Sunday, May 20, 2012
 

శాస్త్రసాంకేతిక పరిశోధనలకు! పారిభాషిక పదజాలోత్పత్తికి! అనువైన ఒకే ఒక్క భారతీయ భాష తెలుగు!

ప్రఖ్యాత భాషాశాస్త్ర మేధావి హాల్డెన్‌ పండితుడు శాస్త్రసాంకేతిక పరిశోధనలకు అనుగుణంగా పారిభాషిక పదజాలోత్పత్తికి అనువైన ఒకే ఒక్క భారతీయ భాషగా తెలుగును కీర్తించాడు. అయితే విశ్వ విద్యాలయాలుగాని ప్రభుత్వంగాని ఈ దిశగా దృష్టి సారించకపోవడం తెలుగు దురదృష్టం.తెలుగు భాషను ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అంటారని తెలిసిందే! ఆవిధంగా పోల్చిన వ్యక్తి ఎవరు? సమకాలీన తెలుగు సాహితీ వేత్తలు భాషాపరిశోధకులలో చాలా మందికి ఆయన ఎవరన్నది తెలీదు. అయితే బిరుదురాజు రామరాజు సి.పి.బ్రౌన్‌ అన్నారని తమ ‘తెలుగు జానపదగేయసాహిత్యము’ గ్రంథంలో చెప్పారు. రామరాజు వంటి పెద్దలు అలా రాయడం చాలా శోచనీయం. ఎందుకంటే బ్రౌన్‌ మహాశయునికి ఇటాలియన్‌ భాష రాదుమరి! దురదృష్టవశాత్తు పోటీపరీక్షల పుస్తకాల్లో కూడా సి.పి.బ్రౌన్‌ అన్నట్లుగానే రాస్తున్నారు. అసలు తెలుగును ఇటాలియన్‌తో ఎందుకు పోలు స్తారు? అలా పోల్చడానికి గల కార ణాలేమిటి అన్న అంశాలపై నేటికీ తగినంత పరిశోధన జరగలేదు.
ఇటాలియన్‌ భాష తెలుగు భాషలాగా అజంత భాష. ప్రాచీన లాటిన్‌ భాష నుండి జన్మించింది. భారతదేశ చరిత్రతో సంబంధమున్న ఇటలీయాత్రికులు నికోలోకోంటీ, సాస్సెటి విజయనగర చక్రవర్తుల ఇంజనీరైన జొడెల్లా ఫాంటీ, ప్రస్తుత ఇటలీ అధ్యక్షుడు సిల్వియో బెర్లుస్కోని వంటి పేర్లను బట్టి కూడా చాలా సులభంగా అజంతభాషగా గుర్తిస్తాం. ఇటాలియన్‌భాషను దేశీయంగా ‘ఇటాలియనొ’ అని పిలుస్తారు. ఇటాలియనొ వర్ణమాలలో ని 21 అక్షరాలు రోమన్‌ లిపిలో ఉంటాయి. అంటే ప్రస్తుత ఆంగ్లవర్ణమాలలోని అక్షరాలే! ఇతర భాషల ప్రభావం వల్ల ్జ,జు,ఠీ,్ఠ,డ అనే 5 అక్షరాలు చేరి ఆంగ్ల వర్ణమాలలోని 26 అక్షరాలూ ఉంటాయి. మన వర్ణమాలలోని మహాప్రాణాక్షరాలు సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. తెలుగులో 56 అక్షరాలున్నాయి.
గుణింతాల్నీ కలుపుకుంటే ఈ సంఖ్య చాలా పెరుగుతుంది. అందుకే ప్రపంచ భాషలన్నిం టిలోని శబ్దాల్నీ తెలుగులిపిలో రాయవచ్చు. ఇటాలియనొలో ఉన్న 26 అక్షరాలూ లిపి పరిమితినీ, ఉచ్ఛారణా పరిమితినీ తెలియజేస్తాయి. తెలుగులో ఉన్న మూర్దన్య ట,డ,ణ శబ్దాలు కూడా ఇటాలియనొలో లేవు. అందువల్ల వర్ణమాల విషయంలో ఏవిధంగా చూసినా ఇటాలియనొ కన్నా తెలుగు చాలా ఐశ్వర్యవంతమైనది.
తెలుగుభాష లాగే ఇటాలియనొలోని పదాలకు ఉచ్ఛారణకు పెద్ద తేడా ఉండదు. ఒకవేళ ఉన్నా అది మాండలిక భేదాల వల్ల కలిగిన భాషా పరిణామమే! నగరీకరణం ఆధారంగా భాషా పరిణామం జరగడం వల్ల మాండలిక భేదాలు నగరాల ఆధారంగానే ఏర్పడ్డాయి. వాటిని నగరాల పేర్ల మీదుగానే పిలుస్తారు. అందువల్ల చాలా ఎక్కువ మాండలికాలున్నాయి.
టస్కనీ మాండలికంలోనే గొప్ప సాహిత్యం ఆవిర్భవించింది. డాంటే ఆలిగరి, పెట్రార్క్‌, బొకాస్సియో వంటి గొప్ప కవులు టస్కనీ మాండలికంలోనే సాహిత్య సృజన చేశారు. ఈ కవిత్రయం 13,14 శతాబ్దాలకు చెందినవారు. వీరితోనే ఇటాలియనొ సాహిత్య చరిత్ర ప్రారంభమవుతుంది. వీరికి మన కవిత్రయానికి కొన్ని పోలికలున్నాయి. కీ.శ. 1293లో డాంటే చేసిన తొలి రచన ‘లా విటా న్యూవా’ (కొత్త జీవితం). ప్రియురాలితో కలిగిన అనుభవాల్ని, అనుభూతుల్ని కొత్త జీవితంగా అభివర్ణించి పదకవితలను సంకలనం చేసిన రచనయిది. అయితే డాంటే అనగానే ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాభిమానులకు జ్ఞాపకం వచ్చే గొప్ప రచన ‘ది డివైన్‌ కామిడి’! ఇక పెట్రార్క్‌ కూడా ప్రేమ కవిత్వ పిపాసి.
‘కాంజొనీయెరె’ అనే రచన చేశాడు. ఇందులో మనిషి భావోద్వేగాల్ని అత్యున్నతంగా చిత్రించినట్లు సాహిత్యాభిమానులు భావిస్తారు. తెలుగు కవిత్రయంలోని రెండవ వాడు అయిన తిక్కన సోమయాజి కూడా మానవమనస్తత్వ చిత్రణలో పతాక స్థాయిని అందుకున్న సంగతి తెలిసిందే! మూడవవాడైన బొకాస్సియో ప్రసిద్ధ లాటిన్‌కవి హోమర్‌ రచనలైన ఇల్లియడ్‌, ఒడెస్సి కావ్యాలను అనువాదం చేశాడు. సంస్కృత వ్యాసభారతం అనువాదంతోనే తెలుగు సాహిత్య ప్రారంభోత్సవం జరిగింది కదా! ఈ కారణాల వల్ల ఇటాలియనొభాషకు ఫ్లారెన్స్‌భాష, టస్కనిభాషనే నామాంతరాలు కలిగాయి.
భాషాచరిత్ర విషయంలో తెలుగు భాషతో పోల్చితే ఇటాలియనొ చాలా ఆర్వాచీనమైనది. క్రీ.శ. 10వ శతాబ్దం నాటి చట్టసంబంధమైన పత్రాల్లో మొదటగా ఇటాలియనొ పదాలు కన్పిస్తాయి. తెలుగుభాష ఇటాలియనొ కన్నా కనీసం వేయి సంవత్సరాలు ప్రాచీనమైనది. క్రీ.పూ. 1వ శతాబ్దంలోని ప్రాకృత కథాసంకలనం హాలుని ‘గాథాసప్తశతి’ లో తెలుగు పదాలు విస్తారంగా ఉండడం భాషా పరిశోధకులు గుర్తించారు. క్రీ.పూ. 10 శతాబ్దం నాటిదిగా పరిగణించే ఋగ్వేద సంబంధమైన ఐతిరేయ బ్రాహ్మణం లోని శునశ్శేపుని కథలో ఆంధ్రజాతి ప్రస్తావన కనిపిస్తుంది. కాబట్టి ఏవిధంగా చూసినా ఇటాలియన్‌ సంస్కృతి కన్నా ఆంధ్రసంస్కృతి కనీసం రెండువేల సంవత్సర ాలు ప్రాచీనమైనది.
ఇటాలియనొ తొలి వ్యాకరణరచన 15వ శతాబ్దంలో జరిగింది. ఆ ఇటాలియనొ తొలి వయ్యాకరిణి లియోన్‌ బటిస్టా ఆల్బెర్టి (1404-1472). ఇతను రాసిన వ్యాకరణం పేరు ట్ఛఠజ్ఛూ జూజీఠ్ఛ జజూౌట్ఛ్టజ్ఛీ. వ్యాకరణ విషయంలో కూడా తెలుగు అత్యంత ప్రాచీనమే! తెలుగు భాషకు సంస్కృతంలో రాసిన వ్యాకరణం ‘ఆంధ్రశబ్ద చింతామణి’. దీన్ని రాసినవాడు నన్నయ అని కొందరి అభిప్రాయం. తెలుగులో తెలుగు భాషకు వ్యాకరణం ఆంధ్రభాషా భూషణం. దీని కర్త 13వ శతాబ్దానికి చెందిన మూల ఘటిక కేతన.
పద సంబంధంగా ఇటాలియనొ భాష సజాతీయ భాషలైన స్పానిష్‌, ఫ్రెంచ్‌ భాషలకు చాలా దగ్గరగా ఉంటుంది. తెలుగుభాషకు కన్నడభాషకు ఉన్న సంబంధం ఇటువంటిదే! అయితే తెలుగు కన్నడం భిన్న ద్రావిడోప కుటుంబాలకు చెందినవి. ద్రావిడభాష అయిన కొలామికి తెలుగు భాషకు పదసామగ్రి విషయంలో ఇటువంటి సామీప్యత చాలా కన్పిస్తుంది. అయితే కొలామి అనాగరిక ద్రవిడ భాష.
ఐరోపా చరిత్ర అధ్యయనానికి ఇటాలియనొ చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మరో రకంగా విశ్లేషిస్తే మత సంస్కరణ ఉద్యమం, పారిశ్రామిక విప్లవం, సామాజిక సాంస్కృతిక రాజకీయ ఆర్థిక పరిణామాలు, శాస్త్రసాంకేతిక పరిశోధనలకు అత్యంత అవసరమైన నూతన పదజాలోత్పత్తికి ఇటాలియనొ చాలా ఉపయోగపడింది. అందుకే ఇటాలియనొ భాషాపరిణామాన్ని అధ్యయనం చేస్తే ఐరోపా చరిత్రను అధ్యయనం చేసినట్లేనంటారు. ఇందులోనూ తెలుగుభాషకు చాలా స్పష్టమైన పోలిక కన్పిస్తోంది. ప్రఖ్యాత భాషాశాస్త్ర మేధావి హాల్డెన్‌ పండితుడు శాస్త్రసాంకేతిక పరిశోధనలకు అనుగుణంగా పారిభాషిక పదజాలోత్పత్తికి అనువైన ఒకే ఒక్క భారతీయ భాషగా తెలుగును కీర్తించాడు.
అయితే విశ్వ విద్యాలయాలుగాని ప్రభుత్వంగాని ఈ దిశగా దృష్టి ్టసారించకపోవడం తెలుగు దురదృష్టం. ఇటాలియనొ అజంతమైనందున పదాలు మార్దవంగా, మధురంగా వినసొంపుగా ఉంటాయి. ప్రణయ జీవులైన ఇటాలియనొ ప్రజలు ఈ మధుర భాషను ప్రణయ భాష (టౌఝ్చఛ్ఛి జ్చూఠ్చ్ఛ) గా భావిస్తారు. సహజంగా స్వర సంధానమై సంగీతానికి అనువుగా ఒదిగిపోతుంది. దీనిలో ఉన్న ఈ ముఖ్యలక్షణం ఆసక్తికరమైనదీ, చర్చనీ యాంశమైనది. వాయిద్య గేయ గాత్ర సంప్రదాయాలను కలిగి మిగిలిన సజాతీయ భాషలకన్నా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇటాలియనొ భాషమీదా, సంగీతం మీదా ‘ఒపేరా’ ప్రభావం చాలా ఎక్కువ. ‘ఒపేరా’ అంటే నాటకీయత కల్గిన గేయరూపకం, లేదా నృత్యరూపకంగా చెప్పవచ్చు. ఈ ‘ఒపేరా’ ప్రాచీన లాటిన్‌భాష నుండి ఇటాలియనొలోకి దిగుమతి చెందింది.
ఈ విషయంలో కూడా తెలుగు భాషకు సంబంధించి సమానత్వాన్నే కలిగి ఉంది. ఆంధ్ర దేశంలో బొమ్మలాటలు ఆడటాన్ని క్రీ.పూ. 1వ శతాబ్దం నాటి హాలుని గాథాసప్తతి చెబుతోంది. సాంప్రదాయ తెలుగు సాహిత్యంలో ఆధునికయుగం దాకా నాటకం లేకపోవచ్చు గాని తెలుగు జీవితంలో, సమాజంలో నాటకం ఉంది. బొమ్మలాటలు ఆపాత్రను ద్విగుణీకృతంగా పోషించాయి. తర్వాత కాలంలో యక్షగానాల పాత్ర కూడా చాలా గొప్పది. 14వ శతాబ్దం కన్నా ముందు ఉన్న ప్రసిద్ధ ‘పేరిణి’ నృత్యం చేసిన సేవ కూడా తక్కువేమీ కాదు. దేశీయ ఛందస్సుల మీద కాస్త అవగాహన ఉన్నా తెలుగు భాషలోని సంగీత స్వభావాన్ని సులభంగా గ్రహిస్తాం.
ఉదాహరణకు, ద్విపద గేయ సాంప్రదాయానికి చెందినది. దీని జన్మస్థానం జానపదుని హృదయం. శతకాన్ని మినహాయిస్తే కావ్యమంతా ప్రయోగించే గౌరవాన్ని ద్విపదే దక్కించుకుంది. సీసం, కందం, ఆటవెలది, తేటగీతి వంటి దేశీ ఛందస్సులోని చతుష్పాద వ్యవస్థ సంస్కృతవృత్త ప్రభావం వల్ల కలిగినదే తప్ప దేశీయమైనది కాదని పరిశోధకులు తేల్చారు. ఎందుకంటే ఇవి మాత్రాఛందస్సు మీద ఆధారపడినవి. ద్విపద విద్యకు ఆచార్యుడైన పాల్కురికి సోమన గురించి ఇక్కడ రెండు మాటలు చెప్పుకోవాలి. ‘ఐహికాముష్మిక ద్విపద హేతువగుట ద్విపద నాగబరుగు’ అని ద్విపదను మోక్షప్రదాయినిగా భావించాడు. వృత్తఛందస్సులు చతుష్పాదులు.
అంటే జంతు ప్రతీకలు. ద్విపద రెండుకాళ్ల మానవ ప్రతీక. ద్విపదను ఉపయోగించి దాన్ని పాటలు గట్టి ప్రచారం చేసి వీరశైవాన్ని జనసామాన్యానికి చేరువ చేయడం ద్వారా తన జీవితానికి సార్థకతను సాధించాలనుకున్నాడు. అంతకు మించి ‘ఐహికాముష్మిక’మనే మాటకు వేరే భావాన్ని అన్వయించలేం. ‘కూర్చెద ద్విపద కోర్కికైవార’ అని ప్రతిజ్ఞ చేసి, ‘తెలుగు మాటల నంగవలదు వేదముల కొలదియకా చూడు’ అని తెలుగుభాషకు ఉత్కృష్ట స్థానాన్నిచ్చాడు. ‘ఏదేశమేగినా ఎందుకాలిడినా’ అని రాయప్రోలు సుబ్బారావు భరతమాతను ద్విపదలోేనే స్తుతించారు. ద్విపద నుంచి ఆవిర్భవించిన తరువోజ, సీస పద్యాలు కూడా జానపదుల సృష్టే! అయితే వాటి చతుష్పాదలక్షణం పండితకవులను ఆకర్షించి పద్యంగా చెప్పి హృద్యంగా మలిచారు. ఒక సీసపద్యాన్ని జానపదగేయంలో ఒక చరణంగా వాడుకుంటారు.
త్రస్రగతి, చతురస్రగతి, మిశ్రగతి (ముత్యాల సరాలు), ఖండగతి, సంకీర్ణగతి వంటి మాత్రా ఛందస్సులనుండే దేశీయ ఛందస్సు జీవం పోసుకుంది. ఉదా: చతురస్రగతి వల్లనే 64 మాత్రలు కలిగిన కంద పద్యానికి ఆ అందమైన వయ్యారపు నడక వచ్చింది. అదేవిధంగా తెలుగు జానపదాన్ని జ్ఞానపదంగా మార్చిన వాగ్గేయ కారుడు అన్నమయ్య. ఆ పద కవిత్వ సాంప్రదాయాన్ని తదనంతర వాగ్గేయకారులైన త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య కొనసాగించారు. తమిళ, మళయాల, కన్నడిగులు సంగీతం నేర్చుకోవాలంటే తెలుగుపదకవుల కీర్తనలే ఎక్కువగా నేర్చుకుంటారు. అన్నమయ్యను దర్శించి ఆయన నుంచి స్ఫూర్తి పొంది పురంధర దాసు కన్నడంలో దాససాంప్రదాయం పేరుతో పదకవిత్వాన్ని ప్రారంభించాడు.
తెలుగుభాష సంగీత స్వభావాన్ని సినిమా పరిభాషలో విశ్లేషించాలంటే జేసుదాసు, చిత్ర, శంకర మహదేవన్‌ వంటి సోదరద్రావిడ భాషల గాయకులు- తెలుగు రాకపోయినా తెలుగు సినిమా పాట పాడితే దాదాపు తెలుగుగాయకులే పాడినట్టుగా ఉంటుంది. కారణం వారు ప్రాథమికంగా ఎక్కువగా నేర్చుకునేది మన పదకవుల కీర్తనలే కాబట్టి! శంకరాభరణం వంటి సినిమాలను మళయాళంలోకి డబ్‌ చేసినా పాటల్ని తెలుగులోనే ఉంచడానికి కారణం అదే. ఉత్తరాది నుంచి వచ్చే మహమ్మద్‌ రఫీ, ఉదిత్‌ నారాయన్‌ వంటివారు తెలుగుపాట పాడితే కొట్టొచ్చిన తేడా కనిపిస్తుంది. తెలుగు గాయకుడైన బాలసుబ్రహ్మణ్యం హిందీపాట పాడితే దాదాపు హిందీగాయకుడే పాడినట్టుగానే ఉంటుంది. ఈ రెండింటికీ కారణాలు చాలా స్పష్టం.
తెలుగు అజంతం కావడం, ఉత్తరాది భాషలు హలంతం కావడమే గాక తెలుగు భాష కున్న లయాత్మకత సంగీతాన్వయం, తెలుగుస్వభావసిద్ధమైన తాళశైలి ముఖ్యమైన కారణాలు. అందు వల్లనే ఉత్తరాది సంగీత భేదాలైన గజల్‌, ఖవ్వాలి వంటి సంగీత సాంప్రదాయాల్ని కూడా తెలుగు గాయకులు అలవోకగా పాడ గలు గుతున్నారు. ‘సింధూనది మీద మళయాళీ పడుచు సాహచర్యంలో తెలుగు పాట పాడుకుంటూ తెప్పమీద సాగిపోవా’లని తమిళ జాతీయ మహాకవి సుబ్రహ్మణ్య భారతి వ్యాఖ్యానించడంలోని అంతరార్థమదే. ఇటాలియనొ ఆదికవి డాంటే కూడా పదకవే కావడం ఇటాలియనొ సంగీతస్వభావాన్ని తెలియజేస్తోంది.
ఇటలీ తదితరదేశాల్లోని ఇటాలియనొ వ్యవహర్తల సంఖ్య ఎనిమిది కోట్లు. ఆంధ్రరాష్ర్టంతో పాటు, ఇతర ప్రాంతాల్లోని తెలుగు వ్యవహర్తల సంఖ్య పదిహేడు కోట్లు. అయితే ఇటలీ ప్రజలకు తమ భాషాసంస్కృతుల పట్ల చాలా మమకారం. తెలుగుజాతికి అదే లోపం.మళ్ళీ మొదటికి వస్తే, తెలుగు భాషను ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ (తూర్పు ఇటాలియనొ భాష) అని ప్రశంసించిన వ్యక్తి ఎవరు? ప్రౌఢ దేవరాయుల కాలంలో ఆంధ్రదేశంలో పర్యటించిన ఇటాలియన్‌ యాత్రికుడు నికోలో కోంటీ (1396-1469). క్రీ.శ. 1419లో ప్రసిద్ధ పోర్చుగీసు యాత్రికుడు మార్కోపోలో ప్రయాణించిన దారిలో తన ప్రయాణం ప్రారంభమయింది. తన పర్యటనలో సిరియాలో అరబిక్‌భాషను, ఇరాన్‌లో పర్షియాభాషను స్థానిక వ్యాపార కార్యకలాపాల్లో భాగంగానే నేర్చుకున్నాడు. అక్కడి నుండి భారతదేశంలోని గుజరాత్‌కు వచ్చి, సరాసరి విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలో అడుగు పెట్టాడు.
హంపీ నగరం తమ రోమ్‌నగరం కన్నా అందమైనదనీ, విశాల మైనదనీ తర్వాత కాలంలో తన రచనలో రాసుకున్నాడు. ఆంధ్రదేశంలో దాదాపు సంవత్సరంపైగానే గడిపాడు. భారతీయ మహిళనే వివాహం చేసుకున్నాడు. ఎక్కువ రోజులు ఆంధ్రదేశంలోనే ఉండడం వల్ల తెలుగు మహిళనే వివాహం చేసుకొని ఉండవచ్చు. ఎందుకంటే గుజరాత్‌లో ఉన్నది కేవలం వారం రోజులే! మద్రాసు సమీపంలోని మైలాపూర్‌ వెళ్ళి క్రైస్తవసన్యాసి సెయింట్‌ థామస్‌ సమాధిని సందర్శించాడు. అయితే ఆంధ్రదేశంలో ఉన్నప్పుడే క్రైస్తవమతాన్ని వదిలేశాడు. ఆ తరువాత మలయా, సుమత్ర, జావా ద్వీపాలు, మయన్మార్‌ ప్రాంతాలకు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు, బంగారంతో నింపిన నౌకలతో నికోలో కోంటీ తిరుగుప్రయాణం ప్రారంభించాడు. స్వదేశం చేరిన నికోలో కోంటీని స్వదేశీయులు గొప్పగా అభినందించారు.
అయితే క్రైస్తవమతాన్ని వదిలిపెట్టడం మాత్రం వారికి నచ్చలేదు. ఈ విషయం నాటి వాటికన్‌ సిటీ పోప్‌ నాల్గవ ఏజెన్స్‌కి తెలిసింది. క్రైస్తవాన్ని ఎందుకు వదిలివేయా ల్సివచ్చిందో తెలియజేయమన్న ఏజెన్స్‌ ఆదేశం మేరకు తన పర్యటన విశేషాలను అనుభవాలను ‘లి వొయేజ్‌ ఎక్స్‌ ఇండెస్‌గా రాశాడు. 15,16 శతాబ్దాల్లో యూరప్‌ ఖండాన్ని ఆధునికం చేసిన ప్రఖ్యాత క్రైస్తవ మత సంస్కరణ ఉద్యమానికి కారణమైన గొప్ప పుస్తకాల్లో ఈ పుస్తకం కూడా ఒకటి. తన పర్యటనాజీవితంలో నేర్చుకున్న అరబిక్‌, పర్షియన్‌ భాషలకన్నా గొప్పగా ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అని తెలుగుకి తన మాతృభాషతో సమాన గౌరవాన్నిచ్చాడు. రెండు భాషలూ అజంత భాషలేననీ చెప్పాడు. అంటే తన ఇటాలియనొభాష ‘తెలుగు ఆఫ్‌ ద వెస్ట్‌’ (పడమటి తెలుగుభాష) అని అంగీకరించడమే కదా! ఒక విదేశీయుడు తెలుగు భాషను ప్రశంసించడం నికోలోకోంటీతోనే మొదలయింది.
ఇటలీ తదితరదేశాల్లోని ఇటాలియనొ వ్యవహర్తల సంఖ్య ఎనిమిది కోట్లు. ఆంధ్రరాష్ర్టంతో పాటు, ఇతర ప్రాంతాల్లోని తెలుగు వ్యవహర్తల సంఖ్య పదిహేడు కోట్లు. అయితే ఇటలీ ప్రజలకు తమ భాషాసంస్కృతుల పట్ల చాలా మమకారం. తెలుగుజాతికి అదే లోపం.

Courtesy: Surya Daily.

 

Tags: , , , , , , ,

Comments

No comments so far.
  • Leave a Reply
     
    Your gravatar
    Your Name
     
     
     
     
     
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com