సిడ్నీ టీ-20-ఆసీస్ తో భారత్ క్రికెట్ జట్టు ఓటమి!
ఆసీస్ చేతిలో టెస్టుల్లో ఘోరంగా ఓడిన టీమిండియా పరాజయాల పరంపను కొనసాగిస్తోంది. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల పతనానికి 17 పరుగులు సాధించింది.
తదనంతరం 172 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్లు పరుగులు సాధించడంలో తంటాలు పడ్డారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం లేని ఆసీస్ బౌలర్ల చేతిలో కుదేలయ్యారు. లక్ష్యచేధనలో భారత బ్యాట్స్‌మెన్లు చతికిలపడ్డారు.
ఈ క్రమంలో ఓపెనర్లు గంభీర్ (20), సెహ్వాగ్ (4)లు స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ (22), సురేష్ రైనా (14), రోహిత్ శర్మ (0), రవీంద్ర జడేజ (7)లు స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. నిలకడగా ఆడిన ధోనీ 43 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో నాటౌట్‌గా నిలిచాడు.
ఇక అశ్విన్ కూడా 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో డేనియల్ క్రిస్టియన్, డేవిడ్ హస్సీ చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా, బ్రెట్ లీ, హాగ్ తలా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Comments