Wednesday, April 1, 2015
 

ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ బద్రిరాజు కృష్ణమూర్తి కన్నుమూశారు

http://a4.sphotos.ak.fbcdn.net/hphotos-ak-snc6/246805_348935268516316_2051677479_n.jpg

ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్ బద్రిరాజు కృష్ణమూర్తి కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు అనారోగ్యంతో మెడిసిటీ ఆసుపత్రిలో తుదిశ్వాసవిడిచారు.
ఆయన వయస్సు 84సంవత్సరాలు. బద్రిరాజు సుప్రసిద్ద భాషా శాస్త్రవేత్త. ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన భద్రిరాజు తెలుగు భాషపై అనేక పరిశోధనలు చేశారు. భాషా శాస్త్రాన్ని సమగ్ర అధ్యయనం చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్త పరిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భద్రిరాజు మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
బద్రిరాజు కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా ఒంగోలుపట్టణానికి చెందిన వారు. ఆయన స్వస్థలం కూడా ఒంగోలు. ఆయన 28పుస్తకాలు రచించారు.
మూడు విశ్వవిద్యాలయాలనుంచి డాక్టరేట్ లభించించింది. ఆయన ఒంగోలు లో సాధారణ కుటుంబం లో 1928 జూన్ 19 తేదీన జన్మించారు. . భాషాభిమానులలో డాక్టర్‌ బద్రిరాజు కృష్ణమూర్తి ప్రముఖుడు. ఆయన కృషిలో భాగంగానే తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించింది.

 

తెలుగులో పి.డి.యఫ్‌. ఫైలు యూనీకోడ్‌లో మార్చగలిగే స్థాయి రావాలి!

తెలుగు భాషలో మంచి సాంకేతిక పరికరాలు వచ్చాయి. కొన్ని సమస్యలు తీరాయి. ఇంకా కొన్ని సమస్యలు తీరాలి. తెలుగులో ఇంకా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కావాలి. వెన్న నాగార్జున గారు రూపొందించిన పద్మ ఫాంటు మార్పిడి యంత్రం మన భారతీయ భాషలకు ఎనలేని మేలు చేకూర్చింది.  నాగార్జున వెన్న , కొలిచాల సురేశ్ లాంటివారు uni.medhas.org ,http://eemaata.com/font2unicode/index.php5 లతో తెలుగుకు అద్భుతమైన సేవ చేశారు.వెన్న నాగార్జున గారు (vnagarjuna@gmail.com) యూనికోడేతర ఫాంట్లన్నిటినీ యూనీకోడ్‌కి మార్చేలాగా పద్మ ఫాంటు మారక ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్‌కి మార్చగల సామర్ధ్యానికి ఎదిగింది.http://padma.mozdev.org/. కొన్ని అను ఫాంట్ల సమస్య కొలిచాల సురేశ్‌ (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది. పలానా పలానా సమస్యలను పరిష్కరించండి అంటూ సాంకేతిక నిపుణుల్ని అడిగేవాడిని. 2009లో అను నుండి యూనికోడ్‌ లోకి మార్చే ఒక మారకానికి anurahamthulla version అని నా పేరు కూడా పెట్టారు.ఫాంట్లపై పేటెంట్‌ రైట్లు గల వ్యాపార సంస్థల వారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే, యూనికోడ్‌ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.అనువాద ఉపకరణాలు, నిఘంటువులు, లెక్కకు మిక్కిలిగా రావాలి. ఆన్‌లైన్‌ లోనూ ఆఫ్‌లైన్‌ లోనూ వాటిని విరివిగా లెక్సికన్లు వాడుకునే సౌలభ్యాలు కలగాలి.అందరం యూనీకోడ్‌ లోకి మారుదాం. రకరకాల కీబోర్డులు, ఫాంట్లతో తెలుగు భాషలో కుస్తీపడుతున్నాము. ఈ అవస్థ మనకు తీరాలంటే మనమంతా యూనీకోడ్‌లో మాత్రమే మన పుస్తకాలను ప్రచురించమని కోరాలి. అలా చేస్తే ప్రపంచంలో తెలుగువాళ్ళు ఎక్కడినుండైనా తెలుగు పుస్తకాలను, వ్యాసాలను కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ లలో సులభంగా చదవగలుగుతారు. వ్రాయగలుగుతారు. విషయాలను వెతుక్కో గలుగుతారు.తెలుగు ఫాంట్లను తయారు చేసిన కొన్ని వ్యాపార సంస్థలు ఆయా ఫాంట్ల మీద గుత్తాధిపత్యాన్ని ఇంకా వదులుకోలేదు. ఈ పరిస్థితుల్లో ముందు ఇలాంటి ప్రాచుర్యం పొందిన ఫాంట్లన్నిటినీ జాతీయం చేసేందుకు, వాటిని యూనీకోడ్‌లోకి మార్చేందుకు, అనువాద సాఫ్ట్‌వేర్‌లు తయారు చేసేందుకు ఖర్చుపెట్టాలి. తమిళనాడు తరహాలో మంచి సాంకేతిక తెలుగు యంత్రాలను కనిపెట్టినవారికి బహుమతులు కూడా ఇవ్వవచ్చు. తెలుగు మీడియంలో కంప్యూటర్‌ చదువులు కూడా రావాలి. అలా చదివిన డిగ్రీ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తే తెలుగు చాలాకాలం బ్రతుకుతుంది.యంత్రానువాదాలకూ, లిప్యంతరీకరణకూ, విషయాలకు ఆకారాది సూచికలను తయారు చేయటానికీ, వెతకటానికి అనుకూలంగా తెలుగులో కంప్యూటర్‌ వాడకం పెరగాలి.సజీవ వాహిని నిర్వాహకులు తెలుగు భాషలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరికి వారే వెతుక్కునేలా మంచి వెబ్‌సైట్‌ రూపొందించారు. అయితే ఆన్‌లైన్‌ లో మాత్రమే లభిస్తున్న ఈ సౌకర్యాన్ని ఆఫ్‌ లైన్‌లో కూడా అందజేస్తే ఇంటర్‌నెట్‌ లేని వారికి కూడా సౌకర్యంగా ఉంటుంది. తెలుగు భగవద్గీతకు గానీ, తెలుగు కేతలిక్‌ బైబిల్‌కు గానీ, తెలుగు ఖురాన్‌కు గానీ ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయం లేదు.http://sajeevavahini.com/telugubible అందరూ చూడదగినది. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ మిగతా మత గ్రంథాలకు మన తెలుగు పుస్తకాలకు కూడా లభించేలా కృషి చేస్తే విషయాల పరిశీలన సులభం అవుతుంది. తెలుగు భాష శక్తివంతం కావాలంటే తెలుగులో వెలువడిన అనేక ముఖ్య గ్రంథాలకు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఎంతో అవసరం.తెలుగు గ్రంథాలు యూనీకోడ్‌లో ఉంటేనే ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్‌ ఆయా విషయాలను వెతుక్కోటానికి పనికొస్తుంది. కాలంతో పాటు మనం కూడా మారాలి. తెలుగులో తయారైన పి.డి.యఫ్‌. ఫైలును కూడా నేరుగా యూనీకోడ్‌లోకి మార్చగలిగే స్థాయి రావాలి. డి.టి.పీ చేస్తున్న ప్రింటర్లందరూ క్రమేణా యూనీకోడ్‌లోకి మారాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు సహాయపడి తెలుగును బ్రతికించాలి.

- N.Rahamtullah.,

 

ముసలితనం

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

గౌతమ బుద్ధుడుగా పేరుపొందని పిన్నవయసులో సిద్ధార్థుడు మొదటిసారిగా రోగగ్రస్తులనూ, ముసలివారినీ, శవాన్నీ చూసి చలించిపోయాడని అంటారు. ప్రతి ప్రాణికీ తప్పనిసరిగా వచ్చే ముసలితనం ఎవరికీ నచ్చని ఒక సహజ పరిణామం. చివరి ఘట్టమైన మృత్యువుకు మునుపటి దశ కాబట్టి అదంటే మనకు కాస్త భయం కూడా. మనకు పూర్తిగా అర్థం కానటువంటి తక్కిన విషయాలలాగే ముసలితనం అనేది కూడా ఎన్నో అపోహలకు గురి అవుతూ ఉంటుంది. దీన్ని గురించిన ఆధునిక పరిశోధనలు ఎటువంటివో తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.

మనం మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని రెండు రకాలుగా అర్థంచేసుకోవచ్చు. మొదటిది హేతువాద, భౌతికవాద పద్ధతి. రెండో పద్ధతిలో వేదాంత ధోరణీ, ఆధ్యాత్మిక వైఖరీ, మిథ్యావాదమూ మొదలైనవి ఎన్నయినా కలిసిపోయి ఉంటాయి. ఇక ఆ అయోమయంలో కళ్ళకు కనిపించే చరాచర ప్రపంచం గురించి ఎలాగయినా ఊహించుకోవచ్చు. ఈ ఊహలు నేలవిడిచిన సాములాగా ఉండకుండా, మనకు తెలిసినంతవరకూ ప్రకృతిని విజ్ఞానపరంగా అర్థం చేసుకోగలిగితే మనం కాస్త ప్రగతిని సాధించినట్టే. ఎందుకంటే ఎవరెన్ని చెప్పినా మానవసమాజం సాధించిన ప్రగతి ముఖ్యంగా విజ్ఞాన సముపార్జన మీద ఆధారపడినదే. ఈ అవగాహనలో ముసలితనాన్ని గురించిన భావనలు కూడా ఒక భాగమే.

మనుషులకి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తమ ఉనికి. వీలున్నన్నాళ్ళు మంచి ఆరోగ్యంతో బతకడమే మనకు ప్రధానమైన విషయం. అందుకనే ఈనాటికీ ఎవరినైనా కలుసుకోగానే మొదట అప్రయత్నంగా “బాగున్నారా?” అని ఆడుగుతాం. కాని ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. ప్రకృతిలోని ప్రాణులన్నిటికీ వర్తించే ముసలితనం, చావు వగైరాల గురించి మనిషికి అనాదిగా తెలుసు. ఈ పరిణామదశలను అర్థం చేసుకోవడం మనిషికి సమాజ జీవితంలో సాధ్యమైంది. 50 వేల ఏళ్ళ క్రితమే నియాండర్తాల్ జాతి మానవులు శవాలను ఖననం చెయ్యడం మొదలుపెట్టారు. పుట్టుకనుంచి గిట్టేదాకా ఏమవుతుందో ఆదిమానవులు అనుభవం ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.

పుట్టినప్పుడు నిస్సహాయంగా ఉన్నప్పటికీ పసిపిల్లలు పెద్దయాక యుక్తవయస్సుకు చేరుకుంటారు. యవ్వనంలో శక్తినీ, బలాన్నీ, సంతానోత్పత్తికి సామర్య్థాన్నీ పొందుతారు. ఆ తరవాత అనుభవం, తెలివితేటలూ పెరుగుతాయి కాని శరీరం సడలిపోతుంది. నాగరికత మొదలైనప్పటినుంచీ మనవాళ్ళు నిత్యయవ్వనులుగా ఉంటే బాగుండునని కలలు కంటూనే ఉన్నారు. మన పురాణాల్లోని దేవతలు అమరులే కాదు. వారికి ఎప్పుడూ ముప్ఫై ఏళ్ళే! ముసలితనంతో అమరులైతే మాత్రం లాభమేముంది? అందుకే మన దీవెనల్లో కూడా ఆయురారోగ్యాలు కలిసే ఉంటాయి.

శరీరంలో కలిగే రోగాలనూ, రొష్టులనూ పరిశీలించి తగిన చికిత్స చెయ్యడం ఏనాడో మొదలయింది. వీటిలో కొన్నయినా వార్థక్యాన్ని వాయిదా వేసే ప్రయత్నాల వంటివి. చరకుడూ, శుశ్రుతుడూ, బుద్ధుడి కాలంనాటి జీవకుడూ పేరుపొందారు. వీరంతా తమ కాలానికి సంబంధించినంత వరకూ “ఆధునిక” విజ్ఞానం సాధించినవారే. అందువల్ల మన దేశంలో మొదటినుంచీ వేదాంత ధోరణి మాత్రమే ఉండేదని వాదించేవారికి ఏమీ తెలియదనుకోవాలి. ఎందుకంటే భౌతికవాద, హేతువాద దృష్టి లేకుండా ఇటువంటి పరిశోధనలు చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. తరవాతి కాలంలో సూక్ష్మస్థాయిలో బాక్టీరియావంటి వాటివల్ల కలిగే పరిణామాలను అర్థం చేసుకోవడంలో వైద్య, శరీరశాస్త్రాలు ముఖ్యంగా పశ్చిమదేశాల్లో చాలా ప్రగతిని సాధించాయి.

మనిషి సగటు ఆయుష్షు కాలంతో బాటుగా పెరుగుతోంది. నియాండర్తాల్ దశలో 20 ఏళ్ళు బతికిన మానవులు ప్రాచీన గ్రీస్ నాగరికత నాటికి 28 ఏళ్ళూ, మధ్యయుగపు యూరప్ లో 33 ఏళ్ళూ బతికారు. 19వ శతాబ్దం అంతానికి 37కు మించని సగటు వయసు చికిత్సా పద్ధతుల్లోని అభివృద్ధి కారణంగా ఈ రోజుల్లో దాదాపుగా 70కి పెరిగింది. దీనివల్ల సమాజంలోనూ, జీవితం పట్ల మనుషుల దృక్పథంలోనూ కూడా ఎన్నో మార్పులు కలిగాయి. సగటు వయసునూ, జీవన ప్రమాణాలనూ కూడా మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయాయి. మరొకవంక ముసలితనానికి శాస్త్రీయ కారణా లెటువంటివో కూడా అవగాహనకు వస్తున్నాయి…

 

నెలల పేర్లు – వ్యాసావళి

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

స్కూళ్ళు తెరిచేదెప్పుడో, పరీక్షల కెన్నాళ్ళున్నాయో, వేసవి సెలవలు ఎప్పుడొస్తాయో అన్నీ తెలుసుకోవడానికి మనం నెలలు లెక్క పెడుతూ ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఏడాది అవుతుంది. ఒక ఏడాది అంటే 365 రోజులనుకుంటాం కాని ఖచ్చితంగా చెప్పాలంటే అది 365 రోజుల, 5 గంటల, 48 నిమిషాల, నలభై అయిదున్నర సెకండ్ల వ్యవధి. సంవత్సరానికి పన్నెండు నెలలనీ, వాటికి ఇంగ్లీషులో జనవరి, ఫిబ్రవరి వగైరా పేర్లుంటాయనీ మీకు తెలిసినదే. ఇవి కాక మనవాళ్ళు ఉగాది నుంచీ చైత్రం, వైశాఖం మొదలైన పేర్లతో 12 నెలలు లెక్క పెడుతూ ఉంటారు. టైము ఆగకుండా నడుస్తూనే ఉంటుంది కాని మన వీలును బట్టి దాన్ని నిమిషాలూ, గంటలూ, రోజులూ, నెలలూ, సంవత్సరాలుగా లెక్కపెట్టుకుంటాం. అసలీ నెలల పద్ధతి ఎప్పుడు, ఎలా మొదలైంది?

లక్షల సంవత్సరాల నుంచీ మనుషులు ఆకాశంలో సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ, నక్షత్రాలనూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబింబం నెలకొకసారి అమావాస్య రోజున కనబడకుండా పోతుందనీ ఆ తరవాత క్రమంగా పెద్దదై పౌర్ణమి నాటికల్లా పూర్తిగా కనిపిస్తుందనీ వారు తెలుసుకున్నారు. చంద్రుడి కళలను బట్టి లెక్క పెట్టేవే నెలలు. అందుకే చందమామను నెలవంక అని కూడా అంటారు. మొదట్లో ఈ పద్ధతిలోనే లెక్క పెట్టేవారు. ఎటొచ్చీ కేవలం చంద్రుడిని బట్టి పన్నెండు నెలలు లెక్క కడితే ఏడాదికి 354 రోజుల పదకొండుంబాతిక రోజులే వస్తాయి. ప్రకృతిలో రుతువుల్లోని మార్పులన్నీ సూర్యుడి గమనాన్ని బట్టే కలుగుతాయి కనక చంద్రుడి ఆధారంగా నెలలను లెక్కపెట్టే పద్ధతి సరిగ్గా అనిపించలేదు. ఆధునిక పద్ధతిలో నెలలను ఆ రకంగా లెక్కించరు. 28 నుంచి 31 రోజుల దాకా నెలల వ్యవధి రకరకాలుగా ఏర్పాటయి ఉంటుంది.

పురాతన కాలంలో ఇప్పటి ఇరాక్‌ ప్రాంతంలో విలసిల్లిన సుమేరియన్‌ నాగరికతలో ఏడాదికి 12 నెలలనీ, నెలకు 30 రోజులనీ లెక్కించేవారు. ప్రాచీన ఈజిప్ట్‌లోనూ అదే పద్ధతి ఉండేది కాని చివరలో అదనంగా 5 రోజులు చేరుస్తూ ఉండేవారు. క్రీ.పూ.238లో నాలుగేళ్ళ కొకసారి ఒక రోజును చేర్చుకోవాలనే పద్ధతిని వారు ప్రవేశపెట్టారు. లీప్‌ సంవత్సరంగా ఇప్పటికీ అది అమలులో ఉంది. క్రీ.పూ. ఏడో శతాబ్దం దాకా రోమన్‌ కేలండర్‌ పద్ధతిలో ఏడాది మార్చ్‌లో మొదలై పది నెలలపాటే కొనసాగేది. ఆ తరవాత జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చుకున్నారు. అయినప్పటికీ కొన్ని నెలలకు 29, కొన్నిటికి 30 చొప్పున రోజులుండేవి కనక అంతా తికమకగా తయారయింది. క్రీస్తు పుట్టుకకు 45 ఏళ్ళ క్రితం జూలియస్‌ సీజర్‌ అనే రోమన్‌ నేత ఈ వ్యవహారాన్ని సరిదిద్ది, ఇప్పుడు మనం పాటిస్తున్న పద్ధతిని ప్రవేశపెట్టాడు. తాను పుట్టిన తేదీని బట్టి ఆనాడు క్వింటిలిస్‌ అనే పేరున్న నెలకు తన పేరు పెట్టి జూలైగా మార్చాడు. అతని తరవాత అధికారం చేపట్టిన ఆగస్టస్‌ సీజర్‌ ఆ తరవాతి నెలను ఆగస్ట్‌గా మార్చాడు. ఈ జూలియన్‌ కేలండర్‌ లెక్కకూ, సూర్యుడి గమనానికీ 11 నిమిషాల పైగా తేడా ఉండేది. ఇది శతాబ్దాల పాటు పెరిగి కొంత గందరగోళం కలిగించింది.

పదహారో శతాబ్దంలో గ్రిగొరీ అనే రోమన్‌ మతాధికారి పోప్‌గా వ్యవహరిస్తున్నప్పుడు 1600 సంవత్సరాన్ని లీప్‌ సంవత్సరంగా నిర్ణయించాడు. ఈ గ్రిగోరియన్‌ పద్ధతిని అన్ని దేశాలూ అనుసరించడంతో ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఇందులో సంవత్సరాలన్నిటినీ ఏసు క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచీ లెక్కిస్తారు. దీనికి భిన్నంగా యూదు మతస్థులు గత 1200 ఏళ్ళుగా హీబ్రూ కేలండర్‌ను అనుసరిస్తున్నారు. వారి లెక్కన సృష్టి అనేది క్రీ.పూ.3761లో మొదలైంది. ఇస్లామ్‌ మతంలో క్రీ.శ.622 నుంచీ లెక్కిస్తారు. హిందూ పద్ధతిలో ప్రస్తుతం శాలివాహన శక సంవత్సరం 1928 నడుస్తోంది. ఇదే విక్రమ సంవత్సరం 2062 అవుతుంది.

జనవరి అనే నెల జానస్‌ అనే రోమన్‌ దేవత పేరున ప్రారంభమైంది. అలాగే ఫిబ్రవరి అనేది ఫెబ్రువా అనే రోమన్‌ దేవత వల్ల వచ్చింది. ఇందులో మొదట 29 రోజులుండేవి కాని ఇందులోంచి ఒకటి తగ్గించి ఆగస్ట్‌లో చేర్చారు. మార్చ్‌ అనేది యుద్ధాలకు అధిదేవత అయిన కుజుడి పేరుతో (మార్స్‌) ఏర్పడింది. ఏప్రిలిస్‌ అనే మాట నుంచి ఏప్రిల్‌ నెల పేరు వచ్చింది. ఇది (అపెరీరె) ప్రారంభాన్ని సూచిస్తుందని అంటారు. మేయెస్తా అనే రోమన్‌ దేవత వల్ల మే నెల పేరు వచ్చి ఉండవచ్చు. జూన్‌ అనే పేరుకు రోమన్‌ దేవత జూనో కారణమనీ, జూనియస్‌ అనే తెగ కారణమనీ రకరకాల ప్రతిపాదనలున్నాయి. పైన చెప్పినట్టుగా జూలై, ఆగస్ట్‌ నెలలకు రోమన్‌ చక్రవర్తుల పేర్లు ఆధారం. మొదట్లో సెప్టెంబర్‌ ఏడో నెలగా ఉండేది. సంస్కృతానికీ, లాటిన్‌ భాషకూ పోలికలున్నాయి. సంస్కృతంలో ఏడు, ఎనిమిది వగైరా సంఖ్యలను సప్తమ, అష్టమ, నవమ, దశమ అంటారు కనక ఈ శబ్దాలను పోలిన పేర్లుగా సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ కనబడతాయి. మొత్తం మీద సూర్య చంద్రుల కదలికలోని తేడాలవల్ల నెలలన్నీ తలొక రకంగా రూపొందాయి. ఇది కాక నాలుగేళ్ళకొకసారి ఏడాదికి ఒక రోజు కలుపుకుంటూ ఉంటాం.

ఇంగ్లీషు నెలల పేర్లతో బాటు మనవాళ్ళు పెట్టుకున్న పేర్లు కూడా మనం మరచిపోకూడదు.

వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం

చైత్రం,

వైశాఖం,

జ్యేష్ఠం,

ఆషాఢం,

శ్రావణం,

భాద్రపదం,

ఆశ్వయుజం,

కార్తీకం,

మార్గశిరం,

పుష్యం,

మాఘం,

ఫాల్గుణం.

మీ స్నేహితులకు కూడా ఇవి నేర్పించండి.

Source:Maganti

 

మనమంతా ఒక్కటే….!

మనమంతా ఒక్కటే....
మంది ఎందరున్న మమతలు ఒక్కటే,
భాషలు ఎన్నున్నా భావాలు ఒక్కటే,
జాతులు ఎన్నున్నా జాతీయత ఒక్కటే,
బంధాలు ఎన్నున్నా ఆప్యాయతలు ఒక్కటే,
కులాలు ఎన్నున్నా సాన్నిహిత్యం ఒక్కటే,
మతాలు ఎన్నున్నా మానవత్వం ఒక్కటే,
సంస్కృతులు ఎన్నున్నా సంస్కారం ఒక్కటే,
రాష్ట్రాలు ఎన్నున్నా దేశము ఒక్కటే,
ఉగ్రవాదం అంటే ఉగ్రరూపం ఒక్కటే,
హద్దుమీరి వస్తే సమాధానము ఒక్కటే,
మనమంతా ఒక్కటే, ఆలోచనలు ఒక్కటే,
కలిసుండి కాపాడుదాం ..... కలబోతగా ఎదుగుదాం,
జై హింద్.......
 

కవిత్వమా? అంటే ఏమిటి?

ఆ మాత్రం కూడా తెలియదా- అని అంటారని అడగరు కానీ, చాలా మందికి ఈ ప్రశ్న వేయాలనే వుంటుంది.
ఒక వేళ నిజంగా చొరవచేసి అడిగేశారనుకోండి. చెప్పేవాడు మాత్రం ఏమి చెబుతాడు? కవి అయితే మళ్ళీ కవిత్వం మీద కవిత్వం చెబుతాడు. ‘కదిలేదీ, కదిలించేదీ, పెను నిద్దుర వదిలించేదీ’ అని అనొచ్చు. అలా అని ఏ విమర్శకుణ్టో, పరిశోధకుణ్ణో అడిగితే, ఎవరి ‘కొటేషన్నో’ చెప్పి ఊరుకుంటాడు. ‘విశ్వ శ్రేయస్సును కోరేది కావ్యం’ అనో, మరొకటి అనో చెబుతాడు.
చిత్రమేమిటంటే, కవిత్వం మీద జరిగే చాలా సభల్లో- కవిత్వం గురించి తప్ప అంతా నడుస్తుంది. లేదా ‘వాదాల’ గురించి, కవిత్వంలో వున్న ‘సామాజిక సమస్య’ గురించో మాట్లాడేస్తారు.
ఈ మధ్య ఇలాగే (మే 15 నాడు) ‘షేర్‌ ఎ బుక్‌’ అన్న స్కీము లో నన్ను ఇరికించి, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక సభలో’శివసాగర్‌ కవిత్వం’ మీద మాట్లాడించారు. వచ్చిన వాళ్ళల్లో పదేళ్ళ వయసు నుంచి యూభయ్యేళ్ళ వాళ్ళ వరకూ వున్నారు. అభం శుభం పిల్లలకి కవిత్వం మీద లెక్చరివ్వటం ముందు అన్యాయమనిపించింది. కానీ, ఒక్క సారి ఇప్పుడొస్తున్న సినిమాలు గుర్తొచ్చాయి. ప…ప…పదోక్లాసు కుర్రాడు, తొ..తొ..తొమ్మిదో క్లాసు కుర్రదాన్ని ప్రేమిస్తాడు. ఇవేకదా సినిమాల్లో కథలు…!?
వీళ్ళ కు ప్రేమను చెప్పగా ప్రమాదం లేనిది, కవిత్వం చెబితే ఏం ప్రమాదమని అనుకొని మొదలు పెట్టాను.
శ్రీశ్రీ కి వరసకి గురవయ్యే పెద్దాయన పేరు రోణంకి అప్పలస్వామి.
అయన్నో కుర్ర విలేఖరి కలిశాడు. ‘కవిత్వం రాయాలంటే ఏం చెయ్యాలి?’ అన్నాడు.
‘ఎవర్నయినా పిల్లను చూసి ప్రేమించెయ్‌’ అన్నాడు రోణంకి.
‘ప్రేమిస్తే ఏమవుతుంది?’
‘ఏమవుతుందా? జ్వరమొస్తుంది.’
‘ఎందుకండీ?’
‘ఎందుకేవిటయ్యా? నువ్వు ప్రేమించాలనుకో..? ఆ అమ్మాయి కనీసం హేమమాలిని లా వుండాలా?( ఇప్పుడయితే కత్రీనా కైఫ్‌ అనే వాడు లెండి?) తెలివయినదయి వుండాలా? అన్నింటినీ మంచి మనసుండాలా? ‘
‘అవునూ?’
‘ఇన్ని వుంటే, ఆమె వెంట నువ్వొక్కడవే ఎందుకు పడతావ్‌? మీ కాలనీ లో కనీసం రెండొందలు కుర్రాళ్ళు లైన్లో వుండి వుంటారు. అవునా ? కాదా?’ అని ముసలాయన అడిగేసరికి కుర్ర విలేఖరి నోరు వెళ్ళ బెట్టాడు.
అయనా సరే ముసలాయన వదలిపెట్ట లేదు.
‘ ఆ రెండు వందల మందీ దొంగలూ, నేనే మంచి వాణ్ణి- అని చెప్పటానికి ప్రయత్నిస్తావ్‌. అంతే కాదు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావ్‌ కాబట్టి, రాత్రీ, పగలూ ఆమె గురించే పలవరిస్తావ్‌. తిండి తినవు. నీళ్ళు తాగవు. నలిగిపోతావ్‌. నరకాన్ని అనుభవిస్తావ్‌. ఈ వేదనను కాగితం మీద పెట్టి చూడు. కవిత్వం తన్ను కుంటూ వస్తుంది.’ అన్నాడు.
ఆ కుర్ర విలేఖరి లేచి వెళ్ళిపోయాడు. అప్పటికే అతనికి జబ్బు చేసినంత తీవ్రంగా జబ్బు చేసింది. ఇప్పుడు కవిత్వం కూడా చేసింది.
ప్రేమించే పిల్ల స్థానంలోకి .. ప్రపంచం వచ్చేస్తే..?
మురికి వాడలో , బూడిదలో ఆడుతూ, దిసమొలతో తిరుగుతున్న పసివాడు- నీ చేతిలో వున్న చాక్లెట్‌ చూసి పరుపరుగున వస్తుంటే… ఇలాగే చంటివాడి మీద ప్రేమలో పడతావ్‌.
మదర్‌ థెరిసా కూడా ఇలాంటి ప్రేమలో పడింది. మురికి పిల్లల్ని కూడా మనసారా హత్తుకుంది. వాళ్ళ కోసం నలిగి పోయింది. కవి కూడా అంతే..!
ఇలాంటి కబుర్లు చెప్పి నా శ్రోతల్ని నా దారికి తెచ్చుకున్నాను. తర్వాత పాపం.. ఓ గంటన్నర సేపు వారి తలలు నాకు ఇచ్చేశారు. ఏం మాట్లాడానన్నది తర్వాత ఎప్పుడయినా ఒక వ్యాసంలో…!
- సతీష్‌ చందర్‌
 

తెలుగుభాషా డాట్‌ కామ్

తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఇంటర్ నెట్ ఎంతగానో దోహదపడుతుందని మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్ అన్నారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో చిలుకూరి గంగారావు రూపొందించిన తెలుగుభాషా డాట్‌ కామ్ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు కూచిబొట్ల ఆనంద్‌, సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ పాల్గొన్నారు.

 

మిలట్రీవారికీ తప్పని కమసకాయ దెబ్బలు

మా ఊరు వినాయక చవితి పండుగ ఉత్సవం తీరే వేరు. సహజంగా ప్రతి ఇంట పెద్దలు, చిన్నారులు వినాయక విగ్రహానికి పూజాది కార్యక్రమాలు చేసి కానించేస్తుంటారు. అయితే మా ఊర్లో వినాయకచవితి అంటే.. సందడే సందడి. చవితి పండుగకు వారం ముందే … మా ఊరు పిల్లలందరూ సందడి చేసేవారు. కమసకాయలు ( తెల్ల ఉల్లి ఆకారంలో ఉండే ఒక రకమైన కాయలు) బస్తాలకొద్దీ పీకి ఇంటికి చేర్చేవారు.

అసలీ కమసకాయలేమిటీ.. అనుకుంటున్నారా…? తెల్ల ఉల్లి ఆకారంలో ఉండే ఈ కాయలు మా ఊరు మెట్ట పొలాలైన ఉమ్మడి బొందలు, ఏడెకరాల దిబ్బ అని పిలువబడే కొన్ని చోట్ల మాత్రమే దొరికేవి. వాటిని పీకి… జాగ్రత్తగా మా ఊరు రోడ్డు ప్రక్కన ఉన్న చెట్ల మాటునో… గుంతల్లోనే దాచి ఉంచేవారు. చవితినాడు ఈ కాయలతో రోడ్లపై వెళ్లేవారికి దేహశుద్ది చేసేవారు. ముఖ్యంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు అటుగా వస్తే అంతేసంగతులు.

బాపట్ల సూర్యలంకకు మా ఊరు కూతవేటు దూరంలో ఉంటుంది. అంతకుముందు రోజు వరకూ మిలటరీ వాళ్లన్నా.. వారి వాహనాలన్నా భయపడే పిల్లలు చవితి రోజున మాత్రం సింహాలవుతారు. సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషనుకు వాహనాల్లో వెళ్లే మిలట్రీ అధికారులను సైతం మా ఊరు పిల్లలు వదిలేవారు కాదు. వారిపైనా కమసకాయల వర్షం కురిసేది.

మిలట్రీవారు ఎక్కువమంది ఉత్తరాదివారు కావడంతో… హిందీలో ఏదేదో మాట్లాడేవారు. వారి మాటలు మాకు అర్థమయ్యేవి కావు. చివరికి తమ వాహనాలను కాసేపు ఆపి… బండి దిగి… నవ్వుతూ కమసకాయల దెబ్బలను తింటూనే.. గణేశునికి దణ్ణం పెట్టి సాగేవారు. అప్పుడు తెలియలేదు కానీ, దేశమాత కోసం వారు ఎటువంటి దెబ్బలనైనా తింటారని ఇప్పుడర్థమవుతుంది. ఆ సంగతి అలా ఉంచితే…

ఇక రోడ్డుపై వెళ్లే పాదచారుల వీపులపై కమసలు నాట్యం చేసేవి. దెబ్బ ఎటునుంచి తగిలిందని వెనక్కి తిరిగి చూస్తే… ఒక్కరూ కనిపించేవారు కాదు. ఎందుకంటే.. పిల్లలందరూ తూటి చెట్ల చాటున నక్కి.. ఈ పని ప్రారంభించేవారు. పిల్ల చేష్టలకు కొందరు ఆగ్రహించినా… మరికొందరు నవ్వుకుంటూ వెళ్లిపోయేవారు.

ఈ కమసకాయలతో కొట్టడం వెనక ఓ చరిత్ర ఉన్నది. అదేమంటే… పండుగరోజున ఎవరైతే ఈ కమసలతో దెబ్బలు తింటారో… వారికి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు రావనే విశ్వాసం ఉంది. అందువల్లనే ఈ ఆచారం కొనసాగుతోందని మా నానమ్మ చెప్పగా విన్నాను. అందువల్లనో ఏమోగానీ రోడ్డుపై వెళ్లేవారు కొందరు చెట్లచాటున నక్కి ఉన్న పిల్లలను పిలిచి మరీ కొట్టించుకునేవారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న వినాయకుని పందిట్లో ఫలహారం సేవించి వెళ్లేవారు. అలా మా ఊర్లో మొదటి పండుగ ఉత్సవం మొదలయ్యేది.

 

అందరికీ దండం పెడతా! ఆవిష్కరణోత్సవం!

http://thumbp1-ne1.thumb.mail.yahoo.com/tn?sid=2911777484&mid=AJbHtEQAAAi7T506Qgo%2BBAxWFWk&midoffset=2_0_0_1_516313&partid=2&f=462&fid=Inbox&w=156&h=480&httperr=1

 

దిగులంతా ‘తెలుగు తక్కువ’ వాళ్ళ గురించే…!

తెలివి తక్కువ వాళ్ళ గురించిన బాధేం లేదు.
దిగులంతా ‘తెలుగు తక్కువ’ వాళ్ళ గురించే.

తక్కువయిన వాళ్ళు తక్కువయినట్లు వుంటారా? ఎక్కువ మాట్లాడతారు. అక్కడితో కూడా అగరు. తెలుగును ఉద్ధరించే సాహసానికి కూడా ఒడిగడతారు.

ఈ ఉధ్ధారకులు అన్ని రంగాల్లోనూ వుంటారు. ప్రసార మాధ్యమాల్లోనూ, విద్యాలయాల్లోనూ కాస్త ఎక్కువగా వున్నట్లు అనిపిస్తారు.అందుకు కారణం వారి గొంతులు పెద్దవని కాదు కానీ, వారి ముందు అమర్చిన మైకులు పెద్దవి. తెలుగు నాశనమయిపోతుందని బాహాటంగా బాధపడే అవకాశం, అలా వీరికి దక్కింది..

వీరి ఫిర్యాదు దాదాపు ‘వర్ణం’ దగ్గరే ఆగిపోతుంది. (కంగారు పడనవసరం లేదు. భాషలోని ‘వర్ణమే’ లెండి) అది దాటి ‘పదం’ దగ్గరకి కొందరే వస్తారు. వాక్యం దగ్గరకు మరీ తక్కువ మంది వస్తారు.

దీర్ఘాలూ, వత్తులూ, కొమ్ములూ, మేకులూ- సరిలేవటంటూ ‘వర్ణ’ క్రమం చుట్టూ తిరిగేస్తారు. ఇప్పటికీ పలుపత్రికలు తమ సిబ్బంది కోసం విడుదల చేసే ‘శైలి పత్రాల’(Style Sheets)లో వీటి గొడవే ఎక్కువ.ఆ తర్వాత పదాల గురించి యోచిస్తారు. అవి కూడా ఇంగ్లీషుపదాలకు సరిసమానమైన తెలుగు అనువాదాలు. స్థిరపడ్డ అనువాదాలనే కొత్తగా చేరిన పాత్రికేయుడు వాడుతుంటే చాలు. స్వతంత్ర తెలుగు రచనలోని పదాల సంగతి వీరికనవసరం. ఇకా వాక్యాలంటారా? ఎలా పేనుకుంటూ వెళ్ళిపోయినా, ఎవరూ మాట్లాడరు.

విద్యాలయాల్లోనూ దాదాపు ఇదే తీరు. ఇంకా గ్రాంథికమూ, వ్యావహారికమూ అంటూ, ఇంకా గిడుగు చేసిన ఉద్యమాన్నే తిరిగి తిరిగి చేస్తూ, ‘పత్రాలు’ సమర్పిస్తూ వుంటారు.
మరి వీరే తెలుగును ఉద్ధరించేస్తున్నారని ఒప్పేసుకుందామా?
‘గాడిద గుడ్డే’ం కాదూ..!

సరదాకి వచ్చిన కోపం కాదు సుమండీ. నిజంగానే వీరు ఉద్ధరించలేరని చెప్పడానికి ‘గాడిద గుడ్డు’నే ఆధారంగా తెలుగు వారి ముందు పెట్టాలనుకుంటున్నాను.

గాడిద గుడ్డు పెడుతుందా? లేదా? లేక నేరుగా పిల్లనే పెడుతుందా? ఈ గొడవ నాకనవసరం.
గాడిద గుడ్డు పెడుతుండగా కన్న వారు ఎవరూ లేరు కానీ, విన్న వారు మాత్రం వున్నారు.
తెల్లవారు మన దేశంలోని అన్ని నేలలకు వచ్చినట్లే తెలుగు గడ్డకు కూడా వచ్చారు. అలాంటి ఒకానొక తెల్లవాడు పొద్దున్నే తన బంగ్లా నుంచి గుర్రం మీద బయిల్దేరుతూ, ఒక్క సారి తన భగవంతుణ్ణి తలచుకునేవాడు. వాడు తలచుకోవటం వాడి మాతృభాషయిన ఇంగ్లీషులోనే తలచుకున్నాడు:
‘గాడ్‌ ఈజ్‌ గుడ్‌..కాంకర్‌ పీస్‌’(God is Good..Conquer Peace)
కానీ తెలుగు వాడు దీనిని తన మాతృభాషలో తాను విన్నాడు:
‘గాడిద గుడ్డు.. కంకర పీసు’
కంకర పీసు తెలుగు భాషలో లేక పోయినా సర్దుకు పోయాడు.
కానీ, ఈ దైవ ప్రార్థన అసలు అర్థం గాలికి వదిలేశాడు.
తాను అర్థం చేసుకున్నదానినే ప్రచారంలో పెట్టాడు. ఆ నోటా, ఆ నోటా వెళ్ళి అది తెలుగు వాడికి సామెతయి కూర్చుంది. ఎవరయినా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటే ‘ఆ చెప్పావ్‌ లే గాడిద గుడ్డూ.. కంకర పీసూ’ అని కొట్టి పారేయటం మొదలు పెట్టారు అంతా.

వ్యవహారంలో తమని తాము శిష్టులుగా కీర్తించుకునే వారు కొందరు- ఈ ‘గాడిద గుడ్డు’ను కాశీకి కూడా పంపించారు. ఫలితం లేకుండా తిరిగి వచ్చిన వాడితో ‘కాశీవెళ్ళి, గాడిద గుడ్డు తెచ్చినట్టుంది’ అనటం కూడా వారు మొదలు పెట్టేశారు.

వ్యవహారమే భాష అయితే, అది ఎక్కువ సార్లు కింది నుంచే పైకి వస్తుంది.
సామాన్యుడు ఏది మాట్లాడితే అది భాషయి కూర్చుంటుంది.
ఇది ఒక్క తెలుగు భాషకే కాదు. బహుశా ఏ భాషకయినా వర్తించవచ్చు.
ఈ ముక్క ఇంగ్లీషువాడికి చెబితే, వాడు తడుము కోకుండా ‘ఓకే’ అంటాడు.
ఎందుకుంటే, ‘ఓకే’ అనే మాట కూడా ఇలా ‘వర్ణ క్రమం’ కూడా రాని అతి సామాన్యుడు సృష్టించిందే.
వెనకటికి సైన్యంలో పనిచేసే ఒక ఉద్యోగి ఇంగ్లీషులోAll Correct అని రాయటానికి బదులు Oll Korrect అని రాశాడని, అందుకే రెండు మాటల్లోని మొదటి అక్షరాలనూ కలిపి O.K అని పలకటం మొదలు పెట్టారని చెబుతుంటారు.
ఈ రెండు పొడి అక్షరాలకూ తర్వాత ఒక కొత్త వర్ణ క్రమమేర్పడింది. అది Okay అయింది. క్రియ అయింది. దానికి Okay -Okayed – Okayed అనే Conjugation కూడా ఏర్పడింది.

ఎలా చూసినా సామాన్యుడినుంచే భాష పైకి చేరుతుంది.
సామాన్యుడంటే ప్రకృతితో నిత్యమూ సంఘర్షించే వాడు.

కడలి కడుపులోకి వెళ్ళి వచ్చే పల్లెకారుడూ సామాన్యుడే. చెట్టెక్కి తేనెటీగలను చెదరగొట్టి పట్టుతేనె తీసే వాడూ సామాన్యుడే.

విత్తు పగిలి మొక్క విచ్చుకువచ్చే ప్రకృతి విశ్వరూపాన్ని దర్శించేదీ సామాన్యుడే. కాలితో తొక్కిన మట్టితో కళ్ళకద్దుకునే అన్నం కుండను చేసే కుమ్మరీ సామాన్యుడే.

ఈ సంఘర్షణలో తాను కనుగొన్న ప్రతి ఫలితానికీ, ప్రతి ప్రక్రియకూ నామకరణం చేసేది అంతిమంగా సామాన్యుడే.

ఇలా శ్రమతోనూ, ఉత్పత్తితోనూ సంబంధం లేని సోమరి వర్గాల, వర్ణాల నుంచి వచ్చిన కవుల వర్ణనల్లో సైతం ఈ సామాన్యుడికున్న పదసంపద కనిపించదు.

అందమైన అమ్మాయి కన్నులను వర్ణించటానికి ‘కమలాక్షి’ అనో ‘మీనాక్షి’ అనో అంటూ వచ్చాడు.
చేప ఆకారం వంటి కన్నుల కలది- అని అన్నందుయినా కొంచెం సంతోషిద్దాం.
కానీ, ఏ చేప ఆకారం అంటే ఏమి చెబుతాడు? కొర్రమీను అంటాడా? బొమ్మిడాయ అంటాడా; గొరక పిల్ల అంటాడా? లేక మట్టగిడస అంటాడా?

ఏవో కొన్ని సినిమా పాటల్లో తప్ప ఈ కవుల చూపు ఇంకా ‘మట్టగిడస’ మీద పడలేదు.
తెల్ల చందువ చేపల్లా మెరిసే అందమైన కన్నుల్ని ఇప్పటికీ శ్రామకి వర్గాలనుంచీ, అట్టడుగు కులాలనుంచీ వచ్చిన కవే చూడగలడు.

ప్రకృతితో సంఘర్షణే విజ్ఞాన శాస్త్రమయి, ఆ శాస్త్రం పలు శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నప్పుడు, ఇంకా భాషను ఇవేమీ తెలియకుండా పురాణగాధల్నే పుక్కిట పడుతూ వుండే పండితులే ఉద్ధరించాలనుకోవటం అత్యాశ అవుతుంది.

సామాన్యుడు మాట్లాడే భాషలో ఏయే క్రమాలను పాటిస్తున్నాడో, వాక్యాలను ఎన్ని రకాలుగో నిర్మిస్తున్నాడో గమనించి సూత్రీకరించేదే వ్యాకరణం కావాలి. ఈ సూత్రీకరణ ఇవాళ మనం మాత్రమే చేసుకుంటున్నది కాదు.

నవీన ఆంగ్ల వ్యాకరణంలో దిట్ట అయిన ప్రొఫెసర్‌ హోలడే ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఆంగ్ల వ్యాకరణ సదస్సుకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని పరిశీలనలు చేశారు. కుహనా భాషాశాస్త్రల భ్రమల్ని పటాపంచలు చేశారు.
వ్యాకరణాన్ని వృధ్ధి చేసేది భాషాశాస్త్రవేత్తలు కారనీ, భాషా,సాహిత్యాలను బోధించే అధ్యాపకులు కారనీ ఆయన సహేతుకంగా తేల్చిపారేశారు.

భాష,సాహిత్యాల కన్నా, విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే వారే వ్యాకరణాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో కూడా రుజువు చేశారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడి రాసిన పత్రంలోని ఒక పేరాగ్రాఫ్‌ చదివి వినిపించారు. అది అద్దం లక్షణాలను వివరించే వ్యాసంలోని భాగం. అందులో Break అనే మాటను ఎన్ని భాషాభాగాలుగా ఆయన వాడుకున్నాడో వివరించారు.Break, Breakage, Breaking, Break-up ఇలా అనేక రకాలు ఉపయోగించారు.

నాడు సామాన్యులు చేసేపనే, నేడు విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చేస్తున్నారు. ప్రకృతితో సంఘర్షిస్తున్నారు. అందుకనే వీరి వల్ల భాష అభివృధ్ధి చెందుతోంది.
తెలుగులో విద్యా బోధన చేసేటప్పుడు, ఇలా శాస్త్రవేత్తలు తమ తమ భాషల్లో చేసిన మాటలకి సరయిన తెలుగు పదాలు వెతికేటప్పుడు, ఇక్కడ మన అనువాదకులు తెలుగు పదాలను వాడలేక పోతుంటారు. మళ్ళీ సంస్కృత పదాలనే(తత్సమాలు)గా ఎరువు తెచ్చుకుంటారు.

Photosynthesis అనే మాటకు ‘కిరణజన్యసంయోగక్రియ’ గా అనువాదం
చేశారు.భాష్పోత్సేకం, వక్రీభవనం- ఇలాంటి మాటలే. ఇందులో ఎక్కడా తేటతెలుగుపలుకులు లేవు. కారణమేమిటంటే, ఇంతవరకూ గ్రాంధికమైన తెలుగు చేత శాస్త్రాలను మోయించలేదు. సంస్తృతంతో పాటు ఇంగ్లీషు చదువును కూదా తెలుగులో తామే ముందు చదువుకున్న బ్రాహ్మణ వర్గాలు, ఈ విజ్ఞాన శాస్త్ర పదాలకు సరిసమానమైన వాటిని సంస్కృతంలోనే వెతికి పెట్టారు. అదే అలవాటుగా మారింది. ఆ తర్వాత పత్రికల్లోనూ, రేడియోల్లోనూ ఈ వర్గాలే పీఠం వేసుకుని కూర్చుని, అలాంటి అనువాదాలకే శ్రీకారం చుట్టాయి. ఆ వరవడే ఇప్పటికీ నడుస్తోంది.

విద్యాబోధన మొత్తం తెలుగులోనే జరగాలని గింజుకునే వీళ్ళంతా వేదాలు విన్న తమ చెవులకు ఇంపుగా(పోనీ, శ్రవణ పేయంగా) వుండే అనువాదాలనే వాడుతూ తమకి తాము గ్రాంథికం నుంచి బయిటకు వచ్చినట్లూ, వ్యవహార భాషలో మునిగి తేలుతున్నట్లూ చెబుతన్నారు.
కానీ అసలు వ్యవహారభాషకు కేవలం ‘వ్యుత్పత్తి’ సంబంధాలు కాకుండా, ‘ఉత్పత్తి’ సంబంధాలు కూడా పునాదిగా వుంటాయి అన్న విషయాన్ని వీరు ఇప్పటికీ మరుగు పరుస్తున్నారు.

తెలుగు భాషను ఇప్పుడు శుధ్ధి చెయ్యాలి. పవిత్రపరచాలి.
అందుకు అట్టడుగు వర్ణాల, వర్గాల నుంచి వచ్చిన వివిధ విజ్ఞానశాస్త్ర విభాగాలలోని అధ్యాపకులు, పరిశోధకులూ ఇందుకు నడుము కట్టాలి.
అగ్రవర్ణ సంస్కృతానువాదాలకు, దీటయిన అట్టడుగువర్ణాల, వర్గాల తేటతెలుగు అనువాదాలను, పర్యాయ పదాలను ప్రవేశపెట్టాలి.
శ్రమకు ఎవరు ఆద్యులే, వారే భాషకు సైతం ఆద్యులని నిరూపించాలి.
ఏ పనిని పనిగట్టుకు చేయక పోయినా జరిగిపోతుంది కానీ, కాస్య ఆలస్యమవుతుంది. వేగవంతం చేయటమే భాషా విప్లవం.

ఈ సందర్భంగా టాల్‌స్టాయ్‌ రాసిన ‘గాడ్‌ ఈజ్‌ వేర్‌ లవ్‌ ఈజ్‌’ అనే కథ గుర్తుకొస్తున్నది.
ఆ కథ ముగింపులో చెప్పులుకుట్టే కార్మికుడు, సోమరి వర్గాని చెందిన బోధకుడితో సంబాషణ కీలకమైనది.

‘నువ్వు Man of LETTERS కావచ్చు. కానీ, నేను Man of LEATHERS ను. నేనే నీకు బోధించాలి. నువ్వు నాకు బోధించ కూడదు’ అంటాడు.

అవును. మృత కళేబరాలనుంచి చర్మాన్ని తీయటం, శుధ్ధి చెయటం, దానిని చెప్పుగా మలచటం గొప్ప శాస్త్రం. అంటే అతడు శాస్త్రవేత్త. భాషను పరిపుష్టం చేసి భాషకు భవిష్యత్తు ఇవ్వగలిగింది- అతడు కాక మరింకెవ్వడు..?
- సతీష్‌ చందర్‌
(విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు-2011లో చేసిన సతీష్‌ చందర్‌ ప్రసంగ పాఠం)

 
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com