రోశయ్య చూచారా..? కేంద్రాన్ని తూర్పారబట్టారా!!
ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్య కేంద్రాన్ని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ హోదాలో కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. రోశయ్య ప్రసంగంతో అక్కడి కాంగ్రెస్ వర్గాలు బిక్కచచ్చిపోయాయి.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారంనాడు గవర్నర్ హోదాలో తొలి ప్రసంగం చేశారు రోశయ్య. ముళ్లైపెరియార్ డ్యామ్ వివాదంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందని అన్నారు.
రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేయడమే కాక పథకాల రూపకల్పనలో విపక్ష పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులపైనా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జయలలిత పాలనను, పథకాలను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ప్రసంగం ముఖ్యమంత్రి జయలలితకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం తీవ్ర అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.
సహజంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్నే ఆయా రాష్ట్రాల గవర్నర్లు చదువుతారు. అయితే, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రసంగ పాఠాలకు గవర్నర్లు మార్పులు చేస్తుంటారు. ఐతే రోశయ్య మాత్రం అలాంటి మార్పేమే చేయకుండా ఉన్నదిఉన్నట్లుగా చదివేశారు. ఇది కాంగ్రెస్ వర్గాలకు అసహనాన్ని కలిగిస్తోంది.
There are no posts related to రోశయ్య చూచారా..? కేంద్రాన్ని తూర్పారబట్టారా!!.
Tags: అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్, తమిళనాడు

Comments