినీతికి లబ్ధి దారుడు జగన్‌’ ఇలా మొదటి బాంబు వేశారు.

‘తినని వారెవ్వరు? అందరూ తింటారు. వైయస్సార్‌ తిన్నాడో లేదో మాకు తెలీదు. మాకు మాత్రం పెట్టాడు’ ఇది అవినీతి పై జనం స్పందన.

అలాగని ప్రజలు వైయస్‌ కీ, ఆయన తనయుడు జగన్‌కీ క్లీన్‌ చిట్‌ ఇస్తున్నట్టు కాదు. కానీ ‘వైయస్‌ పై సానుభూతికి అవినీతి ఆరోపణలు అడ్డు కావు’ అని స్పష్టంగా చెబుతున్నారు. ఇంకే ముంది? అవినీతి అస్త్రం తుస్సు.

బాంబు టూ!

‘మీకు తెలుసా? రాజశేఖర రెడ్డి నాస్తికుడు. భగవంతుణ్ణి నమ్మడు. జగనూ అంతే. తాను ఆస్తికుడు కావటమే కాకుండా, ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షుడిగా రుణాకర రెడ్డి మరో నాస్తికుణ్ణి పెట్టారు. పాపం ఊరికే పోతుందా?’

ఇది బాబు రెండో బాంబు.

నిజానికి వైయస్‌ నాస్తికుడు కారు. ఆయన క్రైస్తవుడు. ఆయన తనయుడు క్రైస్తవుడు.

ఆయన అల్లుడు (బ్రదర్‌ అనిల్‌) క్రైస్తవ మత ప్రచారకుడు. ఏదీ ఎప్పుడూ దాచుకోలేదు.

ఈ బాంబుకి అసలు లక్ష్యం వేరు. తిరుపతి స్థానంలో ఎక్కడ వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుస్తాడేమోనని అభద్రత. దీనినుంచి బయిట పడటానికి. నరేంద్ర మోడీ మార్కు ‘మెజారిటీ హిందూత్వ వాదాన్ని’ ముసుగు వేసి వాడారు? అలా ముసుగు వేయకుండా వుంటే, ” క్రైస్తవుడయిన జగన్‌మోహన రెడ్డి పార్టీకి వోటు వేయకండి’ అని చెప్పాల్సి వచ్చేది. అదే జరిగితే బాబు ‘సెక్యులర్‌’ ముద్ర చెరిగి పోదూ?

ఒక వేళ నిజంగానే జగన్‌ నాస్తికుడయితే, వచ్చే నష్టమేమిటి? పొరుగు రాష్ట్రమయిన తమిళనాడులో పలు మార్లు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధి నాస్తికుడు కారా? ఆయన్ని ప్రజలు ‘నాస్తికత్వం’ కారణంగా ఎప్పుడయినా తిరస్కరించారా?

అదికాక క్రైస్తవుడయిన వ్యక్తిని నాస్తికుడంటే, క్రైస్తవమతాన్ని నాస్తికత్వం కింద జమకట్టటమే కదా? అందుకు రాష్ట్రంలోని, దేశంలోని, ప్రపంచంలోని క్రైస్తవులు వ్యతిరేకత చెప్పరా? చెప్పారు. చెబుతున్నారు కూడా.

అందుకే, రెండోదయిన ‘మతాస్త్రం’ కూడా బెడిసి కొట్టింది.

బాంబు త్రీ!

ముచ్చటగా మూడోది.

‘వైయస్సో ఫ్యాక్షనిస్టు, ఆయన తండ్రి ఫ్యాక్షనిస్టు, కొడుకు ఫ్యాక్షనిస్టు’

కనీసం ఈ బాంబయినా పేలుతుంది కదా- అని బాబు ఆశించారు. వేళకు దిగిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ముద్దాయి భాను వల్ల ఈ ఆశ చిగురించింది. ఇదే సందర్భంలో పరిటాల రవి పై సూట్‌ కేసు బాంబుతో హత్యాయత్నాని కి పాల్పడ్డ అభియోగం పై మంగలి కృష్ణ కు కూడా శిక్ష పడింది.

దాంతో పరిటాల రవి హత్య కేసు నుంచి అప్పట్లో జగన్‌ను తప్పించారనీ, ఇందుకు కేసును తిరగదోడాలనీ బాబు డిమాండ్ల మీద, డిమాండ్లు చేస్తున్నారు.

ఫాక్షనిజంలో కాంగ్రెస్‌కు ఎంత పాత్ర వుందో, తెలుగుదేశానికీ అంత పాత్రవుంది.

రెండు పార్టీల్లో నూ ఫ్యాక్షనిస్టులు తలదాచుకున్నారు.

అలాగే విజయవాడ మాఫియా రాజకీయాల్లో రెండు పార్టీలకు చెందినవారూ వున్నారు.

ఇవన్నీ బహిరంగ రహస్యాలు.

ఈ రెండు పక్షాల్లో ఏ పక్షం వారికి ‘అహింసా వాది’ అని స్టిక్కర్‌ అతికించినా జనం పగలబడి నవ్వుతారు. నవ్వేశారు కూడా.

దాంతో మూడు బాంబు వేసీ వేయంగానే తుస్సుమంది.

ఒక బూచి ప్రాంతం! మరో బూచి కులం!

నిజంగానే చంద్రబాబు షష్టి పూర్తి చేసికుని కూడా, ముఫ్పలయిలలో వున్న యువకుడిలాగా ఎండనకా, కొండనకా తిరుగుతున్నారు. ఇది తనకు ఆఖరి అవకాశమేమో నన్న బెరుకుతో పర్యటిస్తున్నారు.

ఇంత శ్రమ దేనికి? ఇప్పటికిప్పుడు వచ్చిపడే మూడో, నాలుగో స్థానాలు కోసమా? కాదు.

ఆయన అసలు ఆందోళన వేరు.

ఇది అర్థం కావాలంటే, రాజకీయాల్లో గత మూడేళ్ళ బాబు ప్రాగ్రెస్‌ రిపోర్ట్‌ చూడాలి.

2009 ఎన్నికలలో ఆయన పార్టీ తెలుగుదేశం రెండవ సారి ఓడిపోయింది. కానీ బలహీన పడలేదు.

నువ్వా నేనా అన్నట్లు గానే వుంది. కాంగ్రెస్‌పార్టీకీ, తెలుగుదేశం పార్టీ వచ్చిన వోట్ల శాతంలో వ్యత్యాసాన్ని చూస్తే అది రెండు శాతం మించిలేదు.

అప్పటికి కూడా రాష్ట్రంలో ఇద్దరే పెద్ద నేతలు. కాంగ్రెస్‌ నుంచి వై.యస్‌ రాజశేఖద రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు.

హెలికాప్టర్‌ ప్రమాదం వల్ల రాజశేఖరరెడ్డి కీర్తిశేషులయ్యారు. అప్పుడెవ్వరయినా ఏమనుకుంటారు? రాష్ట్రంలో మిగిలిన ఏకైక పెద్ద నేత చంద్రబాబు అనే భావిస్తారు.

కానీ తర్వాత పరిణామాలు అలా జరగలేదు. చంద్రబాబు రోజు రోజుకూ చిన్న బోతూ వచ్చారు.

అగ్రనేతల స్థానాల్లో ఒక చోట(సీమాంధ్రలో) జగన్‌, మరొక చోట(తెలంగాణ)లో కేసీఆర్‌ వచ్చేశారు.

ఇక చిరంజీవి సంగతి సరేసరి. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తారగానే వుండిపోయారు కానీ, అగ్రనేత కాలేక పోయారు. ఫలితంగా పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి, తాను కూడా కాంగ్రెస్‌లోని ‘నలుగురు’లో ఒకరయి పోయారు.

చిన్న బోయిన చంద్రబాబుకు దాదాపు రెండేళ్ళ పాటు ‘తెలంగాణ’లో పాదం మోపటమే కష్టమయ్యింది. సీమాంధ్రలో ‘సమైక్యాంధ్ర’ వినిపించాల్సి వస్తుందని గాబరా పడ్డారు. దాంతో రాష్ట్ర విభజన వివాదంతో సంబంధంలేని వాడి ఉంటూ వచ్చారు. పోనీ అలా వుండిపోయినా బాగుండేది. కానీ రెండూ ప్రాంతాలు తనకు రెండు కళ్ళని చెప్పి అభాసు పాలయ్యారు.

మొన్నటి తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో కొన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

సమైక్యాంద్ర ఉద్యమానికి విరామం ఇవ్వగానే, జగన్‌ ‘ఓదార్పు యాత్రలు’ తిరిగి పుంజుకొన్నాయి. సీమాంధ్రలో జగన్‌ సభలకు ఇప్పటికీ పెద్ద యెత్తున తరలి వస్తున్నారు.

ఈ మార్పులు కేవలం ప్రాంతాల వారిగా జరిగి వున్నా బాబులో కొంత ఆశ మిగిలి వుండేది.

ఇవి కుల సమీకరణల మార్పుకు దోహద పడ్డాయి.

ఎస్సీలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వైపూ, సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపూ వెళ్ళారు.

కాపుల్లో ఎక్కువ మంది చిరంజీవి, బొత్సల కారణంగా కాంగ్రెస్‌ వైపు కొంత మొగ్గు చూపారు.

మిగిలిన బీసీలు సీమాంధ్రలో ఎక్కువగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.

రెడ్లు సీమాంధ్రలో దాదాపు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వచ్చేశారు. తెలంగాణలో ఇంకా కాంగ్రెస్‌ వైపే వున్నారు..

వెలమలు(తెలంగాణలోనే అధికం) దాదాపు టీఆర్‌ఎస్‌లోకి వచ్చేసినట్లే,( వెలమల ఆధిపత్యాన్ని చూపించి, రెడ్లను కాంగ్రెస్‌ వైపు మళ్ళించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసీఆర్‌ తో విభేదాలున్న జెఎసి ఛైర్మన్‌ కోందండరామ్‌(రెడ్డి)కి తెలంగాణలో రెడ్డు పరోక్ష మద్దతు కు యత్నిస్తున్నారు. అంతిమంగా ఈ సమీకరణ ఈ ప్రాంతంలో తెలంగాణ కు లాభించ వచ్చు.)

తెలుగుదేశం పార్టీకి మిగిలినది ఇక కమ్మ సామాజిక వర్గం. బీసీలలో కొంత భాగం.

ఇదే స్థితి 2014 వరకూ కొనసాగితే..!?

ఈ ఊహే చంద్రబాబుకీ, తెలుగుదేశం పార్టీలో వున్న వారికీ కష్టంగా వుండవచ్చు.

కానీ, బాబుకి ఈ వాస్తవం తెలుసు.

కాబట్టే ఆయన సర్వ శక్తులూ వొడ్డుతున్నారు.

ఇప్పుడు జరగబోతున్న ఉప ఎన్నికలలో కేవలం ఒక్క స్థానం మాత్రమే తెలంగాణలో ఉంది. మిగిలిన వన్నీ సీమాంధ్రో వుండడటం వల్ల జగన్‌ మీద అస్త్రం మీద అస్త్రం మీద ప్రయోగించి, అలసి పోయి తిరిగి ‘ఆల్‌ ఫ్రీ’ దగ్గర సెటిలయ్యారు.

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నిజంగా కాలసింది- జనాకర్షక నినాదమో, పథకమో కాదు. జనాకర్షక నేత. ఆ మార్పుకు చంద్రబాబు సిధ్ధమేనా!

- Satish Chandar, Journalist. Poet. Writer

(ఒక రాజకీయ వారపత్రిక కోసం 1మే2012 నాడు రాసిన వ్యాసం. ప్రచురితమయింది కూడా)

 

 
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com