రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ల హవా కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో నోవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తమ తమ ప్రత్యర్థులను మట్టికరిపించారు.
అయితే నాలుగో సీడ్ ఆండీ ముర్రే మాత్రం 6-7 (1/7), 6-3, 6-2 పాయింట్ల తేడాతో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్క్వెట్ చేతిలో ఓటమిని చవిచూసి ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్ అర్జెంటీనాకు చెందిన జువాన్ మొనాకోను 4-6, 6-2, 6-3 పాయింట్ల తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్లో జో విల్ఫ్రెడ్ సోంగాతో పోటీకి రెడీ అయ్యాడు.
అలాగే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కూడా 6-1, 6-1 వరుస సెట్ల తేడాతో మార్సెల్ గ్రానోల్లర్స్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరోవైపు స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ మాజీ ప్రపంచ నెంబర్ వన్ జువాన్ కార్లోస్ ఫెర్రెరోను 6-2, 5-7, 6-1 పాయింట్ల తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నాడు.
ఇకపోతే.. మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా సోదరీమణులు సెరెనా, వీనస్ విలియమ్స్ తమ సత్తా చాటారు. తొమ్మిదో సీడెడ్ సెరీనా అనబెల్ మెడీనా గారీగ్యూస్ (స్పెయిన్)ను 6-3, 6-1 పాయింట్ల తేడాతో ఓడించగా, సమంత స్టోసూర్‌ను 6-4, 6-3 పాయింట్ల తేడాతో వీనస్ విలియమ్స్ మట్టికరిపించింది.
వీనస్ విలియమ్స్ స్టోసూర్‌పై నెగ్గడం ద్వారా యూఎస్ ఒలింపిక్ జట్టులో స్థానం దక్కించుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్ తర్వాత విలియమ్స్ సిస్టర్స్ కోర్టులో మెరుగ్గా రాణించలేకపోతున్నారు. వీళ్లిద్దరిని గాయాలు ఒకవైపు అనారోగ్య సమస్యలు వెంటాడాయి. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగిన వీరిద్దరూ తమ తమ ప్రత్యర్థులపై గెలుపును నమోదు చేసుకున్నారు.

